ఐసిస్ పైకి మన సైన్యాన్ని పంపొద్దు: ఒవైసీ
అసదుద్దీన్ ఒవైసీ
ఫైజాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ చర్యలను తాము సైతం ఖండిస్తున్నామని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. ఐసిస్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని, భవిష్యత్తులోనూ ఉండబోదని స్పష్టంచేశారు. యూపీలోని బికాపూర్‌లో 11న జరగనున్న ఉప ఎన్నికల్లో భాగంగా గురువారం ఫైజాబాద్‌లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.
ఐసిస్‌పై పోరుకు భారత సైన్యాన్ని పంపాలనే ఆలోచనను ప్రధాని మోదీ మానుకోవాలని, అది మన యుద్ధంకాదని హితవు పలికారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలపై ఆశలు పెట్టుకున్న ఎంఐఎం ఇప్పటి నుంచే అక్కడ పార్టీని బలోపేతం చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా ‘దళిత-మైనార్టీ’ ఓటు బ్యాంకుపై దృష్టిపెట్టింది. పేద ముస్లిం జనాభా ఎక్కువుండే ఫైజాబాద్‌లో పట్టుసాధించాలనుకుంటోంది. ఇందుకు సన్నాహకంగా బికాపూర్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని నిలబెట్టి గెలుపు కోసం అసద్ కృషిచేస్తున్నారు.