faizabad
-
‘అయోధ్య దీపోత్సవ్‌కు ఆహ్వానం అందలేదు’
లక్నో: అయోధ్యలో ఇవాళ (బుధవారం) నిర్వహించే దీపోత్సవ్ కార్యక్రమానికి తనను నిర్వాహకులు ఆహ్వానించలేదని సమాజ్‌వాదీ పార్టీ నేత, ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ తెలిపారు. మన పండుగల విషయంలో కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపణలు చేశారు. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘దీపావళి సందర్భంగా అయోధ్య ప్రజలందారికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నేను ఇక్కడి నుంచి ఎన్నిక కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. మన పండుగలను కూడా బీజేపీ రాజకీయం చేస్తోంది. దీపావళి పండుగను బీజేపీ రాజకీయం చేసి ప్రజలను విభజిస్తోంది. నాకు దీపోత్సవ్‌కు పాస్ లేదా ఆహ్వానం అందలేదు. ఈ పండుగ ఏ ఒక్క వర్గానికి చెందినది కాదు. ..నేను ఈరోజు అయోధ్యకు వెళ్తున్నా. నాకు నిర్వాహకుల నుంచి దీపోత్సవ్ కార్యక్రమానికి ఎటువంటి పాస్ లేదా ఆహ్వానం రాలేదు’’ అని అన్నారు. అయోధ్య ఆధ్యాత్మిక నగరం.. ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుందన్న విషయం తెలిసిందే. అయోధ్యలో అట్టహాసంగా నిర్వహించనున్న దీపోత్సవ్ కార్యక్రమానికి స్థానిక ఎంపీని ఆహ్వానించకపోవటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.దీపావళి సందర్భంగా సరయూ నది ఒడ్డున లక్షలాది దీపాలు వెలిగించే దీపోత్సవ్ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇవాళ సాయంత్రం నుంచి రాత్రి వరకు సరయూ నది ఒడ్డున సుమారు 28 లక్షల దీపాలను వెలిగించటం ద్వారా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
Photo Feature: ‘నాట్య’ మయూరం
మండల పరిధిలోని ఫైజాబాద్ శివారులోని పొలాల్లో పురివిప్పిన మయూరం చూపరులను ఆకట్టుకుంది. కురిసిన వర్షాలకు పచ్చగా చిగురించిన గడ్డిపై అందంగా మయూరం పురివిప్పడంతో ‘సాక్షి’ క్లిక్ మనిపించింది. – చిలప్‌చెడ్(నర్సాపూర్) -
ఫైజాబాద్ పేలుళ్లు : ఉగ్రవాదులకు యావజ్జీవ శిక్ష
లక్నో : ఫైజాబాద్ కోర్టుపై 2007లో జరిగిన బాంబు దాడి కేసులో కోర్టు శుక్రవారం ఇద్దరు దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మరొకరిని సాక్ష్యాలు లేని కారణంగా వదిలేసింది. వివరాల్లోకెళితే.. 2007లో ఫైజాబాద్, లక్నో, వారణాసిలలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఫైజాబాద్‌లో కోర్టులో పేలుళ్లు జరుగగా, నలుగురు చనిపోయారు. 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈకేసులో 12 ఏళ్ల విచారణ తర్వాత తీర్పు వెలువడగా, ఇద్దరు ఉగ్రవాదులు మహమ్మద్ తారిక్, మహమ్మద్ అక్తర్‌లకు శిక్ష విధిస్తూ, ఇద్దరికీ చెరో రూ. 50 వేలు జరిమానా విధించింది. -
మోదీ ప్రపంచం చుట్టేస్తారు కానీ..
లక్నో : ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ విమర్శలతో విరుచుకుపడ్డారు. అయిదేళ్ల పదవీ కాలంలో ప్రధాని మోదీకి తన సొంత నియోజకవర్గం వారణాసి పరిధిలోని ఏ ఒక్క గ్రామాన్నీ సందర్శించే సమయం దొరకలేదని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని ఫైజాబాద్‌లో శుక్రవారం జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రియాంక ప్రసంగించారు. అమెరికా, జపాన్, చైనా వంటి దేశాలన్నీ మోదీ తిరుగుతారు...కానీ ఆయనకు తన నియోజకవర్గంలోని ప్రజలను కలుసుకునే సమయం మాత్రం ఉండదని ఎద్దేవా చేశారు. మోదీ తీరు ప్రభుత్వ అభిమతానికి అద్దం పడుతోందని, ఆయన సర్కార్ సంపన్నులను మరింత సంపన్నులుగా చేయడంపై దృష్టి సారించిందని, పేదలను విస్మరించిందని ప్రియాంక ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఆమె ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక సర్కార్‌గా ఆమె అభివర్ణించారు. దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం సహా దేశంలోని అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసేందుకు బీజేపీ ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందని ధ్వజమెత్తారు. -
ఏడాదిలో 25 ప్రాంతాల పేర్లు మార్పు
న్యూఢిల్లీ: ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 25 నగరాలు, గ్రామాల పేర్లను మార్చేందుకు కేంద్రం అనుమతులిచ్చింది. ఈ పేర్ల మార్పు ప్రతిపాదనల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఒకటి. అయితే, పశ్చిమ బెంగాల్ పేరును ‘బంగ్లా’ గా మార్చాలన్న ప్రతిపాదన కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. ఇటీవల అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా, ఫైజాబాద్‌ను అయోధ్యగా పేరు మారుస్తూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏడాది కాలంలో ఆంధ్రపదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిని రాజమహేంద్రవరంగా, ఒడిశాలోని భద్రక్ జిల్లా ఔటర్ వీలర్‌ను ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్‌గా, కేరళలోని మలప్పుర జిల్లా అరిక్కోడ్‌ను అరీకోడ్‌గా, హరియాణాలోని జింద్ జిల్లా పిండారిని పందు–పిండారగా, నాగాలాండ్‌లోని కిఫిరె జిల్లా సాంఫూర్‌ని సాన్‌ఫూరెగా పేర్లు మార్చారు. ఈ ప్రతిపాదనలను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం హోంశాఖ అమలు చేస్తుంది. కాగా, అహ్మదాబాద్‌ను కర్ణావతిగా పేరు మార్చాలన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నామని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ వెల్లడించారు. ఫైజాబాద్‌పై మిశ్రమ స్పందన ఫైజాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్యగా మార్చిన సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయంపై స్థానికుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. అవసరం లేకుండానే కేవలం రాజకీయ కారణాలతో పేరును మారుస్తున్నారని, దీని వల్ల చారిత్రక నగరానికి ఉన్న గుర్తింపు తెరమరుగవుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ..అది అయోధ్య కీర్తిప్రతిష్టల్ని మరింత ఇనుమడింపజేస్తుందని మరికొందరు అభిప్రాయపడ్డారు. -
‘పేరు’ గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనా!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2017లో ఆదిత్యనాథ్ యోగిని ఎంపిక చేసినప్పుడు ‘కరడుగట్టిన హిందూత్వ’ వాదిని ఎంపిక చేయడానికి తామేమి వెనకాడమని బీజేపీ అధిష్టానం స్పష్టం చేసింది. అప్పటికీ గోరఖ్‌పూర్ ఆలయానికి పీఠాధిపతిగా కొనసాగుతున్న ఆయనపై పలు దొమ్మి కేసులతోపాటు మత ఘర్షణలు, హిందూ, ముస్లింల మధ్య మత విద్వేషాలను సృష్టించేందుకు ప్రయత్నించారంటూ పలు కేసులు ఉన్నాయి. ఆయన అధికారంలోకి వచ్చాన తనపై ఉన్న అన్ని కేసులను తానే స్వయంగా కొట్టివేసుకున్నారు. బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్‌ను పాకిస్తాన్ టెర్రరిస్టుగా అభివర్ణించి, మసీదుల్లో హిందూ విగ్రహాలను ప్రతిష్టిస్తానంటూ ఆదిలోనే వివాదాస్పదుడిగా ముద్ర పడిన యోగి ఆదిత్యనాథ్ యూపీలోని అన్ని ముస్లిం ప్రాంతాల పేర్లను తొలగించి వాటి స్థానంలో హిందూ పేర్లను ప్రవేశ పెడుతూ పోతున్నారు. గోరఖ్‌పూర్‌లోని భారత వైమానిక దళానికి చెందిన విమానాశ్రయానికి మహాయోగి గోరఖ్‌నాథ్ పేరును పెట్టారు. ముఘల్సరాయ్ రైల్వేస్టేషన్‌కు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ అని, మొఘల్ చక్రవర్తి అక్బర్ కనుగొన్న అలహాబాద్ నగరం పేరు మార్చి ప్రయాగ్‌రాజ్ పేరు పెట్టారు. ఫైజాబాద్ జిల్లాను అయోధ్యగా మారుస్తున్నట్లు దీపావళి వేడుకల్లో ఆదిత్యనాథ్ ప్రకటించారు. గతంలోనే ఉర్దూ బజార్‌ను హిందీ బజార్‌గా, హుమాయున్ నగర్‌ను హనుమాన్ నగర్‌గా మార్చారు. తాజ్ మహల్ పేరును కూడా మార్చి రామ్ మహల్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఓ ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో రామ రాజ్యాన్ని స్థాపిస్తానని ముఖ్యమంత్రయిన కొత్తలో ప్రకటించిన ఆయన పేర్ల ఆలోచనలో పడి ఆ విషయాన్ని పూర్తిగా మరచిపోయినట్లున్నారు. ఒక్క భారత్‌లోనే కాకుండా యావత్ ప్రపంచంలోనే పేద ప్రాంతంగా, పరిపాలన పూర్తిగా స్తంభించిపోయిన రాష్ట్రంగా యూపీ ఇప్పుడు గుర్తింపు పొందింది. సబ్ సహారా ఆఫ్రికాలో పుట్టడం కన్నా యూపీలో ఓ శిశువు జన్మిస్తే నెల లోపల ఆ శిశువు మరణించే అవకాశాలు రెండింతలు ఉన్నాయని ‘లాన్సెట్’ మెడికల్ జర్నల్ తాజా సంచికలో వెల్లడించింది. పొరుగునున్న నేపాల్‌కన్నా యూపీలో మనిషి ఆయుషు ప్రామాణం తక్కువ. నైజీరియా, బంగ్లాదేశ్‌లకన్నా సరాసరి రాష్ట్ర జీడీపీ రేటు తక్కువ. యూపీలోని కాన్పూర్ నగరాన్ని ప్రపంచంలోనే అతి కాలుష్యనగరంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలనే ప్రకటించింది. ఇక మానవ అభివృద్ధి సూచికలో పాకిస్థాన్ కన్నా వెనకబడి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధిపై యోగి దృష్టి పెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. -
ఫైజాబాద్.. ఇక అయోధ్య
అయోధ్య: 2019 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మళ్లీ రామ జపం అందుకుంది. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫైజాబాద్ జిల్లా పేరును ఏకంగా అయోధ్యగా మారుస్తామని ప్రకటించారు. అయోధ్య ఫైజాబాద్ జిల్లాలోనే ఉంటుంది. అయోధ్యలో రాముడి పేరిట విమానాశ్రయాన్ని, దశరథుడి పేరుతో వైద్య కళాశాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మంగళవారం అయోధ్యలో జరిగిన దీపోత్సవం కార్యక్రమంలో యోగి ఈ ప్రకటన చేశారు. ‘అయోధ్య మన గౌరవానికి చిహ్నం. గర్వకారణం. అయోధ్యకు ఎవ్వరూ అన్యాయం చేయలేరు’ అని అన్నారు. అయితే యోగి రాముడి విగ్రహం లేదా రామ మందిర నిర్మాణంపై ప్రకటన చేస్తారని భావించినప్పటికీ వాటి గురించి ప్రస్తావించలేదు. అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మారుస్తామని ఇప్పటికే చెప్పగా.. లక్నోలోని ఏకనా అంతర్జాతీయ క్రికెట్ మైదానం పేరును అటల్ బిహారీ వాజ్‌పేయి మైదానంగా మార్చారు. ఈ పేర్ల మార్పు నిర్ణ యాలను విపక్షాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. అయోధ్యంలో ఘనంగా వేడుకలు అయోధ్యలో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిగా దక్షిణ కొరియా ప్రథమ పౌరురాలు కిమ్–జుంగ్–సూక్ హాజరయ్యారు. ఆమెతోపాటు దక్షిణ కొరియా అత్యున్నత స్థాయి అధికారుల బృందం కూడా వచ్చింది. రాణి సూరిరత్న స్మారక సందర్శనతో సూక్ తన అయోధ్య పర్యటనను ప్రారంభించారు. అయోధ్య యువరాణి అయిన సూరిరత్న క్రీస్తు శకం 48వ సంవత్సరంలో కొరియా వెళ్లి అక్కడి యువరాజును వివాహమాడారని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. కొరియా యువరాజుతో పరిణ యం అనంతరం సూరిరత్న పేరును హియో హ్వాంగ్–ఓక్‌గా మార్చారు. ప్రస్తుతం అయోధ్యలో ఉన్న యువరాణి స్మారకానికి కూడా ఈ పేరే ఉంటుంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలసి స్మారక సుందరీకరణ పనులకు సూక్ భూమి పూజ కూడా చేశారు. అనంతరం సరయూ నదీ తీరానికి వెళ్లి రాముడు, సీత వేషం వేసుకున్న కళాకారులకు స్వాగతం పలికారు. అయోధ్యపై చర్చలుండవు: బీజేపీ నేత అయోధ్య వివాదాన్ని చర్చలతో పరిష్కరించు కునేందుకు ఉన్న మార్గాలు మూసుకుపోయాయనీ, రాజ్యాంగ, చట్టబద్ధ దారుల్లో రామమందిరాన్ని నిర్మించేందుకు బీజేపీ కృషి చేస్తుందని ఆ పార్టీ నేత అవదేశ్ పాండే అన్నారు. ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా రామాలయాన్ని నిర్మించాలని బీజేపీతోపాటు హిందూ సంస్థల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయోధ్యలో దీపావళి వేడుకలు జరుగుతున్నాయి. కాగా, సరయూ నదీ తీరంలో ఏకకాలంలో మూడు లక్షలకు పైగా మట్టి ప్రమిదలను ఒకేసారి వెలిగించడం ద్వారా అయోధ్యలో మంగళవారం గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి రిషినాథ్ ఈ విషయాన్ని సీఎం యోగి, దక్షిణ కొరియా ప్రథమ పౌరురాలు కిమ్–జుంగ్–సూక్‌ల సమక్షంలో ప్రకటించారు. ఎన్నికలొస్తేనే రామమందిరమా? ఎన్నికలొచ్చినప్పుడే బీజేపీకి అయోధ్యలో రామ మందిరం నిర్మించాలన్న విషయం గుర్తొస్తుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ విమర్శించారు. సీఎం ముందు తన పేరును యోగి ఆదిత్యనాథ్ కాకుండా అసలు పేరు అజయ్ సింగ్ బిష్ట్ అని పెట్టుకోవాలని ఆప్ నేత సంజయ్ సింగ్ సూచించారు. పాలనలో బీజేపీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ రాజకీయాలు చేస్తోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. -
టార్గెట్ అయోధ్య : ఫైజాబాద్ జిల్లా పేరు మార్పు
సాక్షి, లక్నో : దీపావళికి ఒక రోజు ముందు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫైజాబాద్ జిల్లాను ఇకపై అయోధ్యగా వ్యవహరిస్తారు. అయోధ్యలో దివాళీ ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం యోగి ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్యగా మార్చుతున్నామని ప్రకటించారు. అయోధ్య మనకు గర్వకారణమని, ఈ పేరు శ్రీరాముడితో ముడిపడిందని, నేటి నుంచి ఫైజాబాద్ జిల్లాను అయోధ్యగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. అయోధ్యలో త్వరలో శ్రీరాముడి పేరిట విమానాశ్రయం, దశరధుడి పేరుతో వైద్య కళాశాలను నెలకొల్పుతామని చెప్పారు. గతంలో యోగి సర్కార్ మొఘల్సరై రైల్వే జంక్షన్ పేరును దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్‌గా మార్చిన విషయం తెలిసిందే. మరోవైపు బరేలి, ఆగ్రా విమనాశ్రాయాల పేర్లను కూడా మార్చే ప్రతిపాదనలను యూపీ సర్కార్ పరిశీలిస్తోంది. -
‘చావుకు మతం లేదు.. దానికి అంతా ఒకటే’
ఫైజాబాద్: ఉత్తరప్రదేశ్ రాజకీయాలు కుల, మతాల కంపుకొడుతుండగా తన విశిష్ట సేవతో మానవత్వానికి తన గొప్ప సేలవతో సుగంధ పరిమళం అద్దుతున్నాడు ఓ ముస్లిం పెద్ద మనిషి. హిందూ-ముస్లిం అని భేదం లేకుండా, రాజు బీద అనే తారతమ్యం చూపకుండా చనిపోయినవారి మృతదేహాలకు స్వచ్ఛందంగా అనామకులకు అంత్యక్రియలు పూర్తి చేస్తున్నారయన. ఇలా ఒక్కరికి కాదు ఇద్దరికి కాదు.. 80 ఏళ్లు పై బడిన ఈ వ్యక్తి దాదాపు 25 వేలమందికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన పేరు మహ్మద్ షరీఫ్.. ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌కు చెందిన ఆయనను అక్కడి వారంతా కూడా చాచా షరీఫ్ అని పిలుస్తుంటారు. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో చోటు చేసుకున్న అల్లర్లు ఘర్షణల్లో తన కుమారుడు మహ్మద్ రాయిస్ ఖాన్‌ను కోల్పోయారు. ఆ ఘటన ఆయన ఆలోచనను పూర్తిగా మార్చేసింది. ‘నాకుమారుడు అప్పుడే మెడికల్ పరీక్ష పాసై 1992లో సుల్తాన్పూర్ వెళ్లాడు. అక్కడే అతడిని చంపేశారు. కనీసం నా కొడుకు మృతదేహం ఎక్కడ ఉందో కూడా తెలియలేదు. నెలరోజులపాటు తీవ్రంగా తిరిగి పోలీసుల సహాయం తీసుకొని చివరకు గుర్తించగలిగాను. ఆ తర్వాత వెనక్కి వచ్చాక నాకు ఎవరూ ప్రత్యేక ముస్లిం, ప్రత్యేక హిందువులా కనిపించలేదు. మనుషుల్లాగే కనిపించారు. నేను మతాలవారీగా కాకుండా మనుషులుగా చూడడం మొదలుపెట్టాను. మనందరం మనుషులం. మనందరిలో ఒకే రక్తం ఉంది. చావుకు మతం లేదు. దానికి అందరూ సమానమే.. అందుకే మృతదేహాలు ఖననం చేసే సమయంలో, దహనం చేసే సమయంలో కులమతాలు నేను చూడను. కులమతాల పేరిట దేశంలో ప్రజల మధ్య చీలిక రావొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను’ ఈ సందర్భంగా చెప్పారు. ‘ఆస్పత్రుల్లో చాలామంది చనిపోతుంటారు. ఎవరూ వారి గురించి శ్రద్ద తీసుకోరు. ఎన్నికల సమయంలో మాత్రం నాయకులు వచ్చి ఓటర్లను తెగపొగిడేస్తుంటారు. అబద్దపు హామీలు ఇస్తారు. వెళ్లిపోతారు. -
ఐసిస్ పైకి మన సైన్యాన్ని పంపొద్దు: ఒవైసీ
అసదుద్దీన్ ఒవైసీ ఫైజాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ చర్యలను తాము సైతం ఖండిస్తున్నామని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. ఐసిస్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని, భవిష్యత్తులోనూ ఉండబోదని స్పష్టంచేశారు. యూపీలోని బికాపూర్‌లో 11న జరగనున్న ఉప ఎన్నికల్లో భాగంగా గురువారం ఫైజాబాద్‌లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. ఐసిస్‌పై పోరుకు భారత సైన్యాన్ని పంపాలనే ఆలోచనను ప్రధాని మోదీ మానుకోవాలని, అది మన యుద్ధంకాదని హితవు పలికారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలపై ఆశలు పెట్టుకున్న ఎంఐఎం ఇప్పటి నుంచే అక్కడ పార్టీని బలోపేతం చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా ‘దళిత-మైనార్టీ’ ఓటు బ్యాంకుపై దృష్టిపెట్టింది. పేద ముస్లిం జనాభా ఎక్కువుండే ఫైజాబాద్‌లో పట్టుసాధించాలనుకుంటోంది. ఇందుకు సన్నాహకంగా బికాపూర్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని నిలబెట్టి గెలుపు కోసం అసద్ కృషిచేస్తున్నారు. -
మోడీది అధికార దాహం
బల్రాంపూర్/ఫైజాబాద్: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై సోనియా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీ అధికార దాహంతో ఉన్నారని, ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే తనను తాను ప్రధానిగా భావిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ‘మోడీ అధికార వ్యామోహంతో ఊగిపోతున్నారు. ఎన్నికల ఫలితాలు ఇప్పటికే వచ్చేసినట్టుగా, ఆయన ప్రధాని అయిపోయినట్టుగా భావిస్తున్నారు’ అని సోనియా ఎద్దేవా చేశారు. ఈ మేరకు యూపీలోని బల్రాంపూర్, ఫైజాబాద్‌లలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోడీపై సోనియా నిప్పులు చెరిగారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయాలనే విషయం నిర్ణయించాల్సింది ప్రజలేనన్న అంశాన్ని మోడీ విస్మరిస్తున్నారని చురకలంటించారు. -
కుటుంబ సభ్యులను కాల్చి... ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్ ఫైజాబాద్‌లోని అయోధ్య కొట్వాలీ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఆర్మీ జవాను రమేష్ సింగ్ (40) తన భార్య, ఇద్దరు పిల్లలను తుపాకితో కాల్చి హత్య చేశాడు. అనంతరం రమేష్ సింగ్ తనకుతాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కథనం ప్రకారం... ఛండీగఢ్ ఆర్మీ యూనిట్లో పని చేస్తున్న రమేష్ సింగ్ సెలవుపై ఫైజాబాద్ వచ్చాడు. ఇంటివచ్చిన అతడు ఎంత కొట్టిన తలుపు తీయకపోవడంతో ఆగ్రహించిన గోడ దూకి ఇంట్లోకి వెళ్లాడు. అనంతరం భార్య కుసుమ్ (26)తో అతడు గొడవపడ్డాడు. ఆ క్రమంలో రమేష్ ఆగ్రహంతో ఊగిపోతు భార్యను తుపాకితో కాల్చాడు. అనంతరం ఇద్దరు చిన్నారులు రియా (7), శేషు (5)లను కాల్చి చంపాడు. అనంతరం తనకు తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. తుపాకీ శబ్దం వినపడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న రమేష్ సింగ్‌తోపాటు అతని కుటుంబ సభ్యుల మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మోడీని ప్రశంసించిన ఎన్డీ తివారి
ఫైజాబాద్(యూపీ): గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత ఎన్డీ తివారి ప్రశంసలు కురిపించారు. విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) నాయకులతో వేదిక పంచుకోవడమే కాకుండా కాషాయపార్టీ నాయకుడిని పొగడ్తల్లో ముంచెత్తారు. అయోధ్యలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తివారి పాల్గొన్నారు. రామజన్మభూమి న్యాస్ అధ్యక్షుడు, వీహెచ్‌పీ సీనియర్ నేత మహంత్ నృత్య గోపాల్ దాస్లతో కలిసి ఆయన వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గుజరాత్‌ను అభివృద్ధి చేయడానికి మోడీ ఎంతో పాటు పడ్డారని ప్రశంసించారు. గుజరాత్‌ను ప్రగతిపథంలో నడిపిన మోడీ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన చేపట్టిన వివిధ ప్రాజెక్టులను కొనియాడారు. దేశాభివృద్ధికి మోడీ అధిక ప్రాధాన్యత ఇస్తారని తివారి విశ్వాసం వ్యక్తం చేశారు. మోడీని తివారి ప్రశంసించడాన్ని సమాజ్‌వాది పార్టీ తప్పుబట్టింది. 2002లో గుజరాత్లో జరిగిన మారణకాండను మరువరాదని సూచించింది.