సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ స్వాగతించారు. తీర్పుపై శనివారం సాయంత్రం ఆయన స్పందించారు. ‘ఇది ఎంతో ఆనందకరమైన క్షణం. మహోన్నతమైన ఉద్యమంలో పాల్గొనే అవకాశం దేవుడు నాకు కల్పించాడు. దేశ స్వాతంత్య్ర పోరాటం తరువాత అయోధ్య రామమందిరం కొరకు సాగిన ఉద్యమమే ఉన్నతమైనది. దానిలో పాల్గొన్నందుకు గర్వంగా ఉంది. సుదీర్ఘ పోరాటానికి సుప్రీంకోర్టు తీర్పుతో ఫలితం వచ్చింది’ అని అన్నారు. కాగా అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల స్థలంలో రామమందిరం నిర్మించాలని అద్వానీ పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. మందిర నిర్మాణం కొరకు గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర సైతం చేపట్టారు. ఆయన చేపట్టిన యాత్రతోనే మందిర నిర్మాణం ఉద్యమం ఊపందుకుంది. అద్వానీ బాటలోనే నడిచిన పలు హిందూసంఘాలు మందిర నిర్మాణం కొరకు మరింత ఉధృతంగా పోరాటం సాగించాయి.
కాగా రథయాత్ర ముగింపు సందర్భంగానే కరసేవకులు అయోధ్యంలోని బాబ్రీ మసీదును ధ్వసం చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అద్వానీ సీబీఐ విచారణను కూడా ఎదుర్కొన్నారు. కాగా దశాబ్దాలుగా సాగిన అయోధ్య వివాదానికి సుప్రీంకోర్టు నేటి తీర్పుతో ముగింపు పలికింది. వివాదాస్పద కట్టడం ఉన్న స్థలం హిందువులదేనని స్పష్టం చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు చెప్పింది. 2.77 ఎకరాల స్థలం హిందువులకే చెందుతుందని తేల్చిచెప్పేసింది. వివాదాస్పద స్థలానికి సంబంధించి 3 నెలల్లో కేంద్రం ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వివాదాస్పద స్థలాన్ని ట్రస్ట్ ఆధీనంలో ఉంచాలని, కేంద్రం ఏర్పాటు చేసే ట్రస్ట్‌లో నిర్మోహి అఖాడాకు ప్రాతినిథ్యం కల్పించాలని సూచించింది. ఈ తీర్పుతో అద్వానీ కళ సాకారమైందని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment