
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. ‘అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునివ్వడం శుభపరిణామం. చాలా ఏళ్లుగా కొనసాగుతున్నసమస్యకు పరిష్కారం దొరికింది. ఇది ఏ ఒక్కరి విజయం కాదు. యావద్భారతం సాధించిన ఘన విజయమిది. కేసు విషయంలో గతాన్ని పక్కనపెట్టి ఐకమత్యంగా ముందుకెళ్తూ.. శాంతి, సామరస్యాలతో కూడిన భారత నిర్మాణంలో మనమంతా భాగస్వాములు కావాలి. మన సర్వమానవ సౌభ్రాతత్వ సిద్ధాంతాన్ని కొనసాగిస్తూ.. మన సంస్కృతి, ఘనమైన వారసత్వాన్ని కాపాడుకునేందుకు లక్ష్యంతో పనిచేయాలి’ అని అభిప్రాయపడ్డారు.
కాగా అత్యంత సున్నితమైన అయోధ్యలోని రామ జన్మభూమి– బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం శనివారం కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వివాదాస్పద కట్టడం ఉన్న స్థలం హిందువులదేనని స్పష్టం చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు చెప్పింది. 2.77 ఎకరాల స్థలం హిందువులకే చెందుతుందని తేల్చిచెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment