Cobrapost
-
డీహెచ్ఎఫ్ఎల్ స్కామ్‌పై ప్రభుత్వ దర్యాప్తు
న్యూఢిల్లీ: డీహెచ్ఎఫ్ఎల్ సంస్థ, రూ.31,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కోబ్రాపోస్ట్ వెల్లడించిన ఉదంతంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. మరోవైపు ఈ విషయమై దర్యాప్తు చేయడానికి ఒక స్వతంత్ర చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థను డీహెచ్ఎఫ్ఎల్ సంస్థ నియమించింది. గురువారం జరిగిన కంపెనీ సమావేశంలో డీహెచ్ఎఫ్ఎల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అవసరమైతే తనిఖీలు చేస్తాం... డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల నుంచి రూ.97,000 కోట్లు సమీకరించిందని, కానీ వీటిల్లో 31,000 కోట్ల మేర నిధులను డొల్ల కంపెనీల ద్వారా దారి మళ్లించిందని ఆన్లైన్న్యూస్ పోర్టల్, కోబ్రాపోస్ట్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ విషయమై కంపెనీ వ్యవహారాల మంత్రి శాఖ దర్యాప్తును ప్రారంభించింది. ఈ దర్యాప్తులో భాగంగా కంపెనీల రిజిష్ట్రార్(ముంబై)...డొల్ల కంపెనీలుగా చెప్పబడుతున్న కొన్ని సంస్థలను గుర్తించడానికి ప్రయత్నించింది. రికార్డుల్లో ఉన్న చిరునామాల్లో సదరు కంపెనీలు లేవని సంబంధిత ఉన్నతాధికారొకరు చెప్పారు. అవసరమైతే డీహెచ్ఎఫ్ఎల్ నుంచి సమాచారం కోరతామని పేర్కొన్నారు. ఈ విషయమై దర్యాప్తు ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉందని, దర్యాప్తులో వెల్లడయ్యే విషయాలను పట్టి తనిఖీలు కూడా చేపడతామని వివరించారు. కాగా కంపెనీ వ్యవహారాల శాఖ నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని డీహెచ్ఎఫ్ఎల్ తెలిపింది. డీహెచ్ఎఫ్ఎల్.. నాలుగేళ్ల కనిష్టానికి ఈ వార్తల కారణంగా డీహెచ్ఎఫ్ఎల్ షేర్ 16% పతనమై రూ.136 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 20 % నష్టపోయి నాలుగేళ్ల కనిష్ట స్థాయి, రూ.130ను తాకింది. ఈ షేర్ వరుసగా 4 రోజూ నష్టపోయింది. ఈ షేర్ గత నాలుగు రోజుల్లో 35 శాతం, గత ఐదు నెలల్లో 80 శాతం చొప్పున పతనమైంది. -
దేశంలో అతిపెద్ద ఆర్థిక కుంభకోణం - కోబ్రాపోస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మరో అతిపెద్ద ఫైనాన్షియల్ స్కాం అంటూ కోబ్రాపోస్ట్ బాంబు పేల్చింది. దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(డిహెచ్ఎఫ్ఎల్) రూ.31వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కోబ్రాపోస్ట్ వెబ్సైట్లో మంగళవారం ప్రకటించింది. ఈ స్కాంకు సంబంధించిన ఆధారాలను కూడా కోబ్రాపోస్ట్ ట్విటర్లో పోస్ట్ చేసింది. కోబ్రా పోస్ట్ అందించిన సమాచారం ప్రకారం షెల్ (డొల్ల) కంపెనీల నెట్వర్క్ ద్వారా కంపెనీ ప్రమోటర్లు మురికివాడల అభివృద్ధి పేరుతో అక్రమపద్ధతిలో వేల కోట్ల రూపాయలను దారి మళ్లించారు. తద్వారా భారతదేశంలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణానికి పాల్పడ్డారని ట్వీట్ చేసింది. ముఖ్యంగా డిహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లకు ఒకే అడ్రస్‌తో ఉన్న అనేక షెల్ కంపెనీలకు ఎలాంటి సెక్యూరిటీస్ లేకుండానే షెల్ కంపెనీలకు భారీగా రుణాలిచ్చింది. రూ.21,477 కోట్ల డిహెచ్ఎఫ్ఎల్ నిధులను వివిధ షెల్ కంపెనీలకు రుణాలుగా, పెట్టుబడులుగా అందించారని, డిహెచ్ఎఫ్ఎల్ ప్రోత్సాహక కంపెనీలకు రూ .31,000 కోట్లు చెల్లించారని ఆరోపించింది. మహారాష్ట్రలో మురికివాడల అభివృద్ధి పేరుతో ఈ షెల్ కంపెనీలకు వేలకోట్ల రూపాయలను సంస్థ కట్టబెట్టిందనీ ఆరోపించింది. ఇలా దాదాపు 45 కంపెనీలున్నాయని ఇందులో 34 సంస్థలకు వాద్వాన్ ఫ్యామిలీతో ప్రత్యక్ష సంబంధాలను కలిగి వున్నాయని కూడా కోబ్రా పోస్ట్ ఆరోపించింది. అంతేకాదు ఈ రుణాలకు సంబంధిందించిన వివరాలను కంపెనీ ఆర్థిక రిపోర్టుల్లో పొందుపర్చలేదని పేర్కొంది. ఇలా అక్రమంగా ఆర్జించిన సొమ్ముతో ప్రమోటర్లు విదేశాల్లో సొంత ఆస్తులు, పెద్ద పెద్ద కంపెనీల్లో షేర్లను కొన్నారని తెలిపింది. డిహెచ్ఎఫ్ఎల్ ముఖ్య ప్రమోటర్లు కపిల్ వాద్వాన్, అరుణా వాద్వాన్, ధీరజ్ వాద్వాన్ సహా పలువురికి ఇంగ్లండ్, దుబాయ్, శ్రీలంక, మారిషస్ దేశాల్లో వ్యక్తిగతంగా ఆస్తులు కూడ బెట్టుకున్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలో సెబీ, ఐటీ, నల్లధనం, మనీ లాండరింగ్ చట్టం, కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఈ కంపెనీపై తక్షణమే విచారణ చెపట్టాలని కోరింది. దీంతోపాటు బీజీపీకి కోట్ల రూపాయల చందాలిచ్చిందని కోబ్రా పోస్ట్ ఆరోపించడం గమనార్హం. ఈ వార్తలతో డిహెచ్ఎఫ్ఎల్ షేరు ఇవాల్టి మార్కెట్లో దాదాపు 10శాతానికి పైగా నష్టపోయింది. అయితే చివర్లో తేరుకుని 5శాతం నష్టాలకు పరిమితమైంది. మరోవైపు ఇప్పటికే వివాదాల్లో చిక్కుకున్న సంస్థకు తాజా ఆరోపణలు మరింత ప్రతికూలమని ఎనలిస్టులు చెబుతున్నారు. Dewan’s financial credentials: Rs 8,700 crore net worth, Rs 96,000 crore money raised through loans and public deposits. pic.twitter.com/UGH2gQzteV — Cobrapost (@cobrapost) January 29, 2019 Here is a single infograph that explains what Cobrapost has unearthed about #LooteraDewan. pic.twitter.com/0SQqEBSePe — Cobrapost (@cobrapost) January 29, 2019 -
ఆ మీడియా సంస్థల్ని ద్వేషించను: రాహుల్
న్యూఢిల్లీ: వాస్తవాలను వక్రీకరిస్తూ తనపై విద్వేషాన్ని ఎగదోసే మీడియాను ద్వేషించనని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. వీరంతా తనపై అబద్ధాలు ప్రచారం చేస్తూ పొట్టనింపుకుంటున్నారనీ, దీన్ని గౌరవంగా భావిస్తున్నానని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు, హిందుత్వ ఎజెండా ప్రచారానికి 17 మీడియా సంస్థలు అంగీకరించినట్లు ఇటీవల కోబ్రాపోస్ట్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడైన నేపథ్యంలో రాహుల్ ఈ మేరకు స్పందించారు. ‘తప్పుడు వార్తలు, అవాస్తవాలతో నాపై విద్వేషాన్ని రగిల్చేవారిని నేను ద్వేషించను. వాళ్లు ద్వేషాన్ని అమ్ముకుంటున్నారు. వారికది కేవలం వ్యాపారం మాత్రమే. ఈ విషయం కోబ్రాపోస్ట్ ఆపరేషన్‌తో బహిర్గతమైంది’ అని రాహుల్ ట్వీట్ చేశారు. -
కొబ్రాపోస్ట్స్టింగ్ ఆపరేషన్ పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు
-
పథకం ప్రకారమే బాబ్రీ విధ్వంసం
తమ స్టింగ్ ఆపరేషన్‌లో తేలినట్లు కోబ్రాపోస్ట్ వెల్లడి చాలా నెలల ముందే కరసేవకులకు కూల్చివేతలో శిక్షణ సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల వే ళ మళ్లీ బాబ్రీపై చిచ్చు రేగింది. బాబ్రీ మసీదు కూల్చివేత ఆవేశపూరిత హిందూ అల్లరిమూక చర్య కాదని, పక్కా పథకం ప్రకారం జరిపిన విధ్వంసమని తమ స్టింగ్ ఆపరేషన్‌లో తేలినట్లు కోబ్రాపోస్ట్ వెబ్సైట్ వెల్లడించింది. వెబ్సైట్ ఎడిటర్ అనిరుధ్ బహాల్ శుక్రవారమిక్కడ విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. ‘ఆపరేషన్ జన్మభూమి’ పేరుతో రెండేళ్లపాటు జరిపిన స్టింగ్ ఆపరేషన్ వివరాలను బయటపెట్టారు. తమ వలంటీర్లు పక్కా పథకం ప్రకారం, శిక్షణ పొందాకే మసీదును కూల్చారని బీజేపీ, వీహెచ్‌పీ, శివసేన నేతలు చెప్పినట్లున్న ఇంటర్వ్యూలను ప్రదర్శించారు. ఆపరేషన్‌లో భాగంగా బాబ్రీ కూల్చివేత కుట్ర, అమలుతో సంబంధమున్న 23 మందితో కోబ్రాపోస్ట్ అసోసియేట్ ఎడిటర్ కె.ఆశీష్ మాట్లాడారని, అయోధ్య ఉద్యమంపై పుస్తకం రాస్తానంటూ వారిని కలుసుకున్నారని చెప్పారు. ఆయన ఇంటర్వ్యూ చేసిన వారిలో 12 మంది బజరంగ్దళ్, బీజేపీ, వీహెచ్‌పీలకు, ఐదుగురు శివసేన, మిగతావారు ఇతర హిందూ సంస్థలకు చెందిన వారన్నారు. బీజేపీ నేతల్లో ఉమాభారతి, కల్యాణ్‌సింగ్ ఉన్నారని తెలిపారు. కోబ్రాపోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. 1992 డిసెంబర్ 6న అయోధ్యలోని బాబ్రీ మసీదును పక్క పథకం ప్రకారం నేలమట్టం చేశారు. దీనికి వీహెచ్‌పీ, శివసేనలు విడివిడిగా రహస్యంగా ప్రభుత్వ సంస్థలకు ఏమాత్రం తెలియకుండా కుట్ర పన్నాయి. వలంటీర్లకు చాలా నెలలముందే శిక్షణ ఇచ్చాయి. వీహెచ్‌పీ యువజన విభాగమైన బజరంగ్దళ్ వలంటీర్లు గుజరాత్‌లోని సుర్ఖేజ్లో, శివసేన వలంటీర్లుమధ్యప్రదేశ్లోని భింద్, మెరోనాల్లో శిక్షణ పొందారు. వీహెచ్‌పీ లక్ష్మణసేన పేరుతో 1,200 మంది ఆరెస్సెస్ కార్యకర్తలను కూడగట్టింది. శివసేన కూడా అయోధ్యలో ప్రతాప్సేన పేరుతో స్థానికులను సమీకరించింది. సంప్రదాయ పద్ధతుల్లో మసీదును కూల్చలేకపోతే డైనమైట్ వాడాలని శివసేన పథకం వేసింది. బీహార్‌కు చెందిన ఓ టీం పెట్రోల్ బాంబు వాడాలనుకుంది. ఆర్ఎస్ఎస్ ఆత్మాహుతి దళాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇంటర్వ్యూ ఇచ్చినవారు అద్వానీ, ఎం.ఎం.జోషి, ఉమాభారతిలు విధ్వంసానికి కుట్ర పన్నినట్లు చెప్పారు. విధ్వంసం గురించి నాటి యూపీ సీఎం కల్యాణ్‌సింగ్, ప్రధాని పివీ, శివసేన చీఫ్ బాల్ ఠాక్రేలకు ముందే తెలుసు. అది కాంగ్రెస్ పోస్ట్... బీజేపీ కోబ్రాపోస్ట్ స్టింగ్ ఆపరేషన్ కాంగ్రెస్ ప్రాయోజిత పోస్ట్ అని అని బీజేపీ ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లను చీల్చడానికి , అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ కుట్రపన్నుతోందన్నారు. -
స్టింగ్ ఆపరేషన్‌తో బయట పెట్టిన కోబ్రాపోస్ట్
-
11 మంది ఎంపీల ముడుపుల బాగోతం
స్టింగ్ ఆపరేషన్‌తో బట్టబయలు చేసిన ‘కోబ్రాపోస్ట్’ రూ.50 వేల నుంచి రూ.50 లక్షల వరకు ముడుపులిస్తే చాలు... ఎలాంటి సిఫారసు లేఖలైనా ఇవ్వడానికి సంసిద్ధత వీరిలో ఇద్దరు కాంగ్రెస్, ముగ్గురు బీజేపీ, ఇద్దరు ఏఐఏడీఎంకే, ముగ్గురు జేడీయూ, ఒకరు బీఎస్పీ ఎంపీ న్యూఢిల్లీ : పార్లమెంట్లో ప్రశ్నలకు ముడుపుల కుంభకోణం తరహాలో కోబ్రాపోస్ట్ న్యూస్ వెబ్సైట్ తాజాగా మరో కుంభకోణాన్ని బయటపెట్టింది. ఐదు పార్టీలకు చెందిన 11 మంది ఎంపీలు ముడుపులు తీసుకుని ఓ కల్పిత విదేశీ కంపెనీకి అనుకూలంగా సిఫారసు లేఖలు ఇవ్వడానికి సిద్ధపడ్డారని కోబ్రాపోస్ట్ వెబ్సైట్ సంపాదకుడు అనిరుద్ధ బహల్ గురువారం ఇక్కడ మీడియా సమావేశంలో వెల్లడించారు. తమ స్టింగ్ ఆపరేషన్‌లో చిక్కిన వారిలో ఏఐఏడీఎంకే సభ్యులు కె.సుకుమార్, సి.రాజేంద్రన్, బీజేపీకి చెందిన లాలూభాయ్ పటేల్, రవీంద్రకుమార్ పాండే, హరి మాంఝీ, జేడీయూ సభ్యులు విశ్వమోహన్ కుమార్, మహేశ్వర్ హజారీ, భుదేవ్ చౌదరి, కాంగ్రెస్ ఎంపీలు ఖిలాడీలాల్ బైర్వా, విక్రమ్‌భాయ్ అర్జన్‌భాయ్, బీఎస్పీ సభ్యుడు కైసర్ జహాన్ ఉన్నట్లు తెలిపారు. రూ. 50 వేలు మొదలుకుని రూ. 50 లక్షలు తీసుకుని ఎలాంటి సిఫారసు లేఖలైనా ఇవ్వడానికి ఈ ఎంపీలు సంసిద్ధత వ్యక్తం చేశారని ఆయన చెప్పారు. ఏడాదిపాటు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో ఓ ఆరుగురు ఎంపీలు ఏకంగా లేఖలు కూడా ఇచ్చేశారని తెలిపారు. ఈ ఎంపీల్లో కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు, బీజేపీ నుంచి ముగ్గురు, ఏఐఏడీఎంకే నుంచి ఇద్దరు, జేడీయూ నుంచి ముగ్గురు, బీఎస్పీ నుంచి ఒకరు ఉన్నారని వివరించారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో మెడిటరేనియన్ ఆయిల్ కార్పొరేషన్ పేరిట తమకు సంస్థ ఉందంటూ తమ ప్రతినిధులు సదరు ఎంపీలను సంప్రదించగా, కనీస వివరాలను కూడా తెలుసుకోవడానికి వారు ప్రయత్నించలేదని అన్నారు. ఆరుగురు ఎంపీలు రూ. 50 వేలు మొదలుకొని రూ. 75 వేల వరకు ముడుపులు తీసుకుని కల్పిత కంపెనీకి అనుకూలంగా లేఖలు ఇచ్చారని బహల్ వెల్లడించారు. మిగిలినవారు రూ. 5 లక్షలకు తగ్గేది లేదన్నారని, ఒక ఎంపీ అయితే ఒక్క లేఖ ఇవ్వడానికి రూ. 50 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు. తమ రిపోర్టర్లు కంపెనీ కన్సల్టెంట్లుగా చెప్పుకుని మధ్యవర్తులు, వ్యక్తిగత సిబ్బంది సహాయంతో ఎంపీలను సంప్రదించారని, మహిళా ఎంపీల విషయంలో వారి భర్తలను సంప్రదించారని బహల్ చెప్పారు. మరోవైపు, వీరిలో కొందరు ఎంపీలను వివరణ కోరగా, తమపై ఆరోపణలను ఖండించారు. తమను రాజకీయంగా దెబ్బతీయడానికే ఈ ఆరోపణలు చేస్తున్నారని జేడీయూ ఎంపీ మహేశ్వర్ హజారీ వ్యాఖ్యానించారు. తాను ముడుపులు తీసుకోలేదని, లేఖలు కూడా ఇవ్వలేదని స్పష్టంచేశారు. తన పీఏ చెబితే సిఫారసు లేఖ ఇచ్చానని, ముడుపులు తీసుకోలేదని మరో జేడీయూ ఎంపీ విశ్వమోహన్ కుమార్ చెప్పారు. కాగా, ఈ ఎంపీల చర్య అవినీతి నిరోధక చట్టంకిందకు వస్తుందని, వీరిపై దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు. -
స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిన 11మంది ఎంపీలు
ఢిల్లీ: కోబ్రా పోస్ట్ స్టింగ్ ఆపరేషన్‌లో 11మంది ఎంపీలు అడ్డంగా దొరికిపోయారు. ఆయిల్ వెలికితీత కోసం నకిలీ సంస్థకు లైసెన్స్ ఇప్పించేందుకు 11 మంది ఎంపీలు పెట్రోలియం శాఖకు సిఫార్స్ చేసేందుకు డబ్బులు డిమాండ్ చేశారు. ఒక్కో సిఫార్స్ లేఖకు రూ.50 వేల నుంచి రూ. 50 లక్షల వరకూ డిమాండ్ చేస్తూ ...కెమెరాకు చిక్కారు. ఈ నిర్వాకంలో ఇద్దరు కాంగ్రెస్, ముగ్గురు బీజేపీ, ఇద్దరు అన్నాడీఎంకే, ముగ్గురు జేడీయూ, ఒకరు బీఎస్పీ ఎంపీ ఉన్నారు. 'ఆపరేషన్ ఫాల్కన్ క్లా' పేరుతో ఏడాది పాటు ఈ స్టింగ్ ఆపరేషన్ కొనసాగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కె సుగుమార్, సి. రాజేంద్రన్...(అన్నాడీఎంకే), లాలూ భాయ్ పటేల్, రవీంద్ర కుమార్ పాండే, హరి మంజి (బీజేపీ), విశ్వమోహన్ కుమార్, మహేశ్వర్ హజారీ, బుడియో చౌదరి (జేడీయూ), ఖిలాది లాల్ బైర్వా, విక్రమ్ భాయ్ అర్జున్ భాయ్ (కాంగ్రెస్), కైసర్ జహన్ (బీఎస్పీ) ఉన్నారు. -
ఇదేమి రాజ్యం...?!
అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం తుది దశకు చేరేసరికి ఆరోపణలు, ప్రత్యారోపణలు ఊపందుకున్నాయి. నిజానికి ఇదంతా మరో నాలుగైదు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న యుద్ధం. అందుకే, ప్రధాన ప్రత్యర్థి రాజకీయ పక్షాలు కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఎక్కడా తగ్గడంలేదు. అవతలి వారికి సంబంధించి వెల్లడయ్యే ఏ అంశాన్నీ వదలడంలేదు. ప్రత్యర్థిని ఖండఖండాలుగా తెగ్గోసి జనంలో పరువు తీయాలని, నిలువ నీడలేకుండా చేయాలని పోటీపడుతున్నాయి. ఈ చంపుడు పందెంలో ఇప్పటికైతే బీజేపీకి చావుదెబ్బ తగిలినట్టే కనిపిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్‌కు అందివచ్చిన అంశం చాలా చిత్రమైనది. డిటెక్టివ్ నవలల్లోని ఇతివృత్తాన్ని, ఇంకా చెప్పాలంటే నాజీ జర్మనీ కాలంనాటి ఉదంతాలనూ తలపింపజేసేది. 2009 ప్రాంతంలో గుజరాత్ వెళ్లిన ఒక యువతి గురించి, ఆమె కదలికలగురించి ఎప్పటికప్పుడు ఆరా తీయడానికి, ఆమెను అనుసరించడానికి అక్కడి ప్రభుత్వం తన యావత్తు భద్రతా యంత్రాంగాన్నీ మోహరించిన ఉదంతమిది. ఇలా ఆమె కదలికలపై అనుక్షణం నిఘా పెట్టడానికి, ఆమె గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరేయడానికి ఉగ్రవాద నిరోధక దళం, ఇంటెలిజెన్స్, క్రైం బ్రాంచ్ విభాగాల సిబ్బందిని ఎందుకు వినియోగించారన్నది జవాబులేని ప్రశ్న. వెబ్ పోర్టల్స్ కోబ్రాపోస్ట్, గులైల్ వెల్లడించిన ఈ నిఘా వ్యవహారంలో పాత్రధారి వివాదాస్పద బీజేపీ నేత అమిత్ షా. చట్టవిరుద్ధంగా ఆయన సాగించిన ఈ నిఘా వ్యవహారంలో యువతి ఎవరన్నది ఆ పోర్టల్స్ బయటపెట్టలేదు. ఆమె బెంగళూరుకు చెందిన యవతిఅని, ఆర్కిటెక్ట్ అని మాత్రం చెబుతున్నాయి. ఈ నిఘా వ్యవహారం సాగించిన సమయంలో అమిత్ షా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో జూనియర్ మంత్రి. యువతిపై నిఘాకు సంబంధించి సీనియర్ ఐపీఎస్ అధికారి జీఎల్ సింఘాల్‌తో మాట్లాడిన ప్రతిసారీ ‘సాహిబ్’ ఆదేశించారని, ‘సాహిబ్’ కోరుకుంటున్నారని అమిత్ షా చెప్పడం విశేషం. ఆ ‘సాహిబ్’ నరేంద్ర మోడీ కావొచ్చని సులభంగానే అర్ధమవుతుంది. అందువల్లే ఇప్పుడు బీజేపీకి ఈ వివాదం ప్రాణాంతకంగా మారింది. సమర్థించుకోవడం సాధ్యంకాక ఆ పార్టీ తల్లకిందులవుతున్నది. ఒక యువతిపై నిఘా పెట్టడంలో తప్పేమీ లేదని చెప్పడానికి బీజేపీ వేస్తున్న పిల్లిమొగ్గలు ఆ పార్టీని జనంలో మరింత పలచనచేస్తున్నాయి. ఆ యువతి కుటుంబంతో నరేంద్ర మోడీకి సాన్నిహిత్యం ఉన్నదని, ఆ యువతి తండ్రే తన కుమార్తె భద్రతపై ఆందోళనచెంది రక్షణ కల్పించమన్నాడని బీజేపీ చెబుతోంది. పైగా, ఆ సంగతి ఆమెకు కూడా తెలుసునని వివరిస్తోంది. ఇందుకు సంబంధించి ఆమె తండ్రి రాసినట్టుగా చెబుతున్న రెండు లేఖల్ని కూడా మీడియాకు బీజేపీ పంపిణీచేసింది. ఆ లేఖలే బీజేపీ కపటత్వాన్ని బయటపెడుతున్నాయి. తన కుమార్తె గుజరాత్లో ఏమైపోతుందో నన్నంత భయం ఆమె తండ్రికి ఎందుకు కలిగినట్టు? ఒకవేళ ఆయనకు అలా అనిపించినా ఆ అభిప్రాయం తప్పని నరేంద్ర మోడీ ఎందుకు చెప్పలేకపోయినట్టు? అసలు రక్షణ కల్పించడానికి, నిఘా పెట్టడానికి మధ్య చాలా తేడా ఉంది. ఆమె తండ్రి రక్షణ అడిగితే నిఘా పెట్టడం దేనికి? ఆ యువతే ఈ నిఘాను కోరుకున్నదని మరో వాదన మొదలుపెట్టారు. ఆ యువతికి తాను ఎక్కడికెళ్తున్నానో, ఏం చేస్తున్నానో, ఎవరెవరితో మాట్లాడుతున్నానో తెలియనంత పరిస్థితి ఉందా? అలాంటప్పుడు ఆమెకు రక్షణకన్నా, నిఘాకన్నా వైద్యుల అవసరం ఎక్కువున్నట్టు లెక్క. ఆమె కోసమని డజన్లమంది పోలీసులను తరలించేముందు ఆమె భద్రతకు ఏర్పడిన ముప్పేమిటో, అది ఏ స్థాయిలో ఉన్నదో మదింపువేశారా? ఇందులో ఏ ప్రశ్నకూ బీజేపీ వద్ద జవాబులేదు. తమ ఇష్టప్రకారమే జరిగింది గనుక, ఆమె వివాహమై ప్రశాంతంగా ఉంటున్నది గనుక ఈ వివాదానికి స్వస్తి పలకాలని ఆ తండ్రి కోరుతున్నాడని... కనుక ఇక ఎవరూ మాట్లాడటానికి లేదని చెబుతోంది. పౌరులపై చట్టవిరుద్ధంగా నిఘా పెట్టడం, వారిని వెన్నాడటం నేరపూరిత చర్యలు. పౌరహక్కులకు భంగం కలిగించే చర్యలు. బాధిత పౌరులు నేరస్తులను క్షమించామని చెప్పినంత మాత్రాన కేసు రద్దు కాదు. ఈ సూక్ష్మ విషయాన్ని కూడా బీజేపీ దిగ్గజాలు మరిచిపోతున్నాయి. పద్దెనిమిదేళ్లు నిండిన యువతీయువకులెవరైనా మన చట్టాల ప్రకారం, రాజ్యాంగం ప్రకారం స్వతంత్ర పౌరులు. ఆ వయస్సు దాటాక వారిపై నిఘా ఉంచమని చెప్పడానికి, తగిన కట్టుదిట్టాలు చేయమని చెప్పడానికి తల్లిదండ్రులకు సైతం హక్కుండదు. తండ్రి అడిగిన ప్రకారం చేశామని, ఆయనే మాట్లాడ వద్దంటున్నాడు గనుక ఇక ఆ ఊసెత్తవద్దని చెప్పడం మొరటుతనం అవుతుంది. ఈ వాదనను పాతికేళ్ల క్రితం చేసివుంటే బీజేపీ పెద్దల్ని ఎవరైనా క్షమించేవారేమో! పాలనలో ప్రవేశం లేదు గనుక అపరిపక్వతతో మాట్లాడారని సరిపెట్టుకునేవారేమో! కానీ, చదవేస్తే ఉన్నమతి పోయినట్టు అధికార పక్షంగానూ, ప్రతిపక్షంగానూ ఇంత అనుభవం గడించాక బీజేపీ ఇలాంటి వాదనలకు దిగుతోంది. ఇటు కాంగ్రెస్ తీరూ ప్రశ్నార్ధకమే. 2009నాటి ఈ వ్యవహారం కోబ్రాపోస్టు బయటపెడితే తప్ప కేంద్ర ప్రభుత్వానికి తెలియదని అనుకోలేం. అమిత్ షాకు అప్పట్లో చేదోడువాదోడుగా ఉండి, నిఘా వ్యవహారాన్ని నడిపించిన సింఘాలే ఇందుకు సంబంధించిన ఫోన్ రికార్డులను సీబీఐకి చాలాకాలం క్రితం అందజేశాడు. నిజంగా నిజాయితీ ఉంటే యూపీఏ ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించి దర్యాప్తునకు ఆదేశించేది. బాధ్యులపై కేసులు నడిపేది. కానీ, ఎన్నికల ప్రచార సమయంలో దీన్ని తురుపు ముక్కగా వాడుకుని ప్రత్యర్థి పక్షాన్ని దెబ్బతీయొచ్చునని భావించి ఇన్నాళ్లూ మౌనంగా ఉండిపోయింది. మన జాతీయోద్యమం తెచ్చిన విలువలపైగానీ, ఆ విలువలను పొదువుకున్న రాజ్యాంగంపైగానీ ఇరుపక్షాలకూ లేశమంత కూడా విశ్వాసం లేదని ఈ ఉదంతం నిరూపిస్తోంది.