
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తీర్పు అనంతరం అయోధ్యలో నిర్మించబోయే రామమందిర నిర్మాణంలో పూర్తిగా బంగారపు ఇటుకలు వాడాలని హిందూ మహాసభ నాయకుడు స్వామి చక్రపాణి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ‘రామ మందిర నిర్మాణంపై త్వరలోనే సుప్రీంకోర్టు తీర్పు రానుంది. మందిర నిర్మాణానికి అనుకూలంగానే తీర్పు రాబోతుంది. మందిరాన్ని పూర్తిగా బంగారపు ఇటుకలతో నిర్మించాలి’ అని డిమాండ్ చేశారు.
కాగా భారత రాజకీయాలను ప్రభావితం చేయగల ‘రామ జన్మభూమి, బాబ్రీ మసీదు స్థల వివాదం’ కేసు తీర్పు నవంబర్‌లో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థల వివాదానికి సంబంధించి కేసులో ఇరు పక్షాల తరఫున వాదనలను అక్టోబర్ 18కల్లా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఇరుపక్షాలను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఈ కేసు తీర్పు మరో రెండు నెలల్లో వెలువడనుంది. మధ్యవర్తిత్వం, చర్చల ద్వారా ఇరుపక్షాల వారు వివాదాన్ని పరిష్కరించుకోవాలనుకుంటే అందుకు తమకేమీ అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు సీజే జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం తేల్చిచెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment