ఇండోర్ : దృశ్యం సినిమా తరహాలో ఓ కాంగ్రెస్ కార్యకర్తను హత్య చేసిన తండ్రీ కొడుకులు.. పోలీసుల కళ్లుకప్పి రెండేళ్లపాటు నిజాన్ని దాచగలిగారు. చివరకు పోలీసుల విచారణలో నిజం బయటపడి కటకటాలపాలయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఇండోర్ కు చెందిన బీజేపీ మాజీ కౌన్సిలర్ జగదీశ్ కరోటియా (65) అదే ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ మహిళా కార్యకర్త ట్వింకిల్ దాగ్రే (22) ల మధ్య వివాహేతర బంధం ఏర్పడింది. వీరి మధ్య ఉన్న అక్రమ సంబంధం కరోటియా ముగ్గురు కుమారులు అజయ్(38), విజయ్(36), వినయ్(31)లకు తెలిసింది. దీంతో తండ్రితో గొడవకు దిగారు. ట్వింకిల్ తో గడిపితే సహించేది లేదని తేల్చి చెప్పారు. కుమారుల ఒత్తిడితో ట్వింకిల్ ను హతమార్చేందుకు జగదీశ్ ప్లాన్ చేశారు. ఆపై 'దృశ్యం' సినిమా చూసిన వీరంతా, అలాగే ప్లాన్ చేశారు. తమ సన్నిహితుడు నిలేశ్(28)తో కలిసి ట్వింకిల్ ను హత్య చేశారు.
హత్య అనంతరం ఆమెను తమ కారులో తీసుకెళ్లి కాల్చేశారు. ఈ హత్యపై కచ్చితంగా పోలీసులు తమనే అనుమానిస్తారని ఊహించిన నిందితులు.. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ఓ చోట చనిపోయిన కుక్క మృత దేహాన్ని పాతిపెట్టారు.
కొంతకాలం తరువాత ఎవరినో హత్య చేసి, పూడ్చి పెట్టారన్న పుకారును లేవనెత్తారు. అప్పటికే ట్వింకిల్ అదృశ్యంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు, డాగ్ స్క్వాడ్ తో రాగా, పూడ్చి పెట్టిన ప్రాంతంలో కుక్క కళేబరం మాత్రమే వారికి కనిపించింది. ఇలా రెండేళ్లు గడిచిపోయాయి.
పోలీసులకు జగదీశ్ తో ట్వింకిల్ కు ఉన్న వివాహేతర బంధం గురించి తెలిసి ఆ దిశగా విచారించగా, అసలైన నిందితులని గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేశామని, మరిన్ని వివరాల కోసం వారిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment