ఢిల్లీ: వెంకటేశ్ హీరోగా దృశ్యం సినిమా వచ్చిన మీకందరికి తెలిసిందే. అందులో హీరో తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం సినిమాల్లోని సన్నివేశాలను ప్రేరణగా తీసుకొని పోలీసులను ముప్పతిప్పలు పెడుతుంటాడు. అచ్చం అదే తరహాలో హత్యకేసులో బెయిల్‌పై బయటకొచ్చిన ఒక వ్యక్తి తన స్నేహితుల సాయంతో దృశ్యం సినిమా ప్రేరణతో పోలీసులను బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించాడు. కానీ చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.
వివరాలు.. నార్త్ ఢిల్లీకి చెందిన అమర్‌పాల్ తన ఇంటిపక్కన ఉండే ఒంబిర్ కుటుంబంతో తరచుగా గొడవపడుతుండేవాడు. కాగా జూన్ 29న మరోసారి ఇరు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఒంబిర్ తల్లిని అమర్‌పాల్ చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అమర్‌పాల్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే ఆ తర్వాత 60 రోజుల మధ్యంతర బెయిల్‌పై ఇటీవలే బయటికి వచ్చాడు. పెరోల్‌పై బయటికి వచ్చిన అతను తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలంటూ ఒంబిర్ కుటుంబంపై ఒత్తిడి తెచ్చాడు. కానీ వారు మాట వినకపోవడంతో ఒక మాస్టర్‌ప్లాన్ వేశాడు. తన సోదరుడు గుడ్డు, కజిన్ అనిల్‌ను ఇంటికి పిలిపించి వారికి దృశ్యం సినిమాను చూపించాడు. ఆ సినిమాలోలాగా ఇక్కడ జరిగిన సన్నివేశాలను, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేశాడు.
ఈ నేపథ్యంలోనే తనకు ఒంబిర్ కుటుంబసభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని.. అయినా ఒంబిర్ తల్లిని తాను చంపలేదని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఒక దేశీ పిస్టల్, బుల్లెట్ ప్యాలెట్‌ను కొనుగోలు చేశాడు. తనను కాల్చాలని.. కానీ తను చనిపోకూడదని.. ఈ కాల్పుల వెనుక ఒంబిర్ కుటుంబం హస్తం ఉందని పోలీసులను నమ్మించాలని అనిల్, గుడ్డులకు తెలిపాడు. ఆ తర్వాత అనిల్ తన స్నేహితుడు మనీష్‌ను కలిసి ప్లాన్‌ను వివవరించాడు. వారి ప్లాన్ ప్రకారం ముందుగా కైబర్‌పాస్‌కు వెళ్లిన అమర్‌పాల్ అనిల్ కోసం వేచి చూశాడు.
ఒక గంట తర్వాత తమ ప్లాన్‌లో భాగంగా అమర్‌పాల్ ఉన్న చోటికి వచ్చిన అనిల్ అతనిపై కాల్పులు జరిపి అక్కడినుంచి పారిపోయాడు. ఆ తర్వాత గాయాలతోనే అమర్‌పాల్ తన స్నేహితుని ఇంటికి వెళ్లి ఒంబిర్ కుటుంబం తనను చంపడానికి చూస్తుందని వారికి వివరించాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించగా.. అనిల్‌ను అదుపులోకి తీసుకోని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం చెప్పేశాడు. దీంతో అమర్‌పాల్‌ను మరోసారి అరెస్ట్ చేసిన పోలీసులు ప్రస్తుతం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా పరారీలో ఉన్న గుడ్డు, మనీష్‌లను పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment