అయోధ్య వివాదం​; కీలక తీర్పు | Ayodhya Verdict: CJI Ranjan Gogoi Reading Out Judgement | Sakshi
Sakshi News home page

అయోధ్య వివాదం​; కీలక తీర్పు

Published Sat, Nov 9 2019 11:06 AM | Last Updated on Sat, Nov 9 2019 7:53 PM

Ayodhya Verdict: CJI Ranjan Gogoi Reading Out Judgement - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అత్యంత సున్నితమైన అయోధ్యలోని రామ జన్మభూమి– బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం శనివారం కీలక తీర్పు వెలువరించింది. వివాదాస్పద కట్టడం ఉన్న స్థలం హిందువులదేనని స్పష్టం చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు చెప్పింది. 2.77 ఎకరాల స్థలం హిందువులకే చెందుతుందని తేల్చిచెప్పేసింది. వివాదాస్పద స్థలానికి సంబంధించి 3 నెలల్లో కేంద్రం ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వివాదాస్పద స్థలాన్ని ట్రస్ట్‌ ఆధీనంలో ఉంచాలని, కేంద్రం ఏర్పాటు చేసే ట్రస్ట్‌లో నిర్మోహి అఖాడాకు ప్రాతినిథ్యం కల్పించాలని సూచించింది. ఆలయ నిర్మాణం, ట్రస్ట్‌ విధి విధానాలపై 3 నెలల్లోగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. మసీదు నిర్మాణానికి ముస్లింలకు అయోధ్యలో ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్‌బోర్డుకు 5 ఎకరాల స్థలం కేంద్రం లేదా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఇవ్వాలని ఆదేశించింది. రాజకీయాలు, చరిత్రలకు అతీతంగా న్యాయం నిలబడాలని సుప్రీంకోర్టు పేర్కొంది. 

తీర్పు పాఠాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ చదివారు. నిర్ణయానికి ముందు రెండు మతాలను విశ్వాసాలను పరిగణనలోకి తీసుకున్నట్టు చెప్పారు. పురావస్తు శాఖ నివేదికల ఆధారంగా తీర్పు వెలువరిస్తున్నట్టు పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందినదని, వివాదాస్పద స్థలంపై ఎవరూ యాజమాన్య హక్కు కోరలేదని స్పష్టం చేశారు. ప్రార్థనా మందిరాల చట్టం ప్రాథమిక విలువలు, మత సామరస్యాన్ని పరిరక్షిస్తుందని వెల్లడించారు. వివాదాస్పద స్థలంలో మందిరం ఉన్నట్టు పురావస్తు శాఖ నివేదికలు చెబుతున్నాయన్నారు. మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలంలో ఒక నిర్మాణం ఉందన్నారు. వివాదాస్పద స్థలంలో మసీదు లేదని, అక్కడ హిందూ నిర్మాణం ఉందని పురావస్తు శాఖ విభాగం చెబుతోందన్నారు. యాజమాన్య హక్కులనేవి నిర్దేశిత న్యాయసూత్రాల ఆధారంగా నిర్ణయిస్తామన్నారు.

అయోధ్యను రామజన్మభూమిగా హిందువులు విశ్వసిస్తారని, మందిరాన్ని కూలగొట్టి మసీదు నిర్మించారని పురావస్తు శాఖ ఎక్కడా చెప్పలేదన్నారు. రాముడు అయోధ్యలో జన్మించాడన్నది నిర్వివాదాంశమన్నారు. మసీదు ఎవరు కట్టారో, ఎప్పుడు కట్టారో స్పష్టం కాలేదని హైకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రెండు మతాల వారు వివాదాస్పద స్థలంలో ప్రార్థనలు జరిపేవారని చెప్పారు. మొఘుళుల కాలం నుంచే హక్కు ఉన్నట్టు వక్ఫ్‌ బోర్డు నిరూపించలేకపోయిందన్నారు. (చదవండి: మందిర నిర్మాణానికి మార్గం సుగమం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement