*జంట కమిషనరేట్లలో 144 సెక్షన్
*పాతబస్తీలో పోలీసు బలగాల మోహరింపు
హైదరాబాద్ : బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిన డిసెంబర్ ఆరో తేదీని బ్లాక్‌డేగా ప్రకటిస్తున్నట్లు ఎంఐఎం, ఎంబీటీ పార్టీలు పిలుపునివ్వగా బీజేపీ, వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు విజయ్ దివస్‌గా నిర్వహించాలని పిలుపునిచ్చాయి. రెండు కార్యక్రమాలూ ఇరు వర్గాల మనోభావాలకు సంబంధించిన అంశాలతో ముడి పడి ఉండటంతో జంట కమిషనరేట్ పోలీసులు అప్రమత్తమయ్యారు. మరోవైపు పాతబస్తీలో దుకాణాలు మూసివేశారు.
శనివారం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా 144 సెక్షన్ విధించారు. వ్యక్తులు, వస్తువులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 100 నంబర్‌కు ఫోన్ చేయాలని జంట పోలీసు కమిషనర్లు ఎం. మహేందర్‌రెడ్డి, సీవీ. ఆనంద్‌లు ప్రజలకు ఒక ప్రకటనలో సూచించారు. పాతబస్తీతోపాటు అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక ప్రాంతాలు, గతంలో ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తోపాటు తెలంగాణ స్పెషల్ పోలీస్, ఆర్మ్‌డ్ రిజర్వ్ బలగాలను రంగంలోకి దింపారు.
పోలీస్ స్టేషన్లకు హెచ్చరికలు జారీ చేశారు. పాతబస్తీలో సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ కమిషనర్ మహేందర్‌రెడ్డి, అదనపు పోలీసు కమిషనర్ అంజనీకుమార్, జాయింట్ పోలీసు కమిషనర్ వై.నాగిరెడ్డి, టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి, అదనపు డీసీపీ కోటిరెడ్డిలు పర్యటించి బందోబస్తును పర్యవేక్షించారు.
పుకార్లను నమ్మొద్దు
ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మొద్దు. ఎస్సెమ్మెస్, వాట్సాప్ తదితర ప్రచార సాధనాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఫొటోలు పంపించొద్దు. పుకార్లు పుట్టించేవారి గురించి సమాచారం ఇవ్వండి. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవు. -మహేందర్‌రెడ్డి
శాంతియుతంగా జరపండి
బ్లాక్ డేను శాంతియుతంగా జరుపుకోవాలి. బలవంతంగా ఎవరి దుకాణాలు మూయించొద్దు. ఘర్షణలకు తావులేకుండా ప్రార్థనలు మాత్రమే చేసుకోవాలి. శాంతియుతంగా బంద్, బ్లాక్‌డేను విజయవంతం చేయాలి. -ఎంఐఎం, ఎంబీటీ
బ్లాక్ డేకు భారీ బందోబస్తు
Published Sat, Dec 6 2014 11:42 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement