సుప్రీంకోర్టు బయట పిటిషనర్లు, లాయర్లు
న్యూఢిల్లీ: రాజకీయంగా సున్నితమైన రామ జన్మభూమి– బాబ్రీ మసీదు వివాదం కేసును పూర్తిగా స్థల వివాదంగానే పరిగణిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో రోజువారీ విచారణ జరపాలన్న విజ్ఞప్తిని అత్యున్నత ధర్మాసనం తిరస్కరిస్తూ సాధారణ పద్ధతిలోనే విచారిస్తామంది. 700 మందికిపైగా పేద కక్షిదారులు(ఇతర కేసుల్లో) న్యాయం కోసం వేచిఉన్నారని, వారి కేసుల్ని కూడా విచారించాల్సి ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
ఈ కేసులో క్షక్షిదారులు కోర్టు ముందుంచిన డాక్యుమెంట్లు, సాక్ష్యాలు, ప్రాంతీయ భాషల పుస్తకాల్లోని సారాంశాన్ని ఇంగ్లిష్‌కి అనువదించి సమర్పించాలని ఆదేశించింది. విచారణను మార్చి 14కు ధర్మాసనం వాయిదా వేసింది. అలహాబాద్ హైకోర్టులో కేసు విచారణ రికార్డులకు సంబంధించిన వీడియో క్యాసెట్ల కాపీలను కక్షిదారులకు అందచేయాలని రిజిస్ట్రార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘రామ్ లల్లా విరాజ్‌మన్’ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదిస్తూ.. కేసులోని అవతలి వైపు కక్షిదారులు తమ వాదనల సారాంశాన్ని కోర్టుకు తెలపడంతో పాటు, తమతో పరస్పర మార్పిడి చేసుకోవాలని సూచించారు.
దీనికి ప్రతివాది తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తనకు నచ్చిన విధంగా వాదిస్తానని, తాను దేని ప్రామా ణికంగా వాదించాలన్నది వారు ఆదేశించలేరని పేర్కొన్నారు. హిందూ సంస్థల తరఫున సీనియర్ న్యాయవాది కె.పరాశరన్ వాదిస్తూ.. ‘ఈ సంఘటన త్రేతాయుగం నాటిది. 30 వేల ఏళ్ల నాటికి చెందిన ఏ సాక్ష్యాల్ని అప్పీలుదారులు తేగలరు? అందువల్ల మమ్మల్ని రికార్డుల్లోని సాక్ష్యాల వరకే పరిమితం చేయాలి’ అని విజ్ఞప్తిచేశారు. అయోధ్యలోని వివాదాస్పద భూమిని నిర్మోహి అఖారా, రామ లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డులకు సమానంగా పంచుతూ అలహాబాద్ హైకోర్టు గతంలోతీర్పునిచ్చింది.
ముస్లిం నేతలతో రవిశంకర్ చర్చలు
మరోవైపు అయోధ్య వివాద పరిష్కారం కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ గురువారం ముస్లిం నేతలతో చర్చించారు. సున్నీ వక్ఫ్ బోర్డు, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులతో పాటు ఇతరులు రవి శంకర్‌ను కలిసి అయోధ్య వివాదంలో కోర్టు వెలుపల రాజీకి మద్దతు తెలిపారని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘వేరే ప్రాంతానికి మసీదును తరలించే ప్రతిపాదనకు వారు మద్దతు ప్రకటించారు’ అని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment