
11 మంది ఎంపీల ముడుపుల బాగోతం
స్టింగ్ ఆపరేషన్‌తో బట్టబయలు చేసిన ‘కోబ్రాపోస్ట్’
రూ.50 వేల నుంచి రూ.50 లక్షల వరకు ముడుపులిస్తే చాలు...
ఎలాంటి సిఫారసు లేఖలైనా ఇవ్వడానికి సంసిద్ధత
వీరిలో ఇద్దరు కాంగ్రెస్, ముగ్గురు బీజేపీ, ఇద్దరు ఏఐఏడీఎంకే,
ముగ్గురు జేడీయూ, ఒకరు బీఎస్పీ ఎంపీ
న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో ప్రశ్నలకు ముడుపుల కుంభకోణం తరహాలో కోబ్రాపోస్ట్ న్యూస్ వెబ్‌సైట్ తాజాగా మరో కుంభకోణాన్ని బయటపెట్టింది. ఐదు పార్టీలకు చెందిన 11 మంది ఎంపీలు ముడుపులు తీసుకుని ఓ కల్పిత విదేశీ కంపెనీకి అనుకూలంగా సిఫారసు లేఖలు ఇవ్వడానికి సిద్ధపడ్డారని కోబ్రాపోస్ట్ వెబ్‌సైట్ సంపాదకుడు అనిరుద్ధ బహల్ గురువారం ఇక్కడ మీడియా సమావేశంలో వెల్లడించారు.
తమ స్టింగ్ ఆపరేషన్‌లో చిక్కిన వారిలో ఏఐఏడీఎంకే సభ్యులు కె.సుకుమార్, సి.రాజేంద్రన్, బీజేపీకి చెందిన లాలూభాయ్ పటేల్, రవీంద్రకుమార్ పాండే, హరి మాంఝీ, జేడీయూ సభ్యులు విశ్వమోహన్ కుమార్, మహేశ్వర్ హజారీ, భుదేవ్ చౌదరి, కాంగ్రెస్ ఎంపీలు ఖిలాడీలాల్ బైర్వా, విక్రమ్‌భాయ్ అర్జన్‌భాయ్, బీఎస్పీ సభ్యుడు కైసర్ జహాన్ ఉన్నట్లు తెలిపారు. రూ. 50 వేలు మొదలుకుని రూ. 50 లక్షలు తీసుకుని ఎలాంటి సిఫారసు లేఖలైనా ఇవ్వడానికి ఈ ఎంపీలు సంసిద్ధత వ్యక్తం చేశారని ఆయన చెప్పారు. ఏడాదిపాటు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో ఓ ఆరుగురు ఎంపీలు ఏకంగా లేఖలు కూడా ఇచ్చేశారని తెలిపారు.
ఈ ఎంపీల్లో కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు, బీజేపీ నుంచి ముగ్గురు, ఏఐఏడీఎంకే నుంచి ఇద్దరు, జేడీయూ నుంచి ముగ్గురు, బీఎస్పీ నుంచి ఒకరు ఉన్నారని వివరించారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో మెడిటరేనియన్ ఆయిల్ కార్పొరేషన్ పేరిట తమకు సంస్థ ఉందంటూ తమ ప్రతినిధులు సదరు ఎంపీలను సంప్రదించగా, కనీస వివరాలను కూడా తెలుసుకోవడానికి వారు ప్రయత్నించలేదని అన్నారు. ఆరుగురు ఎంపీలు రూ. 50 వేలు మొదలుకొని రూ. 75 వేల వరకు ముడుపులు తీసుకుని కల్పిత కంపెనీకి అనుకూలంగా లేఖలు ఇచ్చారని బహల్ వెల్లడించారు. మిగిలినవారు రూ. 5 లక్షలకు తగ్గేది లేదన్నారని, ఒక ఎంపీ అయితే ఒక్క లేఖ ఇవ్వడానికి రూ. 50 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు. తమ రిపోర్టర్లు కంపెనీ కన్సల్టెంట్లుగా చెప్పుకుని మధ్యవర్తులు, వ్యక్తిగత సిబ్బంది సహాయంతో ఎంపీలను సంప్రదించారని, మహిళా ఎంపీల విషయంలో వారి భర్తలను సంప్రదించారని బహల్ చెప్పారు. మరోవైపు, వీరిలో కొందరు ఎంపీలను వివరణ కోరగా, తమపై ఆరోపణలను ఖండించారు. తమను రాజకీయంగా దెబ్బతీయడానికే ఈ ఆరోపణలు చేస్తున్నారని జేడీయూ ఎంపీ మహేశ్వర్ హజారీ వ్యాఖ్యానించారు. తాను ముడుపులు తీసుకోలేదని, లేఖలు కూడా ఇవ్వలేదని స్పష్టంచేశారు. తన పీఏ చెబితే సిఫారసు లేఖ ఇచ్చానని, ముడుపులు తీసుకోలేదని మరో జేడీయూ ఎంపీ విశ్వమోహన్ కుమార్ చెప్పారు. కాగా, ఈ ఎంపీల చర్య అవినీతి నిరోధక చట్టంకిందకు వస్తుందని, వీరిపై దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు.