మోదీ-షా హవా; కొత్త ట్విస్ట్‌ | New Twist To Modi-Shah Domination | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 23 2018 2:25 PM | Last Updated on Fri, Mar 29 2019 5:32 PM

New Twist To Modi-Shah Domination - Sakshi

ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ-షా ద్వయం ముద్ర కనిపించడం లేదు. 2014లో ప్రధాని పీఠాన్ని నరేంద్ర మోదీ అధిష్టించినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో వీరి ముద్ర స్పష్టంగా కనిపించింది. బీజేపీలో అన్ని తామే వ్యవహరించి విజయాలను తమ ఖాతాలో వేసుకున్నారు. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో సీనియర్‌ నాయకులు ఎంతమంది ఉన్నప్పటికీ మోదీ-షా జోడీ ముందుండి నడిపించింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగుతున్న రమణ సింగ్‌, శివరాజ్‌ సింగ్‌, వసుంధర రాజే సొంత గొంతుక విన్పిస్తున్నారు. బీజేపీలో అగ్రస్థాయి వ్యూహకర్తల బృందంలో అమిత్‌ షా, మోదీకి సమానంగా పరిగణించబడుతున్న వీరు మోదీ-షా ద్వయంపై ఆధారపడకుండానే ముందుకు పోతున్నారు. 

మోదీ ప్రధాని పీఠమెక్కిన నాటి నుంచి ఇప్పటివరకు 22 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగ్గా 19 రాష్ట్రాల్లో కమలం పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. 2014లో జరిగిన జార్కండ్‌, హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పాలక పగ్గాలు దక్కించుకుంది. హరియణాలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడంలో కాషాయ పార్టీ సఫలమైంది. ఇదే ఏడాది చివరి జరిగిన ఎన్నికల్లో జమ్మూకశ్మీర్‌లోనూ పాగా వేసింది. పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పీడీపీ)తో కలిసి అధికారాన్ని పంచుకుంది. బీజేపీకి 2015 కలిసిరాలేదు. అదే ఏడాది ఢిల్లీ, బిహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోరులో కమలం పార్టీకి చుక్కెదురైంది. అసోంలో గెలుపుతో 2016లో ఈశాన్య రాష్ట్రాల్లోకి అడుగుపెట్టిన కమలనాథులు, అదే సంవత్సరం జరిగిన పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ ఎన్నికల్లో​ భంగపడ్డారు.

2017లో ఉత్తరప్రదేశ్‌లో భారీ విజయంతో పాటు ఉత్తరాఖండ్‌, హిమచల్‌ప్రదేశ్‌నూ తన ఖాతాలో వేసుకుంది. మేఘాలయా, నాగాలాండ్‌, మణిపూర్‌, త్రిపురలోనూ విజయఢంకా మోగించి ఈశాన్యంలో తిరుగులేని శక్తిగా మారింది. గట్టి పోటీ ఎదురైనప్పటికీ గుజరాత్‌లో అధికారాన్ని నిలబెట్టుకుంది. మోదీ-షా సొంత రాష్ట్రం కావడంతో ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బొటాబొటి మెజారిటీతో గట్టెక్కింది. అయితే ఈ ఏడాదిలో కర్ణాటక ఎన్నికల్లో కాషాయ పార్టీకి అనూహ‍్యంగా షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌) కలిసి బీజేపీకి ఝలక్‌ ఇచ్చాయి. 

తాజాగా జరుగుతున్న ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ఎన్నికల్లో మోదీ-షా ముద్ర అంతగా కనిపించడం లేదు. ఈ మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్న రమణ్‌ సింగ్‌, శివరాజ్‌ సింగ్‌, వసుంధర రాజె బలమైన నాయకులు. తమకు తామే సొంతంగా వ్యూహాలను అమలు చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీంతో మోదీ-షా జోడికి పెద్దగా పని లేకుండా పోయింది. ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటికే ఎన్నికలు ముగిశాయి. ఒకవేళ బీజేపీ ఇక్కడ మళ్లీ గెలిస్తే ఆ ఘనత అంతా రమణ్‌ సింగ్‌కే దక్కుతుంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఫలితం వచ్చే అవకాశముందని సర్వేలు చెబుతున్నాయి. అయినప్పటికీ రాజే వెనక్కు తగ్గడం లేదు. మోదీ-షా ముద్ర లేకుండానే తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఆమెను తప్పించే సాహసం చేయలేకపోతోంది బీజేపీ అధిష్టానం. ఈశాన్య రాష్ట్రం మిజొరంలోనూ మోదీ-షా ముచ్చట లేదు. ఇక్కడ హంగ్‌ వచ్చే అవకాశముందని సర్వేలు అంచనా వేశాయి. తెలంగాణలో బలమైన నాయకులు లేకపోవడంతో మోదీ-షా మ్యాజిక్‌ పైనే స్థానిక నేతలు ఆశలు పెట్టుకున్నారు. దీనికనుగుణంగానే మోదీ-షా ప్రచార పర్వాన్ని భారీస్థాయిలో నిర్వహించనున్నారు. 

ఈ నాలుగున్నరేళ్లలో జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోదీ-షా హవా నడిచింది. అభ్యర్థుల ఖరారు, ప్రచారం, ముఖ్యమంత్రి అభ్యర్థుల ఎంపిక విషయాల్లో వీరే ఆధిపత్యం చెలాయించారు. బలమైన ప్రాంతీయ నేతలు లేకపోవడంతో అన్ని విజయాలన్నీ వీరి ఖాతాలోకి వెళ్లిపోయాయి. ముఖ్యమంత్రి అభ్యర్థుల విషయంలోనూ అనూహ్య నిర్ణయాలు తీసుకుని తమ ప్రత్యేకత చాటుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండటం ఈ ఎన్నికల్లోని విశేషం. ఇక్కడ బీజేపీకి సానుకూల ఫలితాలు వస్తే మోదీ-షా ‘ముద్ర’  మాయం కావడం ఖాయమన్నది విశ్లేషకుల అభిప్రాయం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement