మోడీని ప్రశంసించిన ఎన్డీ తివారి
ఫైజాబాద్(యూపీ): గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత ఎన్డీ తివారి ప్రశంసలు కురిపించారు. విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) నాయకులతో వేదిక పంచుకోవడమే కాకుండా కాషాయపార్టీ నాయకుడిని పొగడ్తల్లో ముంచెత్తారు. అయోధ్యలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తివారి పాల్గొన్నారు. రామజన్మభూమి న్యాస్ అధ్యక్షుడు, వీహెచ్పీ సీనియర్ నేత మహంత్ నృత్య గోపాల్ దాస్లతో కలిసి ఆయన వేదిక పంచుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... గుజరాత్ను అభివృద్ధి చేయడానికి మోడీ ఎంతో పాటు పడ్డారని ప్రశంసించారు. గుజరాత్ను ప్రగతిపథంలో నడిపిన మోడీ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన చేపట్టిన వివిధ ప్రాజెక్టులను కొనియాడారు. దేశాభివృద్ధికి మోడీ అధిక ప్రాధాన్యత ఇస్తారని తివారి విశ్వాసం వ్యక్తం చేశారు. మోడీని తివారి ప్రశంసించడాన్ని సమాజ్వాది పార్టీ తప్పుబట్టింది. 2002లో గుజరాత్లో జరిగిన మారణకాండను మరువరాదని సూచించింది.