సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి తాము అనుకూలమని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. అయోధ్యలో వివాదస్పద స్థలంపై సుప్రీంకోర్టు వెలువరించిన నేపథ్యంలో రాజకీయ నాయకులు, పెద్దలు సంయమనం పాటించాలని లౌకికవాద విలువలను కాపాడాలని కోరింది. ‘సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. మేము రామమందిర నిర్మాణానికి సానుకూలంగా ఉన్నాం. మందిర నిర్మాణానికి ఈ తీర్పు తలుపులు తెరవడమే కాదు.. అయోధ్య అంశాన్ని రాజకీయం చేసిన బీజేపీ, ఇతరులకు తలుపులు మూసేసింద’ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా వ్యాఖ్యానించారు.
‘అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోంది. లౌకిక విలువలకు కట్టుబడాలని అన్ని రాజకీయ పార్టీలు, అన్ని మతాల వారిని కోరుతున్నాం. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ శాంతి, సౌభ్రాతృత్వాలను కలిగివుండాలని ఆకాంక్షిస్తున్నట్టు’ సీడబ్ల్యూసీ ఒక ప్రకటన విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు వెలువరించినా అందరూ శాంతి సామరస్యాలతో ఉండాలని అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ విజ్ఞప్తి చేశారు. (చదవండి: అయోధ్య తీర్పు.. ఎల్‌కే అద్వానీదే ఘనత)
Comments
Please login to add a commentAdd a comment