‘బాబ్రీ’ పై కీలక వాదోపవాదాలు
న్యూఢిల్లీ: అయోధ్య కేసులో మంగళవారం సుప్రీంకోర్టులో కీలక వాదోపవాదాలు జరిగాయి. వివాదాస్పద స్థలానికి సమీపంలోని ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోనే మసీదు నిర్మించాలని షియా బోర్డు మంగళవారం సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించింది. ఒకే చోట రామమందిరం, మసీదు ఉంటే అది వివాదాలకు దారితీస్తుందని షియా వక్ఫ్ బోర్డు ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇతర భాగస్వాములందరితో కూడిన కమిటీ దశాబ్ధాల నాటి ఈ వివాదానికి తెరదించాలని సూచించింది. ఈ కమిటీలో ప్రధాని కార్యాలయం, యూపీ సీఎం కార్యాలయం నుంచి నామినీలకూ చోటు కల్పించాలని కోరింది.
వాదోపవాదాలను పరిశీలించిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 11న చేపట్టనున్నట్టు పేర్కొంది. ఇక వివాదాస్పద స్ధలాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగాన్ని రామ మందిరం కోసం, మరో భాగాన్ని నిర్మోహి అఖదకు, మూడో భాగాన్ని సున్ని వక్ఫ్ బోర్డుకు అప్పగించాలని 2010లో అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ పేర్కొంది. కాగా, షియా వక్ఫ్ బోర్డు తాజాగా సుప్రీం ఎదుట భిన్న వాదనలు వినిపించింది. సున్ని బోర్డుకు కేటాయించిన వివాదాస్పద స్థలంలో భాగం తమకు చెందినదని షియా బోర్డు పేర్కొంది.
కాగా అయోధ్య–బాబ్రీ మసీదు వివాదంలో 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించడానికి ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌ను సుప్రీం కోర్టు నియమించిన విషయం తెలిసిందే. జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌ల బెంచ్ ఈ నెల 11 నుంచి పిటిషన్ల విచారణ ప్రారంభించనుంది. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని గతంలో సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహీ అఖరా, రామ్‌లల్లాలకు సమానంగా పంచాలని గతంలో అలహాబాద్ హైకోర్టు 2:1 మెజారిటీతో తీర్పునిచ్చిన విషయం విదితమే.