ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను మళ్లీ నియమించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రిమ్స్ జనరల్ ఆస్పత్రిలో ఇటీవలే తొలగించిన 10 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి నియమించాలని రిమ్స్ సిబ్బంది ఐ.ఉష, సిహెచ్.పద్మ తదితరులు గ్రీవెన్స్‌సెల్‌లో కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్‌ను కోరారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో పలువురు సమస్యలపై వినతులు ఇచ్చారు. జాయింట్ కలెక్టర్ జి.వీరపాండ్యన్, అదనపు జాయింట్ కలెక్టర్ మహ్మద్ హసీం షరీఫ్, డ్వామా, డీఆర్డీఏ పీడీలు కల్యాణచ క్రవర్తి, తనూజారాణి, తదితరులు పాల్గొన్నారు. గ్రీవెన్స్ సెల్‌కు అందిన వచ్చిన వినతుల్లో కొన్నింటిని పరిశీలించగా...
నరసన్నపేట మండలం కరగాం గ్రామంలోని శ్రీవెంకటేశ్వర స్వయం శక్తి సంఘంలో పొదుపు నగదు సభ్యుల ఆమోదం లేకుండా తీసుకున్నారని, ఆ నింద సబ్ ఆర్గనైజర్‌పై వేశారని, ఆ సొమ్మును తీసుకున్నవారిపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని ఆ గ్రూపు సబ్ ఆర్గనైజర్ టెంక ఈశ్వరమ్మ కోరారు. ఆర్టీఐ చట్టం ప్రకారం పూర్తి వివరాలు సేకరించినట్లు తెలిపారు. సోంపేట మండలం బారువ బాలాజీ గోశాలకు గ్రామానికి మద్య రోడ్డు వేయడానికి ప్రభుత్వం రూ.2.50 లక్షలు మంజూరు చేసిందని, రోడ్డు వేయడంలో జాప్యం జరుగుతుండడంతో ఇబ్బందిగా ఉందని గోశాల నిర్వాహకురాలు బడగల ఆదిలక్ష్మి ఫిర్యాదు చేశారు. మడ్డువలస కాలువ ఫేజ్-2కి సంబంధించి పొందూరు మండలం కేశవరావుపేట గ్రామస్తులు భూములు ఇచ్చారని, అయితే పరిహారం నేటికీ చెల్లించలేదని, 2011 నుంచి ఎన్నిసార్లు ఫిర్యాదు చేస్తున్నా ఫలితం కనిపించడంలేదని గ్రామానికి చెందిన ఎం. కార్లయ్య, నేతల రాజు, ఆర్.యర్రయ్య, వి.అప్పారావు, ఎల్.దుర్గయ్యతో పాటు 15 మంది ఫిర్యాదు చేశారు.
శ్రీకాకుళం పట్టణంలోని మహలక్ష్మినగర్ కాలనీలో మత్స్యకార సహకార సంఘం భూమి 5 ఎకరాలు ఆక్రమణకు గురైందని సంఘ అధ్యక్షుడు ఎం.నగేష్ ఫిర్యాదు చేశారు. సంతకవిటి మండలం పోతిరాజుపేట గ్రామంలోని ఒట్టి చెరువు, బట్టివాని చెరువుల్లో 5 ఎకరాలు చెరువు గుర్భాలు అక్రమణలకు గురయ్యాయని, దీంతో చెరువుల దిగువ రైతులకు సాగునీరు అందడంలేదని ఎ. అచ్యుతరావు ఫిర్యాదు చేశారు. సంతబొమ్మాళి మండలం వడ్డితాండ్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఎక్కువగా ఉన్నప్పటికీ పిల్లలకు సరిపడే నిష్పత్తిలో ఉపాధ్యాయులు లేరని ఉపాధ్యాయులను నియమించాలని ఆ గ్రామానికి చెందిన పల్లి మల్లేశ్వరరావు కోరారు.
ట్రైమెక్స్ను కాపాడండి కలెక్టర్‌కు ఉద్యోగుల వినతి
శ్రీకాకుళం పాతబస్టాండ్: గార మండలం వత్సవలనలో ఉన్న ట్రైమెక్స్ సంస్థ ప్రజలతో మమేకమై ఎందరికో ఉపాధి కల్పిస్తోందని, అయితే కొంతమంది స్వార్థం కోసం సంస్థ మనుగడకు అడ్డుతగులుతున్నారని, వారి బారి నంచి సంస్థను కాపాడాలని ఉద్యోగులు కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్‌ను కోరారు. ఈ మేరకు వారు సోమవారం గ్రీవెన్స్‌సెల్‌లో వినతిపత్రం ఇచ్చారు. అంతకుముందు వారు సంస్థకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని నిరసిస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల ప్రతినిధులు మాట్లాడుతూ ట్రైమెక్స్ సంస్థ కార్మికులు, ఉద్యోగుల పక్షాన నిలుస్తూ సంక్షేమ కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని తెలిపారు.
ఎటువంటి పొరపాట్లు లేకపోయినప్పటికీ వత్సవలస సర్పంచ్ దాసరి కుమారి, దాసరి బొజ్జమ్మ, ఎంపీటీసీ సభ్యుడు చీకటి చిన్నారావు తదితరులు అసత్య ప్రచారం చేస్తూ సంస్థపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. ట్రైమెక్స్ వల్ల గార మండలం వత్సవలస, తోనంగి, తూలుగు తదితర గ్రామాలకు చెందిన 1400 కుటుంబాలు ఉపాధి పొందుతున్నారని చెప్పారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ట్రైమెక్స్ డీజీఎం వై.భాస్కరరావు, ఎన్.రామకృష్ణ, మార్పు ప్రసాద్, పాండ్రంకి అశోక్ నాయుడు, నర్సింగరావు, బాలరాజు, వైలపల్లి రాంబాబు, పేర్ల తాతారావు, చీకటి లక్ష్మణరావు తదితరులు ఉన్నారు.