అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం నేడు (అక్టోబర్ 30) మరో రికార్డుకు వేదికకానుంది. ఈ రోజు అయోధ్యలో ఎనిమిదో దీపోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది.
అయోధ్యలో ఈరోజు సాయంత్రం జరిగే దీపోత్సవానికి సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ వెలుగుల పండుగలో అయోధ్యలోని సరయూ తీరం వెంబడి రామ్ కీ పైడీతో సహా 55 ఘాట్‌ల వద్ద 25 లక్షల దీపాలు వెలిగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో అయోధ్య దీపోత్సవం మరో రికార్డును సాధించనుంది.
దీపోత్సవం కోసం స్థానికులు అయోధ్యను అందంగా ముస్తాబు చేస్తున్నారు. అక్టోబర్ 30న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రామ్ కీ పైడీలో తొలి దీపం వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో లేజర్ షో, బాణసంచా కాల్చడం, రాంలీల ప్రదర్శనలు ఉండనున్నాయి.
ఈ ఏడాది జనవరి 22న నూతన రామాలయంలో బాలరాముని ప్రతిష్ఠాపన మహోత్సవం జరిగింది. దీనితరువాత జరుగుతున్న తొలి దీపోత్సవం ఇదే కావడంతో స్థానికుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఈరోజు జరిగే దీపోత్సవంలో సరయూ ఒడ్డు, రామ్‌కీ పైడీ, ఇతర 55 ఘాట్‌లలో 28 లక్షల దీపాలను ఏర్పాటు చేశారు. వీటిని వెలిగించి పాత రికార్డును బద్దలు కొట్టడం ద్వారా గిన్నిస్ బుక్‌లో కొత్త రికార్డు నమోదు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేసింది.
గత ఏడాది దీపోత్సవంలో 22 లక్షల 23 వేల దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈసారి జరుగుతున్న దీపోత్సవంలో అవధ్ విశ్వవిద్యాలయంతోపాటు ఇతర కళాశాలలకు చెందిన 30 వేల మంది విద్యార్థులు తమ సేవలు అందిస్తున్నారు. 2017లో ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా దీపోత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment