అయోధ్య: 2019 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మళ్లీ రామ జపం అందుకుంది. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫైజాబాద్ జిల్లా పేరును ఏకంగా అయోధ్యగా మారుస్తామని ప్రకటించారు. అయోధ్య ఫైజాబాద్ జిల్లాలోనే ఉంటుంది. అయోధ్యలో రాముడి పేరిట విమానాశ్రయాన్ని, దశరథుడి పేరుతో వైద్య కళాశాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మంగళవారం అయోధ్యలో జరిగిన దీపోత్సవం కార్యక్రమంలో యోగి ఈ ప్రకటన చేశారు.
‘అయోధ్య మన గౌరవానికి చిహ్నం. గర్వకారణం. అయోధ్యకు ఎవ్వరూ అన్యాయం చేయలేరు’ అని అన్నారు. అయితే యోగి రాముడి విగ్రహం లేదా రామ మందిర నిర్మాణంపై ప్రకటన చేస్తారని భావించినప్పటికీ వాటి గురించి ప్రస్తావించలేదు. అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మారుస్తామని ఇప్పటికే చెప్పగా.. లక్నోలోని ఏకనా అంతర్జాతీయ క్రికెట్ మైదానం పేరును అటల్ బిహారీ వాజ్‌పేయి మైదానంగా మార్చారు. ఈ పేర్ల మార్పు నిర్ణ యాలను విపక్షాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి.
అయోధ్యంలో ఘనంగా వేడుకలు
అయోధ్యలో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిగా దక్షిణ కొరియా ప్రథమ పౌరురాలు కిమ్–జుంగ్–సూక్ హాజరయ్యారు. ఆమెతోపాటు దక్షిణ కొరియా అత్యున్నత స్థాయి అధికారుల బృందం కూడా వచ్చింది. రాణి సూరిరత్న స్మారక సందర్శనతో సూక్ తన అయోధ్య పర్యటనను ప్రారంభించారు.
అయోధ్య యువరాణి అయిన సూరిరత్న క్రీస్తు శకం 48వ సంవత్సరంలో కొరియా వెళ్లి అక్కడి యువరాజును వివాహమాడారని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. కొరియా యువరాజుతో పరిణ యం అనంతరం సూరిరత్న పేరును హియో హ్వాంగ్–ఓక్‌గా మార్చారు. ప్రస్తుతం అయోధ్యలో ఉన్న యువరాణి స్మారకానికి కూడా ఈ పేరే ఉంటుంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలసి స్మారక సుందరీకరణ పనులకు సూక్ భూమి పూజ కూడా చేశారు. అనంతరం సరయూ నదీ తీరానికి వెళ్లి రాముడు, సీత వేషం వేసుకున్న కళాకారులకు స్వాగతం పలికారు.
అయోధ్యపై చర్చలుండవు: బీజేపీ నేత
అయోధ్య వివాదాన్ని చర్చలతో పరిష్కరించు కునేందుకు ఉన్న మార్గాలు మూసుకుపోయాయనీ, రాజ్యాంగ, చట్టబద్ధ దారుల్లో రామమందిరాన్ని నిర్మించేందుకు బీజేపీ కృషి చేస్తుందని ఆ పార్టీ నేత అవదేశ్ పాండే అన్నారు. ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా రామాలయాన్ని నిర్మించాలని బీజేపీతోపాటు హిందూ సంస్థల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయోధ్యలో దీపావళి వేడుకలు జరుగుతున్నాయి.
కాగా, సరయూ నదీ తీరంలో ఏకకాలంలో మూడు లక్షలకు పైగా మట్టి ప్రమిదలను ఒకేసారి వెలిగించడం ద్వారా అయోధ్యలో మంగళవారం గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి రిషినాథ్ ఈ విషయాన్ని సీఎం యోగి, దక్షిణ కొరియా ప్రథమ పౌరురాలు కిమ్–జుంగ్–సూక్‌ల సమక్షంలో ప్రకటించారు.
ఎన్నికలొస్తేనే రామమందిరమా?
ఎన్నికలొచ్చినప్పుడే బీజేపీకి అయోధ్యలో రామ మందిరం నిర్మించాలన్న విషయం గుర్తొస్తుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ విమర్శించారు. సీఎం ముందు తన పేరును యోగి ఆదిత్యనాథ్ కాకుండా అసలు పేరు అజయ్ సింగ్ బిష్ట్ అని పెట్టుకోవాలని ఆప్ నేత సంజయ్ సింగ్ సూచించారు. పాలనలో బీజేపీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ రాజకీయాలు చేస్తోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment