‘డాక్టర్ బాంబ్’కు జీవితఖైదే | Dr. Bomb to Life Prisoner Jalis Ansari | Sakshi
Sakshi News home page

‘డాక్టర్ బాంబ్’కు జీవితఖైదే

Published Fri, May 13 2016 4:26 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

‘డాక్టర్ బాంబ్’కు జీవితఖైదే - Sakshi

‘డాక్టర్ బాంబ్’కు జీవితఖైదే

సాక్షి, హైదరాబాద్: బాబ్రీ మసీదు విధ్వంసానికి ప్రతీకారంగా హైదరాబాద్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో 43 బాంబు పేలుళ్లకు పాల్పడిన, ‘డాక్టర్ బాంబ్’గా పిలిచే జలీస్ అన్సారీకి జీవితఖైదే సరైందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రాజస్థాన్‌లో విధ్వంసానికి సంబంధించి అన్సారీ సహా 11 మందికి రాజస్తాన్‌లోని అజ్మీర్ న్యాయస్థానం విధించిన ఈ శిక్షను బుధవారం సుప్రీంకోర్టు సమర్థించింది. తన్జీమ్ ఇస్లా ఉల్ ముస్లమీన్(టీఐఎం) పేరుతో సంస్థను ఏర్పాటు చేసి అన్సారీ సృష్టించిన విధ్వంసాలు నగరంలోనూ ఐదు ఉన్నాయి. అన్సారీతో పాటు అప్పట్లో నగరంలో నివసించిన అబ్దుల్ కరీం తుండా సైతం ఇందులో కీలకపాత్ర పోషించాడు.

తుండాను 2012లో ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. ముంబై ఏటీఎస్ అధికారులు 2010 అక్టోబర్‌లో గోల్కొండ ప్రాంతంలో అరెస్ట్ చేసిన మహారాష్ట్ర వాసి సయ్యద్ ముసద్ధిఖ్ వహీదుద్దీన్ ఖాద్రీ సైతం ఇతడి ప్రధాన అనుచరుడే. ముంబైకి అన్సారీ ముంబాయ్ వర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. 1992లో బాబ్రీ విధ్వంసానికి ప్రతీకారంగా తుండా, అన్సారీ, కోల్‌కతాకు చెందిన అబ్దుల్లా మసూద్, వరంగల్ వాసి ఆజం ఘోరీ కలసి టీఐఎంను స్థాపించారు. ఈ మాడ్యుల్ 1993-94ల్లో రాజస్తాన్, మహారాష్ట్ర, హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా 43 బాంబు పేలుళ్లకు పాల్పడ్డాడు.

ఈ మాడ్యుల్ టార్గెట్ చేసిన వాటిలో రైళ్లు, రైల్వేస్టేషన్లే ఎక్కువ. 1993లో అన్సారీ తన మాడ్యుల్ సాయంతో రాజస్తాన్, మహారాష్ట్రతో పాటు నగరంలోని ఐదు ప్రాంతాల్లో పేలుళ్లకు ఒడిగట్టి.. నలుగురి ప్రాణాలు తీశాడు. తక్కువ ప్రభావం గల బాంబులను తయారు చేయడంలో దిట్ట అయిన అన్సారీని పోలీసు, నిఘా వర్గాలు ‘డాక్టర్ బాంబ్’ అనే పేరుతో పిలుస్తుంటాయి. 1994 జనవరి 12న  ముంబై పోలీసులు అన్సారీని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి పీటీ వారెంట్‌పై అజ్మీర్ తరలించారు. అప్పటి నుంచి అక్కడి జైలులోనే ఉండటంతో సిటీలోని కేసులు పెండింగ్‌లో ఉండిపోయాయి. 2012లో రాజస్తాన్‌లోని కేసుల విచారణ పూర్తికావడంతో ఆ పోలీసులు హైదరాబాద్ తీసుకువచ్చి మళ్లీ తీసుకువెళ్లారు. అన్సారీపై హైదరాబాద్‌లో నమోదైన కేసులు ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.
 
నగరంలో టీఐఎం ఘాతుకాలివి...
12.08.1993: అబిడ్స్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ట్రాఫిక్ జంక్షన్ బాక్స్‌పై బాంబు విసిరారు. సుబ్బారాయుడు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. ఇదే రోజు హుమాయున్‌నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో మరో బాంబు పేలింది.
 
12.09.1993: సికింద్రాబాద్‌లోని రైల్వే రిజర్వేషన్ కాంప్లెక్స్ క్యాష్ రూమ్ వద్ద పేలుడు. బాలాజీ, బాలసుబ్రహ్మణ్యం అనే ఇద్దరు మణించారు. మరికొందరు క్షతగాత్రులయ్యారు.
 
22.10.1993: నాంపల్లిలోని మదీనా ఎడ్యుకేషన్ సెంటర్ వద్ద పేలుడు. ఇందులో మహ్మద్ పాషా అనే వ్యక్తి మరణించగా.. యూసుఫుద్దీన్, మల్లమ్మ తదితరులు గాయపడ్డారు.
 
6.12.1993: మల్కాజ్‌గిరి పరిధిలోని మౌలాలీ రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్స్‌పై ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను టార్గెట్ చేసుకుని బాంబు పేల్చగా.. ఓ వ్యక్తి మరణించాడు. మరికొందరు గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement