‘చావుకు మతం లేదు.. దానికి అంతా ఒకటే’
ఫైజాబాద్: ఉత్తరప్రదేశ్ రాజకీయాలు కుల, మతాల కంపుకొడుతుండగా తన విశిష్ట సేవతో మానవత్వానికి తన గొప్ప సేలవతో సుగంధ పరిమళం అద్దుతున్నాడు ఓ ముస్లిం పెద్ద మనిషి. హిందూ-ముస్లిం అని భేదం లేకుండా, రాజు బీద అనే తారతమ్యం చూపకుండా చనిపోయినవారి మృతదేహాలకు స్వచ్ఛందంగా అనామకులకు అంత్యక్రియలు పూర్తి చేస్తున్నారయన. ఇలా ఒక్కరికి కాదు ఇద్దరికి కాదు.. 80 ఏళ్లు పై బడిన ఈ వ్యక్తి దాదాపు 25 వేలమందికి అంత్యక్రియలు నిర్వహించారు.
ఆయన పేరు మహ్మద్ షరీఫ్.. ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌కు చెందిన ఆయనను అక్కడి వారంతా కూడా చాచా షరీఫ్ అని పిలుస్తుంటారు. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో చోటు చేసుకున్న అల్లర్లు ఘర్షణల్లో తన కుమారుడు మహ్మద్ రాయిస్ ఖాన్‌ను కోల్పోయారు. ఆ ఘటన ఆయన ఆలోచనను పూర్తిగా మార్చేసింది. ‘నాకుమారుడు అప్పుడే మెడికల్ పరీక్ష పాసై 1992లో సుల్తాన్‌పూర్ వెళ్లాడు. అక్కడే అతడిని చంపేశారు. కనీసం నా కొడుకు మృతదేహం ఎక్కడ ఉందో కూడా తెలియలేదు. నెలరోజులపాటు తీవ్రంగా తిరిగి పోలీసుల సహాయం తీసుకొని చివరకు గుర్తించగలిగాను. ఆ తర్వాత వెనక్కి వచ్చాక నాకు ఎవరూ ప్రత్యేక ముస్లిం, ప్రత్యేక హిందువులా కనిపించలేదు. మనుషుల్లాగే కనిపించారు.
నేను మతాలవారీగా కాకుండా మనుషులుగా చూడడం మొదలుపెట్టాను. మనందరం మనుషులం. మనందరిలో ఒకే రక్తం ఉంది. చావుకు మతం లేదు. దానికి అందరూ సమానమే.. అందుకే మృతదేహాలు ఖననం చేసే సమయంలో, దహనం చేసే సమయంలో కులమతాలు నేను చూడను. కులమతాల పేరిట దేశంలో ప్రజల మధ్య చీలిక రావొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను’ ఈ సందర్భంగా చెప్పారు. ‘ఆస్పత్రుల్లో చాలామంది చనిపోతుంటారు. ఎవరూ వారి గురించి శ్రద్ద తీసుకోరు. ఎన్నికల సమయంలో మాత్రం నాయకులు వచ్చి ఓటర్లను తెగపొగిడేస్తుంటారు. అబద్దపు హామీలు ఇస్తారు. వెళ్లిపోతారు.