లక్నో: అయోధ్యలో ఇవాళ (బుధవారం) నిర్వహించే దీపోత్సవ్ కార్యక్రమానికి తనను నిర్వాహకులు ఆహ్వానించలేదని సమాజ్‌వాదీ పార్టీ నేత, ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ తెలిపారు. మన పండుగల విషయంలో కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపణలు చేశారు. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘దీపావళి సందర్భంగా అయోధ్య ప్రజలందారికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నేను ఇక్కడి నుంచి ఎన్నిక కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. మన పండుగలను కూడా బీజేపీ రాజకీయం చేస్తోంది. దీపావళి పండుగను బీజేపీ రాజకీయం చేసి ప్రజలను విభజిస్తోంది. నాకు దీపోత్సవ్‌కు పాస్ లేదా ఆహ్వానం అందలేదు. ఈ పండుగ ఏ ఒక్క వర్గానికి చెందినది కాదు.
..నేను ఈరోజు అయోధ్యకు వెళ్తున్నా. నాకు నిర్వాహకుల నుంచి దీపోత్సవ్ కార్యక్రమానికి ఎటువంటి పాస్ లేదా ఆహ్వానం రాలేదు’’ అని అన్నారు. అయోధ్య ఆధ్యాత్మిక నగరం.. ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుందన్న విషయం తెలిసిందే. అయోధ్యలో అట్టహాసంగా నిర్వహించనున్న దీపోత్సవ్ కార్యక్రమానికి స్థానిక ఎంపీని ఆహ్వానించకపోవటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
దీపావళి సందర్భంగా సరయూ నది ఒడ్డున లక్షలాది దీపాలు వెలిగించే దీపోత్సవ్ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇవాళ సాయంత్రం నుంచి రాత్రి వరకు సరయూ నది ఒడ్డున సుమారు 28 లక్షల దీపాలను వెలిగించటం ద్వారా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment