సాక్షి, న్యూఢిల్లీ : నేటికి సరిగ్గా పాతిక సంవత్సరాల క్రితం అంటే, 1992, డిసెంబర్ 6వ తేదీన అయోధ్యలోని వివాదాస్పద బాబ్రీ మసీదు విధ్వంసానికి దారితీసిన పరిస్థితులు, వైఫల్యాలు, బాధ్యులను పది అంకెల్లో పేర్కొనవచ్చు!
1. ఎల్‌కే అద్వానీ
1990, సెప్టెంబర్ 25 తేదీన భారతీయ జనతా పార్టీ ఎల్‌కే అద్వానీ చేపట్టిన రథయాత్ర బాబ్రీ మసీదు విధ్వంసానికి బీజం వేసింది. ఆయన రథ యాత్ర పలు రాష్ట్రాల్లో హిందూ, ముస్లింల మధ్య ఉద్రిక్తతలను పెంచి అల్లర్లకు దారితీసింది. పైగా అద్వానీ బాబ్రీ మసీదు విధ్వంసం రోజున అక్కడే వేదికపై ఉన్నారు. ఆయన పక్కన పార్టీ సహచరులు మురళీ మనోహర్ జోషి, ఉమా భారతిలు ఉన్నారు. వారంతా బాబ్రీ విధ్వంసానికి కరసేవకులను ప్రోత్సహించారనే అభియోగాలు ఉన్నాయి. ఆ తర్వాత 1992, డిసెంబర్ 6వ తేదీన తన జీవితంలో అత్యంత చీకటి రోజని అద్వానీ బాధను వ్యక్తం చేశారు. ఆ బాధ నిజంగా కలిగిందా, ఆత్మవంచనా ? ఆయనకే తెలియాలి.
2. ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషద్, బజరంగ్ దళ్
ఈ సంఘాలు హిందూ, ముస్లింలు, క్రైస్తవుల మధ్య వైషమ్యాలనే సష్టించడమే కాకుండా బాబ్రీ మసీదు విధ్వంసానికి కార్యకర్తలను తరలించాయి. సాధ్వీ రిదంబర లాంటి వారు వారిలో మరింత ఆజ్యం పోశారు. ‘కహో గర్వ్‌సే హమ్ హిందూ హై, హిందుస్థాన్ హమారా హై, జో హమ్‌సే టక్‌రాయేగా, వో కుత్తేకి మౌత్ యహాపర్ దేకో మారా జాయేగా, జహా బనీ హై మసీద్, అప్నా మందిర్ వహీ బనాయింగే. బాబర్ కే హౌలాదోం, జావో పాకిస్థాన్, యా కబరిస్థాన్’ అంటూ ఆమె రెచ్చగొట్టారు.
3. పీవీ నర్సింహారావు
అప్పుడు ప్రధాన మంత్రిగా ఉన్న పీవీ నరసింహారావు బాబ్రీ మసీదును రక్షించేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపాల్సి ఉండగా, అలా చేయలేదు. జన నష్టం ఎక్కువ జరుగుతుందంటూ సాకు చెప్పారు. ఉత్తర ప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ తనకిచ్చిన మాట తప్పారంటూ సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. రామ మందిరాన్ని కోరుకుంటున్న కళ్యాణ్ సింగ్ బాబ్రీ మసీదు విధ్వంసం కాకుండా అడ్డుకుంటారని అనుకున్నాననడం అర్థరహితం. 1984లో ఢిల్లీలో సిక్కుల అల్లర్లు చెలరేగినప్పుడు కూడా వాటిని నిరోధించడంలో పీవీ విఫలం అయ్యారు.
4. కళ్యాణ్ సింగ్
ఆయన బాబ్రీ మసీదును విధ్వంసం నుంచి రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆయన తన బీజేపీ పార్టీతోపాటు తాను మసీదు విధ్వంసాన్ని కోరుకున్నారు. శక్తివంచన లేకుండా మసీదును పరిరక్షించేందుకు ప్రయత్నించానని చెప్పుకున్నారు.
5. శివసేన
బాబ్రీ మసీదు విధ్వంసం అనంతరం ముంబైలో చెలరేగిన అల్లర్లకు శివసేనదే బాధ్యత. ఆ పార్టీ నాయకుడు తన పత్రిక ‘సామ్నా’ద్వారా అల్లర్లను ప్రేరేపించారు. నాటి అల్లర్లలో వందలాది మంది మరణించారు. శ్రీకష్ణ కమిషన్ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది.
6. పోలీసులు, భద్రతా దళాల వైఫల్యం
అయోధ్యలో బాబ్రీ మసీదు వద్ద భద్రతా విధుల్లో ఉన్న పోలీసులు, భద్రతా బలగాలు కరసేవకులకు భయపడి పారిపోయారు. ముంబైలో హిందూ మూకలు అల్లర్లకు పాల్పడుతుంటే కూడా మౌన ప్రేక్షకుల్లా ఉండిపోయారు.
7. కాంగ్రెస్ పార్టీ
1992, 1993లలో ఇటు కేంద్రంలో, అటు మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బాబ్రీ మసీదును రక్షించడంలో, ముంబై అల్లర్లను నిరోధించడంలో పూర్తిగా విఫలమైంది. రాష్ట్ర ప్రభుత్వం అల్లర్లపై శ్రీకష్ణ కమిషన్‌ను వేసింది. ఆ కమిషన్ నివేదికపై కఠన చర్యలు తీసుకుంటానని ఎన్నికల మేనిఫెస్టోలో పదేపదే హామీ ఇచ్చి కూడా ఎన్నడూ ఎలాంటి చర్య తీసుకోలేదు.
8. ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
శాస్త విజ్ఞానం ప్రాతిపదికన వ్యవహరించాల్సిన ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా హిందూత్వ ఎజెండాకే మద్దతు పలికింది. పుక్కిటి పురాణాల్లో ఉన్న సరస్వతి నదికి, సింధూ నాగరికతకు లింకు ఉందని చెప్పింది. పెద్దగా తవ్వకాలు జరపకుండానే బాబ్రీ మసీదు కింద రామాలయం ఉందని తేల్చింది.
9. క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ
బాబ్రీ మసీదు విధ్వంసంపై 1992లోనే దర్యాప్తునకు లిబర్హాన్ కమిషన్‌ను వేశారు. అది 17 సంవత్సరాల తర్వాత, అంటే 2009లో నివేదికను సమర్పించింది. ఇంతటి ఆలస్యానికి అర్థం ఏమైనా ఉందా? 1993, అక్టోబర్‌లో సీబీఐ అద్వానీ, మురళీ మనోహర్, ఉమా భారతి సహా 21 మంది నిందితులపై బాబ్రీ విధ్వంసం కుట్రకేసును నమోదు చేసింది. ఈ కేసును సాంకేతిక కారణాలను చూపిస్తూ 2011లో అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. తిరిగి ఈ కేసును 2017లో సుప్రీం కోర్టు పునరుద్ధరించింది. 21 మంది నిందితుల్లో ఇప్పటికే 8 మంది నిందితులు మరణించారు.
10. సుప్రీం కోర్టు
బాబ్రీ విధ్వంసం కేసుకన్నా బాబ్రీ మసీదు వివాదం ఎన్నో ఏళ్లుగా అంటే, దాదాపు ఏడు దశాబ్దాలుగా సుప్రీం కోర్టులో నలుగుతోంది. ఇరుపక్షాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలంటూ సూచించడం తప్పా వివాదాన్ని పరిష్కరించలేకపోయింది. భూ వివాదానికి సంబంధించిన ఈ కేసు తుది విచారణను మళ్లీ ఫిబ్రవరికి వాయిదా వేసింది.
బాబ్రీ విధ్వంసానికి పది కారణాలు
Published Wed, Dec 6 2017 5:14 PM | Last Updated on Wed, Dec 6 2017 6:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment