ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిరం-బాబ్రీ మసీదు వివాదంపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధ్యమైనంత త్వరగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడం ఉత్తమమని, లేనిపక్షంలో భారత్ మరో సిరియాగా మారుతుందని హెచ్చరించారు. సిరియాలో జరుగుతున్న బాంబుదాడుల్లో అమాయక ప్రజలు, చిన్నారులు మృత్యువాత పడుతున్న విషయం తెలిసిందే. రామమందిరం-బాబ్రీ మసీదు వివాదం నేపథ్యంలో భారత్‌లోనే సిరియాను చూడాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని చెప్పారు.
సిరియా నరమేధం నుంచి ముస్లింలు కొన్ని విషయాలు నేర్చుకుని, అయోధ్య వివాదంపై ఆశలు వదులుకుని వెనక్కి తగ్గడమే ఉత్తమమని అభిప్రాయపడ్డారు. జాతీయ మీడియా ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశంకర్ ఈ విషయాలు ప్రస్తావించారు. అయోధ్య అనేది ముస్లింలకు సంబంధించిన అంశం, ప్రాంతం కాదని వారు గుర్తించాలన్నారు. శ్రీరాముడిని అయోధ్యలో కాకుండా వేరే ప్రాంతంలో జన్మించేలా చేయడం అసాధ్యమని.. ఇలాంటి వివాదాస్పద ప్రాంతాన్ని ఇస్లాం ఎప్పటికీ కోరుకోదని చెప్పారు. హిందువులు, ముస్లింల పరస్పర ఆమోదంతో రామమందిర నిర్మాణం జరగాలని కోరుకుంటున్నామని తెలిపారు. ముస్లింలకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని, వారు ఆ స్థలంలో మసీదు నిర్మించుకోవడం ఉత్తమమని పేర్కొన్నారు. వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మించేందుకు ముస్లింలు పూర్తి మద్ధతు తెలపాలని పిలుపునిచ్చారు.
రామ మందిరం-బాబ్రీ మసీదు కూల్చిన ప్రాంతంలో అన్ని మతాల వారికి ఉపయోగపడే ఆసుపత్రి, లేదా ఇతరత్రా ఏదైనా నిర్మించాలని సలహా ఇచ్చారు. కొందరు తనపై దుష్ప్రచారం చేస్తూ వివాదాన్ని పెంచేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్య అంశంలో ప్రతి ఒక్కరూ కోర్టు తీర్పును అంగీకరించే పరిస్థితుల్లో లేరన్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఏఐఎంపీఎల్‌బీ) బహిష్కృత సభ్యుడు సయ్యద్ సల్మాన్ హుస్సేన్ నద్వీని తాను ప్రలోభపెట్టలేదని వెల్లడించారు. షరియా చట్టం ప్రకారం మసీదును వేరే చోటుకి తరలించడం సాధ్యమేనని నద్వీ గతంలో ప్రకటన చేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment