లక్నో: రామజన్మభూమిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అయోధ్యలో కొత్తగా నిర్మించబోయే మసీదు, గతంలో ఉన్న బాబ్రీమసీదు కొలతలతోనే ఉంటుందని మసీదు నిర్మాణ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. బాబ్రీ మసీదు స్థానంలో నూతన మసీదు నిర్మాణానికి అయోధ్యలోని ధనిపూర్ గ్రామంలో ఐదు ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలంలో ఒక ఆస్పత్రి, మ్యూజియం కూడా కడతామని, మ్యూజియంకు ప్రముఖ విశ్రాంత అధ్యాపకుడు పుష్పేశ్ పంత్ క్యూరేటర్‌గా ఉంటారని ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్(ఐఐసీఎఫ్) సెక్రటరీ అతార్ హుస్సేన్ చెప్పారు. క్యూరేటర్ బాధ్యతలు నిర్వర్తించేందుకు ఆయన అంగీకరించారన్నారు. (చదవండి: సెప్టెంబర్ 17 నుంచి మందిర నిర్మాణం)
ఇక ఐదెకరాల్లో జరిగే నూతన మసీదు నిర్మాణాన్ని ఐఐసీఎఫ్ పర్యవేక్షించనుంది. ఉత్తర్‌ప్రదేశ్ సున్ని సెంట్రల్ వక్ఫ్‌బోర్డ్ ఈ ట్రస్ట్‌ను ఏర్పరించింది. ఐదెకరాల్లో దాదాపు 15వేల చదరపు అడుగుల్లో మసీదు నిర్మాణం జరుగుతుందని, ఇది బాబ్రీ మసీదు ఉన్న సైజులోనే ఉంటుందని, మిగిలిన స్థలంలో ఆస్పత్రి, మ్యూజియం తదితరాలుంటాయని హుస్సేన్ చెప్పారు. ఈ ప్రాజెక్టుకు జామియా మిలియా ఇస్లామియాకు చెందిన అక్తర్ వాస్తుశిల్పిగా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ మొత్తం నిర్మాణం భారతీయ ఆత్మను, ఇస్లాం సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంటుందని అక్తర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment