సాధ్వి రితంభర | special story to sadhvi ritambhara | Sakshi
Sakshi News home page

సాధ్వి రితంభర

Published Sun, May 7 2017 10:58 PM | Last Updated on Tue, Sep 5 2017 10:38 AM

సాధ్వి రితంభర

సాధ్వి రితంభర

సాధ్వి రితంభర... ఈ పేరు ఎప్పుడో కాని ప్రముఖంగా వినిపించదు. 1992లో ఒకసారి వినిపించింది... బాబ్రీ మసీదు ధ్వంసమైనప్పుడు! మళ్లీ ఇన్నేళ్లకు ఇటీవల వినిపించింది... బాబ్రీ కేసును సుప్రీంకోర్టు తిరగదోడినప్పుడు! బాబ్రీ కేసును అలహాబాద్‌ కోర్టు కొట్టేశాక, అలా కొట్టేయడాన్ని సవాల్‌ చేస్తూ సీబీఐ... సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో... ‘విచారణ కొనసాగాల్సిందే’ అని సుప్రీం కోర్టు ఏప్రిల్‌ 19న తీర్పు చెప్పింది. అడ్వాణీ, జోషీ, ఉమాభారతి, మరికొందరితో పాటు సాధ్వి రితంభర కూడా ఇప్పుడా విచారణను ఎదుర్కోవాలి. వచ్చే రెండేళ్లలో ఎప్పుడు పిలిస్తే అప్పుడు లక్నో కోర్టుకు వెళ్లి రావాలి.

ఇక్కడో విశేషం ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతున్నంత కాలం.. కేసులో నిందితులుగా ఉన్నవారు తమ పని తాము చేసుకుపోలేరు. ప్రస్తుతం సాధ్వి రితంభర పరిస్థితి అదే. ఆమెకు చాలా పనులున్నాయి. ఆమె సాధ్వి అయితే కావచ్చు కానీ, మానవ బాంధవ్యాలను వదులుకున్న తపస్విని మాత్రం కాదు. హిందూ సంస్కృతీ సంప్రదాయాల సుసంపన్నతకు కృషి చేస్తూనే... అనాథ బాలలను, మహిళలను.. ప్రేమతో, వాత్సల్యంతో చేరదీస్తున్నారు. పరాశక్తిలా, ఒక కార్యకర్తలా... హైందవ సమాజపు విలువల్ని
సంరక్షించే పనిలో నిమగ్నమై ఉన్నారు.

మాట అంటుకుంటుంది
ముత్యమంత పసుపు ముఖమంత ఛాయ. సాధ్వి రితంభర భారతీయ సంస్కృతికి ఒక రాజకీయ ఛాయ. మాట కటువు. మనసు మృదువు. నవ్వు చంద్రోదయం. ఆగ్రహం చండప్రచండం. ప్రసంగం మహా ప్రళయం! ఉన్నది రాజకీయాల్లోనే... కానీ రాజకీయాలు పడవు. స్ట్రయిట్‌ ఫార్వర్డ్‌. సామాజిక కార్యకర్త. చెయ్యి చాస్తే పెడుతుంది. చేతినిండా ఉంటే  పంచుతుంది. అమ్మాయిల్ని ఎవరైనా కన్నెత్తి చూస్తే.. కర్రెత్తుతుంది. మతాన్ని ప్రబోధిస్తుంది. మతాన్ని అనుసరిస్తుంది, ఆచరిస్తుంది. ఆమె పుట్టింది 1964 జనవరి 2 న. ఆమె ఎవరో, ఏమిటో ఈ దేశానికి తెలిసింది 1992 డిసెంబర్‌ 6న. అయోధ్యలో కట్టడం కూలిన రోజు అది. విశ్వ హిందూ పరిషత్‌లో, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌లో ఆమె ఒక దుందుడుకు సభ్యురాలు. ‘దుర్గావాహిని’ (విశ్వ హిందూ పరిషత్‌ మహిళా విభాగం) చైర్‌పర్సన్‌. దుర్గావాహిని అంటే దుర్గమ్మ సైన్యం. అసలు ఇవన్నీ కాదు. రామ కథ చెబితే రితంభరే చెప్పాలి. హత్తుకునేలా కథ... అంటుకునేలా మాట! ఇదీ ఆమె స్పెషాలిటీ.

వెలుగులోంచి చీకట్లోకి
బాబ్రీ కూల్చివేతతో దేశాన్ని దాదాపుగా మతకలహాల అంచుల్లోకి నడిపించిన వ్యక్తులలో సాధ్వి రితంభర కూడా ఒకరని కేసును దర్యాప్తు చేసిన లిబర్హాన్‌ కమిషన్‌ నిర్ధారించింది. బాబ్రీ ఉదంతంతో వెలుగులోకి వచ్చిన రితంభర, అదే ఉదంతంతో తనని కొన్నేళ్లపాటు కనుమరుగు చేసుకుంది. ఆమెను 1995 ఏప్రిల్‌లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అరెస్ట్‌ చేశారు. అయితే అది బాబ్రీ కేసులో కాదు. మదర్‌ థెరిసాను ఆమె ‘మాయలాడి’ అన్నారు. యూపీ సీఎం ములాయంను ‘మ్యాన్‌ ఈటర్‌’ అన్నారు. అనేక ఇతర మతాల పట్ల ఆమె అసహనంగా ఉంటారు. క్రిస్టియన్‌ మిషనరీలపై ఆమె స్పీచ్‌ రగులుకుంది. ఒక నన్‌ను ముగ్గురు ఆగంతకులు చంపేశారు. పర్యవసానమే రితంభర అరెస్ట్‌.

దుర్గా వాహిని
విశ్వహిందూ పరిషత్‌ మహిళా విభాగమే ‘దుర్గా వాహిని’. ఈ సంస్థ చైర్‌పర్సన్‌ సాధ్వి రితంభర. సంస్థను 1991లో స్థాపించింది కూడా రింతభరే. మహిళలను శారీరకంగా, మానసికంగా దృఢపరచి, వారిలో విజ్ఞానాన్ని, వికాసాన్నీ పెంపొందించడం వాహిని ముఖ్య ధ్యేయం.  ఇందులో సభ్యులుగా చేరిన యువతులకు ఆత్మరక్షణ విద్యలను నేర్పిస్తారు. యుద్ధ కళల్లో శిక్షణ ఇస్తారు. విపత్తులలో, విలయాలలో, ఇతర అత్యవసర పరిస్థితులలో దేశ ప్రజలకు ఈ దుర్గావాహిని దళం సేవలు అందిస్తుంది. అయితే ఈ సంస్థలో హిందూ అతివాద ధోరణులు కూడా కనిపిస్తుంటాయన్న విమర్శ కూడా ఉంది. ఈ విమర్శను రితంభర నవ్వుతూ స్వీకరిస్తారు. అతివాదాన్ని ఒక శక్తిగా ఆమె అభివర్ణిస్తారు.

అసలు పేరు నిషా
పంజాబ్‌లోని లూధియానా జిల్లాలో దొరహ అనే పట్టణం ఉంది. అక్కడ పుట్టింది సాధ్వి రితంభర. నిషా ఆమె అసలు పేరు. మిఠాయిలు తయారు చేసి అమ్మే కుటుంబం వారిది. లోయర్‌ మిడిల్‌ క్లాస్‌. ఆమెకు పదహారేళ్ల వయసులో ఆ ఊరికి ఒక స్వామీజీ వచ్చాడు.  ఆయన పేరు యుగ పురుష మహా మండలేశ్వర స్వామీ పరమానంద గిరి జీ మహరాజ్‌. ఆయన్ని చూడ్డానికి వెళ్లింది నిషా కుటుంబం. ఆయన నిషాని చూశాడు. నిషా గలగలా మాట్లాడుతోంది. హైందవ సంస్కృతీ సంప్రదాయాల వ్యాప్తికి ఈ గలగలలు అవసరం అనుకున్నాడు స్వామీజీ. ఆయనతో పాటు హరిద్వార్‌ వెళ్లిపోయింది నిషా. స్వామీజీకి అక్కడో ఆశ్రమం ఉంది. అక్కడి నుంచి ఆయన ఇండియా అంతా పర్యటిస్తుంటారు. నిషా కూడా ఆయన వెంటే పర్యటించింది. ఎలా ప్రసంగించాలో ఆయన్ని చూసే నేర్చుకుంది. ఆ సమయంలోనే స్వామీజీ ఆమె పేరును రితంభరగా మార్చారు. రితంభర పెళ్లి చేసుకోలేదు. సాధ్విగా ఉండాలని నిశ్చయించుకుంది. ఆ తర్వాత ఆమె ప్రయాణం రాష్ట్రీయ సేవిక సమితిలోకి. ఆర్‌.ఎస్‌.ఎస్‌. మహిళా విభాగం అది. అందులో సభ్యురాలిగా చేరింది. తర్వాత విశ్వహిందూ పరిషత్‌లో ప్రముఖ సభ్యురాలు అయింది.

పరోపకారానికి పరాశక్తి
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 1993లో మధురకు, బృందావనానికి సమీపంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించే ప్రయత్నం చేశారు రితంభర. ఆశ్రమ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కూడా ప్రభుత్వం నుంచి నామమాత్రపు ధరకు తీసుకున్నారు.  అయితే కల్యాణ్‌సింగ్‌ ప్రభుత్వం రద్దయి, రాష్ట్రపతి పాలన రావడంతో స్థలం స్వాధీనం కాలేదు. ఆ తర్వాత వచ్చిన ములాయం సింగ్‌.. స్వాధీనం కానివ్వలేదు. తిరిగి 2002లో రామ్‌ ప్రకాశ్‌ గుప్తా ముఖ్యమంత్రి అయ్యాక గాని స్థలం ఆమె చేతికి రాలేదు. గుప్తా 20 కోట్ల రూపాయల విలువైన 17 హెక్టార్ల భూమిని (42.5 ఎకరాలు) ఆమె ఏర్పాటు చేసిన పరాశక్తిపీఠం ట్రస్టుకు ఏడాదికి 1 రూపాయి రుసుము చొప్పున 99 ఏళ్ల కాలానికి రాసిచ్చారు. మహిళల్లో భక్తి భావాన్ని పెంపొందించడం, మహిళలకు కరాటే, గుర్రపుస్వారీ, తుపాకీ పేల్చడం నేర్పించడంతో పాటు, మహిళల్ని కాన్ఫిడెంట్‌గా తయారు చెయ్యడం ఈ శక్తిపీఠం ఆధ్వర్యంలోని బృందావన ఆశ్రమం లక్ష్యం. ఇలాంటి ఆశ్రమాలను అనా«థ బాలలు, మహిళలు, వితంతువుల కోసం ఇండోర్, ఢిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్‌లలో కూడా నడుపుతున్నారు రితంభర.

అమ్మ రితంభర
మగవాళ్లు సన్యాసులుగా మారితే... వాళ్లు సన్యాసులుగా మిగిలిపోతారంతే. మహిళ సన్యాసినిగా మారితే... తనలో అంతర్లీనంగా దాగి ఉండే మాతృత్వపు మమకారాన్ని సమాజానికి పంచుతుంది. సాధ్వి రితంభర కూడా అదేవిధంగా.. తల్లి లేని పిల్లలను చేరదీస్తున్నారు. వారికి అమ్మ ప్రేమను పంచుతున్నారు. అందుకోసమే ఉత్తరప్రదేశ్‌లో ‘వాత్సల్య గ్రామ్‌’ను స్థాపించారు. తల్లి ప్రేమ నిస్వార్థమైనది. షరతులు లేనిది. అలాంటి ప్రేమను కడుపున పుట్టిన బిడ్డకైతేనే పంచగలరనే భావన తుడిచేశారు రితంభర. తన మానస పుత్రిక వాత్సల్య గ్రామ్‌లో అనాథ పిల్లల సంరక్షణను చూసుకునే వారికి ఆమె చెప్పే మాట ఒక్కటే. ‘‘శ్రీకృష్ణుడిని అమితంగా ప్రేమించిన యశోద కృష్ణుడిని కనలేదు. తన కడుపున పుట్టలేదని తెలిసిన తర్వాత కూడా అంతే ప్రేమతో ఆదరించింది. తల్లిలేని పిల్లల పట్ల మన బాధ్యత కూడా అలాంటిదే. అందరూ యశోదలు కావాలి’’ అని! ఇక అనాథ పిల్లలను పెంచడంలో ఆమె చెప్పే తత్వం మహోన్నతంగా కనిపిస్తుంది.

‘‘ప్రతి బిడ్డ కూడా దేవుని అపూర్వమైన సృష్టిలో ఒక భాగం. ఆత్మ.. దైవత్వానుసారం తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి పుడుతుంది. ఆ పుట్టుకను గౌరవించాలి’’ అంటారు రితంభర. అలాగే... ‘‘అనాథ పిల్లలను చేరదీసే శరణాలయాలు కేవలం శరణార్థ శిబిరాలుగా ఉండిపోకూడదు. వాళ్లకు ఆహారం, దుస్తులు ఇచ్చి నీడ కల్పిస్తే బాధ్యత తీరిపోదు. వారిలో ఆత్మగౌరవాన్ని కాపాడాలి. తల్లి ఒడిలో ఉన్నప్పుడు కలిగే భద్రమైన భావనను కలిగించాలి. ఒక్క మాటలో... పిల్లలు ఏ ఆశ్రమంలోనో, ఎవరి ఆశ్రయంలోనో ఉన్నామని అనుకోకుండా తమ ఇంట్లో ఉన్నట్లే అనుకోవాలి’’ అంటారు అమ్మ రితంభర.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement