భోపాల్ : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలోని భైరాగఢ్ ప్రాంతంలో ఆదివారం నాడు ఆనందోత్సవాల్లో భాగంగా ఇద్దరు బీజేపీ యువజన నాయకులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసులు వారిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. అయితే వారిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు.
బీజేపీ యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు నీలి రంగు కురత ధరించిన రాహుల్ రాజ్‌పుత్ తన పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఆయన పక్కనే ఉన్న బీజేపీ యువమోర్చా భోపాల్ జిల్లా అధ్యక్షుడు నితిన్ దూబే కూడా గాల్లోకి కాల్పులు జరిపేందుకు ఆయన వద్ద నుంచి పిస్టల్‌ను తీసుకొనే ప్రయత్నం చేశారు. అందుకు రాహుల్ రాజ్‌పుత్ అనుచరుడొకరు అడ్డు పడడంతో ఆయన తన వద్దనున్న లైసెన్స్‌డ్ ఫిస్టల్ తీసి గాల్లోకి కాల్పులు జరిపారు.
ఈ కాల్పులకు సంబంధించిన వీడియోను ఏఎన్‌ఐ వార్తా సంస్థ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో అది వైరల్ అయింది. ఈ మేరకు బైరాగఢ్ పోలీసు స్టేషన్‌లో ఓ ఫిర్యాదు కూడా దాఖలయింది. ఫిర్యాదుతోపాటు ఫిర్యాదుదారుడు వీడియోను కూడా తమకు సమర్పించారని పోలీసు స్టేషన్ ఇంచార్జి మహేంద్ర సింగ్ చౌహాన్ తెలిపారు. ఎలాంటి వేడుకల సందర్భంగానైనా, లైసెన్స్ ఉన్న సొంత ఫిస్టల్‌తోని కూడా గాల్లోకి కాల్పులు జరపడానికి వీల్లేదని, అలా చేయడం నేరమవుతుందని ఆ పోలీసు అధికారి తెలిపారు. నిందితులపై ఇంకా చర్య తీసుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు.
ఈ సంఘటనపై రాజ్‌పుత్ స్పందిస్తూ ‘నేనొక బాధ్యతగల పౌరుడిని. గాల్లోకి కాల్పులు జరిపిందీ లైసెన్స్ ఉన్న నా తుపాకీతో కాదు. అది చైనాలో తయారైన ఎయిర్‌గన్. ఎవరో సరదా కోసం దాన్ని నా చేతికిచ్చి కాల్చుమంటే కాల్చాను. నాలాగే నితిన్ కూడా ఎవరో కార్యకర్త ఇచ్చిన ఎయిర్‌గన్‌తోనే కాల్పులు జరిపాడు’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment