
పథకం ప్రకారమే బాబ్రీ విధ్వంసం
తమ స్టింగ్ ఆపరేషన్‌లో తేలినట్లు కోబ్రాపోస్ట్ వెల్లడి
చాలా నెలల ముందే కరసేవకులకు కూల్చివేతలో శిక్షణ
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల వే ళ మళ్లీ బాబ్రీపై చిచ్చు రేగింది. బాబ్రీ మసీదు కూల్చివేత ఆవేశపూరిత హిందూ అల్లరిమూక చర్య కాదని, పక్కా పథకం ప్రకారం జరిపిన విధ్వంసమని తమ స్టింగ్ ఆపరేషన్‌లో తేలినట్లు కోబ్రాపోస్ట్ వెబ్‌సైట్ వెల్లడించింది. వెబ్‌సైట్ ఎడిటర్ అనిరుధ్ బహాల్ శుక్రవారమిక్కడ విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. ‘ఆపరేషన్ జన్మభూమి’ పేరుతో రెండేళ్లపాటు జరిపిన స్టింగ్ ఆపరేషన్ వివరాలను బయటపెట్టారు. తమ వలంటీర్లు పక్కా పథకం ప్రకారం, శిక్షణ పొందాకే మసీదును కూల్చారని బీజేపీ, వీహెచ్‌పీ, శివసేన నేతలు చెప్పినట్లున్న ఇంటర్వ్యూలను ప్రదర్శించారు.
ఆపరేషన్‌లో భాగంగా బాబ్రీ కూల్చివేత కుట్ర, అమలుతో సంబంధమున్న 23 మందితో కోబ్రాపోస్ట్ అసోసియేట్ ఎడిటర్ కె.ఆశీష్ మాట్లాడారని, అయోధ్య ఉద్యమంపై పుస్తకం రాస్తానంటూ వారిని కలుసుకున్నారని చెప్పారు. ఆయన ఇంటర్వ్యూ చేసిన వారిలో 12 మంది బజరంగ్‌దళ్, బీజేపీ, వీహెచ్‌పీలకు, ఐదుగురు శివసేన, మిగతావారు ఇతర హిందూ సంస్థలకు చెందిన వారన్నారు. బీజేపీ నేతల్లో ఉమాభారతి, కల్యాణ్‌సింగ్ ఉన్నారని తెలిపారు.
కోబ్రాపోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం..
1992 డిసెంబర్ 6న అయోధ్యలోని బాబ్రీ మసీదును పక్క పథకం ప్రకారం నేలమట్టం చేశారు. దీనికి వీహెచ్‌పీ, శివసేనలు విడివిడిగా రహస్యంగా ప్రభుత్వ సంస్థలకు ఏమాత్రం తెలియకుండా కుట్ర పన్నాయి. వలంటీర్లకు చాలా నెలలముందే శిక్షణ ఇచ్చాయి. వీహెచ్‌పీ యువజన విభాగమైన బజరంగ్‌దళ్ వలంటీర్లు గుజరాత్‌లోని సుర్ఖేజ్‌లో, శివసేన వలంటీర్లుమధ్యప్రదేశ్‌లోని భింద్, మెరోనాల్లో శిక్షణ పొందారు.
వీహెచ్‌పీ లక్ష్మణసేన పేరుతో 1,200 మంది ఆరెస్సెస్ కార్యకర్తలను కూడగట్టింది. శివసేన కూడా అయోధ్యలో ప్రతాప్‌సేన పేరుతో స్థానికులను సమీకరించింది. సంప్రదాయ పద్ధతుల్లో మసీదును కూల్చలేకపోతే డైనమైట్ వాడాలని శివసేన పథకం వేసింది. బీహార్‌కు చెందిన ఓ టీం పెట్రోల్ బాంబు వాడాలనుకుంది. ఆర్‌ఎస్‌ఎస్ ఆత్మాహుతి దళాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇంటర్వ్యూ ఇచ్చినవారు అద్వానీ, ఎం.ఎం.జోషి, ఉమాభారతిలు విధ్వంసానికి కుట్ర పన్నినట్లు చెప్పారు. విధ్వంసం గురించి నాటి యూపీ సీఎం కల్యాణ్‌సింగ్, ప్రధాని పివీ, శివసేన చీఫ్ బాల్ ఠాక్రేలకు ముందే తెలుసు.
అది కాంగ్రెస్ పోస్ట్... బీజేపీ
కోబ్రాపోస్ట్ స్టింగ్ ఆపరేషన్ కాంగ్రెస్ ప్రాయోజిత పోస్ట్ అని అని బీజేపీ ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లను చీల్చడానికి , అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ కుట్రపన్నుతోందన్నారు.