ఉగ్రవాదుల ఉచ్చులో పడొద్దు: అసద్
మహబూబ్‌నగర్ అర్బన్: ఐసీస్ ఉగ్రవాద సంస్థతో ముస్లిం యువకులకు సంబంధం లేదని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ముస్లిం యువకులు ఉగ్రవాదుల ఉచ్చులో పడకూడదని విజ్ఞప్తి చేశారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలో జమీయతే ఉలమా జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అజ్మతె ముస్తఫా’ పేరుతో ఇస్లామిక్ ధార్మిక సదస్సులో ఆయన ప్రసంగించారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదుల చొరబాటును పసిగట్టలేకపోవడం కేంద్ర ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమన్నారు.
మహమ్మద్ ప్రవక్తను అవమానించొద్దని..అలా చేసిన కమలేశ్ తివారీ యూపీ జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని ఆర్‌ఎస్‌ఎస్ కబ్జా చేసిందన్నారు. రష్యా పర్యటన సందర్భంగా జనగణమన పాడితే ప్రధాని నరేంద్రమోదీ పరుగులెత్తడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. శత్రుదేశంగా అభివ ర్ణించే పాకిస్తాన్‌కు ప్రధాని మోదీ వెళ్లడం వెనుక మతలబు ఏమిటో ప్రజలకు వివరించాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు.