four state elections results
-
ఇక రైతు కేంద్రంగా రాజకీయం
బలమైన, వ్యూహాత్మకంగా అడుగేసే ప్రతిపక్ష కూటమి బీజేపీని ప్రకంపింప చేస్తుందని, చివరకు ఓడించగలుగుతుందని కూడా ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు నిరూపించాయి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం నేర్చుకోవలసిన పాఠం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రైతును నిర్లక్ష్యం చేస్తే, మీ పతనం తప్పదు. దేశవ్యాప్తంగా వ్యవసాయ సంక్షోభంలో చిక్కుకున్న రైతులు తమ సమస్యలను ఏదోమేరకు గుర్తించి, పరిష్కరించిన చోట ప్రభుత్వాలను అందలమెక్కిస్తున్నారు. దీనికి అసలు సిసలు ఉదాహరణ తెలంగాణ. రైతులకు నగదు నేరుగా బదలాయించి ఈ ఎన్నికల్లో వారి మద్దతును కేసీఆర్ ప్రభుత్వం గణనీయంగా సాధించింది. మూడు హిందీ ప్రాబల్య రాష్ట్రాల్లో హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయం తర్వాత వచ్చే కొద్ది నెలల్లో రాజకీయ పరిదృశ్యానికి సంబంధించిన రూపురేఖలు పదునెక్కనున్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలు ఆరునెలల్లోపే జరుగనుండటంతో ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఓటింగ్ సరళి నుంచి పాలక బీజేపీ, ప్రతిపక్ష పార్టీలు కూడా కొన్ని గుణపాఠాలు నేర్చుకోవలసి ఉంది. రానున్న కొద్దిరోజుల్లో ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సమగ్ర వివరాలతో చర్చలు జరుగుతాయి. విశ్లేషణలు జరుగుతాయి. కానీ ఈ ఎన్నికలు ప్రధానంగా మూడు ముఖ్యమైన విషయాలను రంగంమీదికి తీసుకొచ్చినట్లు స్పష్టమైపోయింది. అవేమిటంటే, గ్రామీణభారతంలో అశాంతి అనేది వాస్తవం. ఓటింగుపై దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది. రెండోది, మతపరమైన విభజన లేదా సమీకరణ అనేది విశ్వాసాలను పటిష్టం చేస్తుందేమో కానీ అది భారీ ఎత్తున ఓట్లను సంపాదించలేదు. ఇక మూడో అంశం.. బలమైన, వ్యూహాత్మకమైన ప్రతి పక్ష కూటమి బీజేíపీని కదిలించివేస్తుంది, ఓడిస్తుంది కూడా. రైతు సంక్షేమమే తొలి ప్రాధాన్యత దేశవ్యాప్తంగా రైతులు తీవ్రంగా బాధపడుతున్నారు. తమ సమస్యలను ఏదోమేరకు గుర్తించి, పరిష్కరించిన చోట వారు ప్రభుత్వాలను అందలమెక్కిస్తున్నారు. దీనికి అసలు సిసలు ఉదాహరణ తెలంగాణ. పాలకపార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి రైతులకు నగదు నేరుగా బదలాయించి ఈ ఎన్నికల్లో వారి మద్దతును గణనీయంగా కొల్లగొట్టింది. తెలంగాణ భావనపట్ల గతంలో ప్రజల్లో ఉన్న తీవ్రమైన అత్యుత్సాహం ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. అలాగే 2014 ఎన్నికల్లోలాగా ఉప జాతీ యవాదం కూడా ఇప్పుడు అంత బలంగా లేదు. సమస్యల ప్రాతిపదికన స్పందించే చైతన్యం తెలంగాణ ఓటర్లలో పెరిగిందనడానికి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు స్పష్టంగా రుజువు చేశాయి. మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తీవ్రంగానే ప్రయత్నించారు. కానీ 2017 జూన్‌లో ఆ రాష్ట్రంలో మండసార్‌లో రైతులపై కాల్పులు జరగడం ఆయన పాలనకు మచ్చగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో కూడా ఆయన వ్యక్తిగత ప్రజాదరణ కొనసాగింది. కానీ గ్రామీణ ఓటర్లలో కొన్ని విభాగాల మద్దతును ఆయన తప్పకుండా పొంది ఉండాల్సింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం నేర్చుకోవలసిన పాఠం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రైతును నిర్లక్ష్యం చేస్తే, మీ పతనం తప్పదు. ఈ గుణపాఠంతో రానున్న నెలల్లో రైతులను మరిన్ని ప్రలోభాలకు గురిచేస్తారని ఊహించవచ్చు కానీ ఇది వాస్తవ పరిస్థితిలో మార్పును తీసుకొస్తుందా అనేది చూడాల్సి ఉంది. విద్వేష రాజకీయాలకు భంగపాటు చిత్రవధ చేసి చంపడం కరడు గట్టిన హిందుత్వ వాదులను సంతోషపెట్టవచ్చునేమో కానీ, ప్రభుత్వాలపై ఓటరు తీవ్ర ఆగ్రహాన్ని అది ఏమాత్రం మార్చలేదు. రాజస్తాన్‌లో ఇది స్పష్టంగా కనబడింది. ఈ రాష్ట్రం లోని నియోజకవర్గాల్లోని పలు విభాగాల ప్రజలను వసుంధర రాజే పరాయీకరణ పాలు చేశారు. అందుకే ఓటర్లు ఆమెకు తగిన గుణపాఠం నేర్పారు. ఇక యోగి ఆదిత్యనాథ్ బ్రాండ్ విద్వేష ప్రచారం వ్యతిరేక ఫలితాలనే తీసుకువస్తోంది. హైదరాబాద్ పేరు మార్చేస్తానని, నిజాంని పారదోలినట్లే మజ్లిస్ పార్టీ నేతలను రాష్ట్రం నుంచి తరిమేస్తామని యోగి చేసిన వాగ్దానాలను తెలంగాణ ఓటర్లు అసలు పట్టించుకోలేదంటే సందేహపడాల్సిన పనిలేదు. పైగా నిజాం తెలంగాణ నుంచి పారిపోయాడని చెప్పడమే ఒక చారిత్రక అసత్యం. ఇలాంటి విద్వేష ప్రచారాలను తిప్పికొట్టడంలో భాగంగానే కావచ్చు. బీజేపీకి తెలంగాణ ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే దక్కి మహామహులు ఓడిపోయారు. ఈ నేపథ్యంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్‌ను ప్రచారానికి ఎక్కడికి పంపాలి అనే విషయంపై బీజేపీ మళ్లీ ఆలోచించుకోవాల్సి ఉంది. పరాజయం నేర్పుతున్న గుణపాఠాలు ఈ పరిణామాలను ప్రతిపక్షాలు తప్పక పరిగణనలోకి తీసుకుని 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ తమ వ్యూహాలను, ఎత్తుగడలను తప్పకుండా మార్చుకోవలసి ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావడానికి రెండు రోజుల ముందు ఢిల్లీలో ప్రతిపక్షాలు తమ ఐక్యతను ప్రదర్శించాయి. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్‌తో సహా దాదాపు ప్రతిపక్ష నేతలంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు కానీ అఖిలేష్ యాదవ్, మాయావతి గైర్హాజర్ కావడం ద్వారా తమ భవిష్యత్ పయనాన్ని సూచించారు. ఉదాహరణకు మాయావతి ఎక్కడికి వెళతారు? ఆమె మధ్యప్రదేశ్‌లో కీలక పాత్ర పోషించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో కలిసి వెళ్లకూడదని ఆమె తీసుకున్న నిర్ణయం పేలవంగా కనబడుతోంది. పైగా వారు ఐక్యంగా ఉంటే మరిన్ని సీట్లను గెలిచి ఉండేవారు. కానీ తన సొంత బలాన్ని పరీక్షించుకోవాలని భావించి ఉండవచ్చు లేదా ఏవైనా ఒత్తిళ్లకు గురయి ఉండవచ్చు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆమె సమాజ్‌వాదీ పార్టీతో చేతులు కలపవచ్చు, లేదా కాంగ్రెస్‌తోనూ చేతులు కలపవచ్చు. ఇప్పటికే సంకీర్ణంలో ఉన్న రాష్ట్రీయ లోక్ దళ్‌తో ఇలాంటి ఐక్యత సాధ్యపడితే ఉత్తర భారతదేశంలో అత్యంత కీలకమైన రాష్ట్రంలో బీజేపీ మరింత నిస్సహాయ స్థితిలో కూరుకుపోక తప్పదు. బుజ్జగింపులు, ప్రలోభాలు తప్పవా? ఇక మమతా బెనర్జీ కూడా ప్రతిపక్ష మహాకూటమితో పొత్తు కుదుర్చుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు వెలువరిస్తున్నారు. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఫ్రంట్‌లో ప్రముఖపాత్ర పోషిస్తున్న నేపథ్యంలో మమత తన స్థానాన్ని వదిలేసుకుంటారా? ఇక శరద్ పవార్ ఇప్పటికే మహారాష్ట్రలో కాంగ్రెస్‌తో లాంఛనప్రాయమైన ఒడంబడికను కూడా చేసుకుంది. జాతీయ కూట మికి ఇది మరింత దన్ను కలిగిస్తుంది. మహారాష్ట్రలో దూకుడుమీదున్న శివసేనతో బీజేపీ తీవ్రంగా తలపడనుంది. ఈ రాష్ట్రంలో వీలైనన్ని స్థానాలు గెల్చుకోవాలంటే శివసేనకు తలొగ్గి దాని డిమాండ్లను కాషాయదళం అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. భాగస్వాములతో సర్దుబాట్లు జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)లో భాగమైన చిన్న పార్టీలు నరేంద్రమోదీ–అమిత్‌షా తరహా పనివిధానంతో, వ్యవహార శైలితో ఉక్కిరిబిక్కిరవుతూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాయి. వీటిలో రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ లేక రామ్‌దాస్ అతవాలే నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ మరెక్కడికైనా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాయా? తమ ప్రయోజనాలు ఉత్తమంగా ఎక్కడ నెరవేరుతాయో అక్కడే పనిచేయాలని ఈ పార్టీలు స్పష్టంగా కోరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తన భాగస్వామ్య పార్టీలను చేజారకుండా చూసుకోవడానికి ఎన్నో సర్దుబాట్లు, మరెన్నో రాజీలు చేసుకోవలసి ఉంటుంది. 2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల సమరం ఉన్నట్లుండి మరింత ఆసక్తికరంగా మారింది. రాజకీయ బేరసారాలు కూడా దీనికి తగినట్లుగానే పరాకాష్టకు చేరుకోనున్నాయి. ఇతర రాజకీయ పార్టీలను బుజ్జగించడం, ప్రభావితం చేయడం, ప్రలోభపెట్టడం వంటి చర్యలకు బీజేపీ తలొగ్గుతుందా లేదా అని ఇప్పుడిప్పుడే ఊహించడం కష్టం. అయితే పొత్తు పార్టీలన్నింటినీ కూడదీసుకుని ఎన్నికల యుద్ధంలోకి దిగాలంటే అది తన ఆకర్షణా శక్తిని, ఎత్తుగడల రాజకీయాలను ప్రయోగంచడమే కాకుండా డబ్బు, భుజబలాన్ని కూడా పెద్ద ఎత్తున ఉపయోగించవలసి రావచ్చు. సంక్షేమ మంత్రంతోటే ఓట్ల సునామీ రైతు సంక్షేమానికి, విస్తృత ప్రజానీకం ప్రయోజనాలకు కాస్త పట్టం కడితే కోట్లాది జన హృదయాలు ఎలా స్పందిస్తాయో తెలంగాణ రాష్ట్ర పాలకులు యావద్దేశం ముందు ప్రదర్శించి చూపారు. కేసీఆర్ జపించిన సంక్షేమమంత్రానికి పులకరించిన తెలంగాణ పల్లెలు పోలింగ్ బూత్‌లకు వరుకకట్టాయంటే అతిశయోక్తి కాదు. దానికి తోడు ఆయన మరోసారి సంధించిన ఆత్మగౌరవ నినాదం తెలంగాణ పట్టణాల్లో కూడా పెను ప్రభంజనం సృష్టించింది. ప్రజా సంక్షేమం పట్ల ప్రత్యేకించి గ్రామీణ ప్రజల అభివృద్ధి పట్ల కేసీఆర్ తొలినుంచి ప్రదర్శిస్తూ వచ్చిన నిబద్ధత అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సునామీని సృష్టించింది. ప్రజాకూటమిలో భాగమైన పెద్ద చిన్న పార్టీలను సానుకూల ఓట్ల సునామీ తుడిచి పెట్టేసింది. జిల్లాలకు జిల్లాల్లో గులాబీ రథానికి ఎదురు లేకుండా పోయింది. పాజిటివ్ ఓటు ఎంత ప్రభావం వేస్తుందో చెప్పడానికి, చూపడానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పథకాలకు, దార్శనికతకు లభించిన ఘనవిజయం ఒక లిట్మస్ టెస్టుగా దేశం ముందు నిలుస్తోంది. రైతాంగాన్ని నిర్వీర్యం చేస్తున్న పథకాలు దేశంపై దండెత్తుతున్న మనకాలంలో ఇకనైనా రైతు సంక్షేమం తప్పనిసరిగా పట్టించుకోవలిసిన ఎజెండాగా రాజకీయ యవనికపై నిలుస్తుందేమో చూడాలి. వ్యాసకర్త : సిద్ధార్థ్ బాటియా, సీనియర్ పాత్రికేయుడు (ది వైర్ సౌజన్యంతో) -
సీఎం ఎవరు?
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ 15 ఏళ్ల తరువాత అధికారం దక్కించుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి సీఎం అభ్యర్థి ఎవరనే దానిపైనే ఉంది. ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భూపేశ్ బాగెల్ సీఎం అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మరో ముగ్గురు కూడా పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. పటన్ స్థానం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికైన భూపేష్ బాగెల్.. 1980లలో యువజన కాంగ్రెస్ సభ్యునిగా రాజకీయాల్లోకి వచ్చారు. దిగ్విజయ్ సింగ్ ప్రభుత్వం (ఉమ్మడి మధ్యప్రదేశ్)లో మంత్రిగా పనిచేశారు. ఎంపీ నుంచి ఛత్తీస్‌గఢ్ విడిపోయిన తర్వాత ఏర్పడిన అజిత్ జోగి ప్రభుత్వంలో మంత్రిగా విధులు నిర్వర్తించారు. 2013లో మహేంద్రకర్మ అనే మాజీ మంత్రిని హత్య చేసేందుకు మావోయిస్టులు జరిపిన దాడిలో (ఇందులో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది) ప్రాణాలతో బయటపడిన భూపేశ్.. ఆ తరువాత పార్టీ నిర్మాణంలో తనదైన పాత్ర పోషించడం ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా పనిచేసిన టీఎస్ సింగ్‌దేవ్ కూడా సీఎం రేసులో ఉన్నారు. ఈయన కాంగ్రెస్ పార్టీ ధనిక అభ్యర్థుల్లో ఒకరు. సీతాస్వయంవరం తరహాలో సీఎం ఎంపిక జరగాలనేది ఈయన అభిప్రాయం. ఆ స్వయంవరంలో పాల్గొని పదవిని వరించాలని తహతహలాడుతున్నారు. లౌక్యమున్న నేతగా పేరున్న సింగ్‌దేవ్ అంబికాపూర్ నుంచి గెలుపొందారు. ఓబీసీ నేత తమ్రద్వాజ్ సాహూ కూడా బాగెల్, సింగ్‌దేవ్‌లకు పోటీనిస్తున్నారు. కుల సమీకరణల నేపథ్యంలో.. సాహూకు అవకాశం వస్తే రావచ్చు. ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రయోజనం పొందవచ్చేనేది కాంగ్రెస్ ఆలోచన. సీఎం రేసులో ఉన్న నాలుగో వ్యక్తి శక్తి నియోజకవర్గం నుంచి గెలుపొందిన చరణ్ దాస్ మహంత్. ఈయన దిగ్విజయ్ సింగ్ మంత్రివర్గంలో మంత్రిగా, కేంద్రంలో మన్మోహన్ సింగ్ కేబినెట్లో సహాయ మంత్రిగా పని చేశారు. -
ఛత్తీస్కోట కాంగ్రెస్ వశం
రాయ్‌పూర్: 15 ఏళ్ల తర్వాత ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ వశమైంది. మంగళవారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ 67 సీట్లు గెలుచుకొని సంపూర్ణ మెజారిటీ సాధించింది. బీజేపీ 15 స్థానాలకు పరిమితమైంది. గత అసెంబ్లీలో బీజేపీకి 49 సీట్లు, కాంగ్రెస్‌కు 39 స్థానాలున్నాయి. ఈ ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని అంచనాలు రేపిన అజిత్ జోగి–మాయావతిల కూటమి 8 సీట్లకే పరిమితమై నామమాత్రంగా మిగిలిపోయింది. ఇప్పటికే 3సార్లు బీజేపీకి అధికారం అప్పగించిన ఛత్తీస్‌గఢ్ ప్రజలు ఈసారి మార్పు కోరుకుని హస్తానికి పట్టంగట్టారు. మొత్తం 90 సభ్యులున్న అసెంబ్లీలో అధికారం దక్కాలంటే కావల్సిన సభ్యుల సంఖ్య 46. కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ తప్పదన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని తలకిందులు చేస్తూ కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి హస్తం దూకుడు కొనసాగించింది. దీంతో పోటీ ఏకపక్షంగా మారింది. ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ యూనిట్ చీఫ్ భూపేశ్ బాగెల్, మరో సీనియర్ నాయకుడు టీఎస్ సింగ్‌దేవ్‌లు సీఎం రేసులో ముందంజలో ఉన్నారు. సంప్రదాయ ఓటుబ్యాంకు అయిన ఎస్సీ, ఎస్టీల ఓట్లను కాపాడుకున్న కాంగ్రెస్..ఈసారి ఓబీసీలకు కూడా చేరువకావడంతో ఊహించనంత మెజారిటీ సాధించుకోగలిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలతో మసకబారిన రమణ్‌సింగ్ ప్రభుత్వంపై విసుగుచెందిన ప్రజలు కాంగ్రెస్‌కు ఓ అవకాశం ఇచ్చారని భావిస్తున్నారు. 2000లో మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఛత్తీస్‌గఢ్‌కు కాంగ్రెస్‌కు చెందిన అజిత్ జోగి మూడేళ్ల పాటు సీఎంగా పనిచేశారు. 2003లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన రమణ్‌సింగ్ 2008, 2013లోనూ అధికారాన్ని నిలబెట్టుకున్నారు. తాజా ఫలితాల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రమణ్‌సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అవినీతిమయమైన బీజేపీకి ఛత్తీస్‌గఢ్ ప్రజలు గట్టి జవాబు చెప్పారని ఫలితాలు వెలువడిన తరువాత బాగెల్ అన్నారు. బీజేపీ ఓటమిపై అజిత్ జోగి సంతోషం వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వానికి సహకరిస్తూ అసెంబ్లీలో మూడో శక్తిగా కొనసాగుతామని చెప్పారు. హిందూ మధ్య ప్రాంతంలోని 28 సీట్లలో బీజేపీకి 7, కాంగ్రెస్‌కు 21 సీట్లు దక్కాయి. 2013 ఎన్నికల్లో బీజేపీకి ఇదే ప్రాంతంలో 18, కాంగ్రెస్‌కు 9, ఇండిపెండెంట్‌కు ఒక సీటు లభించాయి. వాయవ్య ఎస్సీల ప్రాంతంలోని 17 సీట్లలో బీజేపీకి 4, కాంగ్రెస్‌కు 8, జీజీపీకి ఒకటి, బీఎస్పీ–జేసీసీజే కూటమికి 4 సీట్లు దక్కాయి. 2013 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి 9, కాంగ్రెస్‌కు 8 సీట్లు లభించాయి. దక్షిణ ఆదివాసీ ప్రాంతంలోని 16 సీట్లలో బీజేపీ 1 , కాంగ్రెస్ 15 సీట్లు గెలుచుకున్నాయి. గత ఎన్నికల్లో ఈ ప్రాంతంలో బీజేపీ 5, కాంగ్రెస్ 9 సీట్లు దక్కించుకున్నాయి. ఛత్తీస్ అసెంబ్లీకి 13 మంది మహిళలు ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి 13 మంది మహిళలు ఎన్నికయ్యారు. ఇందులో 9 మంది కాంగ్రెస్, ఒకరు బీజేపీకి చెందిన వారున్నారు. 2008లో మహిళా సభ్యుల సంఖ్య 10 కాగా, 2008లో ఈ సంఖ్య 11కు పెరిగింది. 2013లో కాంగ్రెస్ టికెట్‌పై గెలుపొందిన అజిత్ జోగి భార్య రేణు జోగి ఈసారి జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ తరఫున పోటీచేసి విజయం సాధించారు. హిందీ బెల్ట్‌లో కాంగ్రెస్ ఒంటరిగా పోరాడింది. ఈ ప్రాంతంలో కోల్పోయిన తన బలాన్ని తిరిగి పొందే ఉద్దేశంతోనే పకడ్బందీ వ్యూహాలు అనుసరించింది. ఆ విషయంలో విజయం సాధించింది. – స్మితా గుప్తా, రాజకీయ విశ్లేషకురాలు ఎన్డీయే రాజకీయ ఫ్రంట్. అలాగే యూపీఏ కూడా మరో ఫ్రంట్. ఎన్డీయేలో ఉన్న సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎదుర్కోవాలంటే యూపీఏ కూడా భాగస్వామ్య పార్టీలను సమైక్య పరిచి పోటీకి దిగాలి. – వినోద్ శర్మ, హిందూస్తాన్ టైమ్స్ పొలిటికల్ ఎడిటర్ బీజేపీ జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రాల్లోని సామాన్యులపై ప్రభావం చూపించింది. నోట్ల రద్దు వంటి నిర్ణయాలు రాష్ట్రాలపై దుష్ప్రభావం చూపాయి. అవి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలనూ ప్రభావితం చేశాయి. –కపిల్ సిబాల్, కాంగ్రెస్ సీనియర్ నేత బీజేపీ ఈ ఎన్నికల్లో గొప్ప ఫలితాలు సాధించలేదు. ఈ విషయం పార్టీలో చర్చించి తప్పుల్ని సవరించుకోవాలి. మోదీ జనాదరణ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు. అది పెరుగుతూనే ఉంది. మరి మేము అనుకున్న ఫలితాలు రాకపోవడానికి కారణాలు ఏమిటో విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది – కె.జె. అల్ఫాన్స్, కేంద్ర టూరిజం మంత్రి రాహుల్ గాంధీని ఒక జోకర్లా తీసిపారేయడం ఇక మానుకోవాలి. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ తన శక్తివంచన లేకుండా కృషి చేశారు. చిత్తశుద్ధితో పనిచేశారు. ఒక సరికొత్త రాజకీయ నేతగా అవతరించిన రాహుల్‌తో బీజేపీ నేతలు తలపడగలగాలి – శేఖర్ గుప్తా, సీనియర్ జర్నలిస్టు దేశమంతా బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇందుకు మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. మోదీ ప్రభుత్వ విధానాల మీద ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ ప్రభావం వచ్చే లోక్‌సభ ఎన్నికల మీద కచ్చితంగా ఉంటుంది. – అఖిలేష్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు రాజస్తాన్‌లో సీఎం పీఠంపై కూర్చునే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రధాన కర్తవ్యం బీజేపీ ఓటు శాతాన్ని ఎంతమేరకు తగ్గించగలుగుతారనేదే. బీజేపీ 38శాతం ఓట్లను నిలబెట్టుకోగలిగింది. కాంగ్రెస్ కొంత మేర ఓటు శాతాన్ని పెంచుకోగలిగినా వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి బీజేపీ ఓట్లను తగిన మొత్తంలో రాబట్టుకోవాలి. అప్పుడే కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది –రాజీవ్ గుప్తా, రాజకీయ విశ్లేషకులు -
విజయం వైపు నడిపిన ‘పైలెట్’
జైపూర్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత రాజేష్ పైలెట్ కుమారుడే సచిన్ పైలెట్(41). ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి డిగ్రీ, వార్టన్ బిజినెస్ స్కూల్(యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా) నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. బీబీసీ ఢిల్లీ బ్యూరోతోపాటు, జనరల్ మోటార్స్‌లోనూ పనిచేసిన అనుభవం ఉంది. 2000వ సంవత్సరంలో ఆయన తండ్రి రాజేష్ పైలెట్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. 2004లో దౌసా నియోజకవర్గం నుంచి ఎన్నికై అతి పిన్న వయస్కుడైన ఎంపీగా చరిత్ర సృష్టించారు. 2009లో అజ్మీర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఐటీ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. పలు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల సభ్యుడిగా కూడా ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా కూతురు సారాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సచిన్ 1995లో అమెరికాలో ప్రైవేట్ పైలెట్ లైసెన్స్ పొందారు. జాతీయ స్థాయి షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పలుమార్లు పాల్గొన్నారు. టెరిటోరియల్ ఆర్మీలో కమిషన్డ్ ఆఫీసర్‌గానూ పనిచేశారు. డ్రైవింగ్ అంటే ఆయనకు చాలా ఇష్టం. ప్రముఖులు.. గెలుపోటములు రాజస్తాన్ ఎన్నికల్లో గెలుపొందిన ప్రముఖుల్లో ముఖ్యమంత్రి వసుంధరా రాజే(ఝల్రాపటన్), పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ ఉన్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే బీజేపీ నుంచి వచ్చిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్‌సింగ్ కుమారుడు మాన్వేంద్ర సింగ్‌ను ఝల్రాపటన్ నియోజకవర్గంలో వసుంధరాపై కాంగ్రెస్ బరిలోకి దించింది. వసుంధరా చేతిలో ఆయన 34,980 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అసెంబ్లీ స్పీకర్ కైలాష్ మేఘ్వాల్ భిల్వారా స్థానం నుంచి 74వేలకు పైచిలుకు మెజారిటీతో గెలిచారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ముఖ్య నేతల్లో జోహ్రీలాల్ మీనా(రాజ్‌గఢ్–లక్ష్మణ్‌గఢ్), మదన్ ప్రజాపత్(పచ్‌పద్ర), జహీదా ఖాన్(కమన్), రామ్‌లాల్ జాట్(మండల్), ప్రశాంత్ బైర్వా(నివాయి) ఉన్నారు. అలాగే, బీజేపీ నేతల్లో సంతోష్(అనూప్‌గఢ్), కాలూరామ్(దాగ్), సామారామ్ గరైసా(పిండ్వారా–అబు), జగ్సిరామ్(రియోదార్) విజయం సాధించారు. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్ధుల్లో సందీప్ కుమార్(తిజారా), వజీబ్ అలీ(నాగర్) గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేకపోయిన సీపీఎం ఈసారి బల్వాన్ పునియా (భద్ర), గిరిధారీలాల్ మహియా (శ్రీ దుంగార్‌గఢ్)లను గెలిపించుకుంది. నీటి వనరుల మంత్రి రామ్ ప్రతాప్, రెవెన్యూ మంత్రి అమ్రారామ్, గోపాలన్ మంత్రి ఓతారాం దేవసి(సిరోహి), పర్యాటక శాఖ మంత్రి యూనస్‌ఖాన్ ఓటమి పాలయ్యారు. -
ఎడారి రాష్ట్రం ‘హస్త’ గతం
జైపూర్: ఊహించినట్లే రాజస్తాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ప్రభావం చూపాయి. వసుంధరా రాజే నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఓటమి పాలయింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థులుగా రేసులో ఉన్న మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ సైతం తమతమ స్థానాల్లో గెలుపొందారు. ఇక సీఎం ఎవరో తేల్చాల్సిన బాధ్యత అధిష్టానంపై పడింది. ఫలితాలు స్పష్టం కావడంతో నేడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా జైపూర్‌లో సమావేశమై తమ నేతను ఎన్నుకోనున్నారు. నేడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం రాజస్తాన్ అసెంబ్లీలోని 200 సీట్లకు గాను 199 స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. అల్వార్ జిల్లాలోని రామ్‌గఢ్ నియోజకవర్గం బీఎస్పీ అభ్యర్ధి మృతి చెందడంతో ఆ స్థానానికి ఎన్నిక నిలిపివేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సీట్లు 100 కాగా ఇప్పటి వరకు కాంగ్రెస్ 100, బీజేపీ 70 వరకు సీట్లు గెలుచుకున్నాయి. దీంతోపాటు బీఎస్పీ మూడు చోట్ల గెలిచి, మరో మూడు చోట్ల ముందంజలో ఉంది. భారతీయ ట్రైబల్ పార్టీ రెండు సీట్లు గెలుచుకుంది. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ మూడు చోట్ల మెజారిటీ దిశగా ఉంది. సీపీఎం ఒక స్థానం గెలుచుకుని, మరో చోట ముందంజలో ఉంది. దాదాపు 12 చోట్ల స్వతంత్రులు గెలిచే అవకాశా లున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతున్న మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ మంగళవారం ఉమ్మడి మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తమ మధ్య సయోధ్య ఉందని చూపుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సచిన్ పైలెట్ మాట్లాడుతూ..స్వతంత్రులు, ఇతర పార్టీల అభ్యర్ధులతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ నుంచి రెబెల్స్‌గా బరిలోకి దిగి గెలుపొందిన చాలామంది మా పార్టీకే మద్దతు తెలిపే అవకాశాలున్నాయి. నేడు జైపూర్‌లో జరిగే కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీకి పరిశీలకునిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు’ అని తెలిపారు. ఈ సమావేశం అనంతరం పార్టీ పరిశీలకులు ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్న పైలెట్, అశోక్ గెహ్లాట్లతోపాటు ఎమ్మెల్యేలందరితో వేర్వేరుగా సమావేశమై అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఆయన తిరిగి ఢిల్లీ వెళ్లి అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తన నివేదికను అందజేస్తారు. బుధవారం సాయంత్రం జైపూర్‌లో మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమవుతారు. ఆ సమావేశంలోనే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై స్పష్టత వస్తుంది, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత ఎన్నికతోపాటు పలు విషయాలను ఈ సమావేశంలో చర్చిస్తారని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ అవినాష్ పాండే మీడియాకు తెలిపారు. గెహ్లాట్, పైలెట్ కాకుండా మరెవరైనా సీఎం రేసులో ఉన్నారా అని ప్రశ్నించగా ఆ విషయాన్ని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలే నిర్ణయిస్తారని ఆయన అన్నారు. ఎమ్యెల్యేలు, సీనియర్ నేతల అభిప్రాయం తీసుకుని ఆ నివేదికను హైకమాండ్‌కు అందజేస్తాను. అంతిమ నిర్ణయం హైకమాండ్ చేతుల్లోనే ఉంది’ అని కేసీ వేణుగోపాల్ వివరించారు. దేశమంతటా ఇదే ట్రెండ్: సచిన్ పైలెట్ రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సాధించిన ఫలితాలనే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ దేశమంతటా సాధిస్తుందని సచిన్ పైలెట్ ధీమా వ్యక్తం చేశారు. ‘ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. రాష్ట్రంలో మాకు పూర్తి మెజారిటీ వస్తుంది. సరిగ్గా ఏడాది క్రితం రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఇది చరిత్రాత్మక దినం’ అని పేర్కొన్నారు. స్వతంత్ర అభ్యర్ధులు సహా భావసారూప్యం కలిగిన అన్ని పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం. ముఖ్యమంత్రి ఎవరో ఎమ్మెల్యేలే నిర్ణయిస్తారు’ అని ఆయన తెలిపారు. ‘ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. ఈ తీర్పు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంది. మాకు స్పష్టమైన మెజారిటీ ఉంది. ఇతర పార్టీలు, బీజేపీని వదిలి వచ్చే అభ్యర్ధులను కూడా కలుపుకుని పోతాం. మా పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది’ అని గెహ్లాట్ తెలిపారు. -
ఫలితాల సరళిపై మమతా బెనర్జీ ఏమన్నారు?
సాక్షి, కోలకతా: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సరళిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ స్పందించారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న తాజా ఫలితాలు బీజేపీకి పెద్ద షాక్ అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నతరుణంలో ఆమె వరుస ట్వీట్లతో బీజేపీపై చురకలంటించారు. ఇది ప్రజల తీర్పు .. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా దేశ ప్రజల విజయమని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా విజేతలకు అభినందనలు తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారు. ఇది ప్రజాస్వామ్య విజయం. అన్యాయానికి, అమానుషానికి, ఏజన్సీల దుర్వినియోగం, పేద ప్రజలు, రైతులు, యువత, దళితులు, ఎస్సీ, ఎస్టీ, ఒబిసి, మైనారిటీలపై దాడులు, విచ్ఛిన్నానికి వ్యతిరేకంగా దేశ ప్రజలు సాధించిన విజయమని మమత పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి చోటు లేదని సెమీఫైనల్ రుజువు చేసిందన్నారు. 2019 ఫైనల్ మ్యాచ్‌కు ఇది నిజమైన ప్రజాస్వామిక సూచన. చివరకు, 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' డెమాక్రసీ అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. Semifinal proves that BJP is nowhere in all the states. This is a real democratic indication of 2019 final match. Ultimately, people are always the ‘man of the match’ of democracy. My congrats to the winners 3/3 — Mamata Banerjee (@MamataOfficial) December 11, 2018 -
నేడే ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: మూడు నెలలుగా తెలంగాణతోపాటు రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంల్లో నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో విడుదల కానున్నాయి. వచ్చే ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఈ ఎన్నికల ఫలితాలపై ప్రధాన రాజకీయ పార్టీలతోపాటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. తెలంగాణలోని 31 జిల్లాల్లోని 43 లెక్కింపు కేంద్రాల్లో 119 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 42 రౌండ్లలో లెక్కింపు జరగనుండగా, అత్యల్పంగా భద్రాచలం, అశ్వరావుపేట నియోజకవర్గాల్లో 12 రౌండ్లలో జరగనుంది. ఒక్కో టేబుల్ వద్ద పర్యవేక్షకులు, వారి సహాయకులను ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా నియమించనున్నారు. 3,356 మంది కౌంటింగ్ సిబ్బందితో పాటు 1,916 సూక్ష్మ పరిశీలకులు లెక్కింపు ప్రక్రియలో పాల్గొననున్నారు. తొలి రౌండ్లో పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత తదుపరి రౌండ్లలో ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల కల్లా 3,4 రౌండ్లలో 60 వేల నుంచి 70 వేల ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ సోమవారం రాత్రి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు ప్రక్రియ వివరాలను వెల్లడించారు. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనకు సర్వం సిద్ధం చేశామన్నారు. భద్రత కట్టుదిట్టం పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సంఘం అనుమతి ఉన్న వ్యక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. కౌంటింగ్ ఏజెంట్ల క్యాలిక్యులేటర్లు, సెల్ఫోన్లను ఎట్టిపరిస్థితుల్లోనూ కేంద్రాల్లోపలకు అనుమతించబోమన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏజెంట్లను బయటకు పంపే ప్రసక్తే లేదన్నారు. రిటర్నింగ్ అధికారి టేబుల్ మీదే పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారన్నారు. కౌంటింగ్ కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో 20 వేల మంది పోలీసు సిబ్బందితో భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతోపాటు 20 వేల మంది ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఈవీఎంలలో వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు 238 మంది ఇంజనీర్లు సిద్ధంగా ఉంటారని రజత్‌కుమార్ పేర్కొన్నారు. గడువులోగా దరఖాస్తు చేసుకున్న ఎన్నికల సిబ్బంది అందరికీ పోస్టల్ బ్యాలెట్లను పోస్టు ద్వారా పంపించామన్నారు. పోస్టల్ బ్యాలెట్లు అందలేదని ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బంది నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించామని, చాలా వరకు గడువు తర్వాత దరఖాస్తు చేసుకోవడంతో వారికి పోస్టల్ బ్యాలెట్లు రాలేదన్నారు. ఫారం 12 సమర్పించిన 44,258 మంది ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్లు జారీ అయ్యాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చింతమడక, ఎర్రవల్లి రెండు గ్రామాల్లో ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదుపై రజత్‌కుమార్ స్పందించారు. రెండు చోట్ల ఓటు కలిగి ఉండడం నేరం కాదని, రెండు ఓట్లు వేయడం నేరమన్నారు. నాలుగు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠే మధ్యప్రదేశ్‌లో (230 స్థానాలు), రాజస్తాన్ (199), ఛత్తీస్‌గఢ్ (90), తెలంగాణ (119), మిజోరం (40)ల్లో నవంబర్, డిసెంబర్ నెలల్లో జరిగిన ఎన్నికలకు కూడా మంగళవారం కౌంటింగ్ జరగనుంది. ఈ రాష్ట్రాల్లో మధ్యాహ్నానికల్లా ఫలితాలపై స్పష్టత రానుంది. ప్రధాన రాజకీయ పార్టీలకు ఈఎన్నికల ఫలితాలు 2019 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా మారాయి. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీకి ఈ ఎన్నికలు కీలకం. మిజోరం మినహా మిగిలిన చోట్ల అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తుండగా.. ఈ రాష్ట్రాల్లో పట్టుసంపాదించాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నించింది. 38 కేంద్రాల్లో అయోమయం ఈవీఎంల పనితీరును పరీక్షించేందుకు పోలింగ్ ప్రారంభానికి ముందు నిర్వహించే మాక్ పోలింగ్‌లో గందరగోళం తలెత్తిందని రజత్ కుమార్ పేర్కొన్నారు. మాక్ పోలింగ్‌లో నమోదైన ఓట్లతో పాటు వాస్తవ ఓటింగ్ ప్రక్రియలో ఓటర్లు వేసిన ఓట్లు కలిసిపోయాయని అన్నారు. ప్రిసైడింగ్ అధికారులు మరిచిపోవడంతో ఈ సమస్య తలెత్తిందన్నారు. ఈ పోలింగ్ కేంద్రాల ఓట్ల లెక్కింపు విషయంలో ఏం చేయాలన్న అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సలహా కోరామని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్లోని ఉమామహేశ్వర్ కాలనీలో ఓటర్లపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీచార్జీ చేయడంతో చందూనాయక్ అనే ఓటరు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై విలేకరుల ప్రశ్నలకు రజత్‌కుమార్ స్పందిస్తూ.. ఈ ఘటనపై పోలీసు శాఖ నుంచి నివేదిక కోరుతామన్నారు. 2కోట్ల మంది ప్రజలు ప్రశాంతంగా ఓటేశారని.. ఈ ఒక్క ప్రాంతంలో ఏం జరిగిందనేది ఇంత వరకు తన దృష్టికి రాలేదన్నారు. వివిధ జాతీయ చానళ్లు, సంస్థల ఎగ్జిట్ పోల్స్ వివరాలివీ -
మోదీ-షా హవా; కొత్త ట్విస్ట్
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ-షా ద్వయం ముద్ర కనిపించడం లేదు. 2014లో ప్రధాని పీఠాన్ని నరేంద్ర మోదీ అధిష్టించినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో వీరి ముద్ర స్పష్టంగా కనిపించింది. బీజేపీలో అన్ని తామే వ్యవహరించి విజయాలను తమ ఖాతాలో వేసుకున్నారు. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో సీనియర్ నాయకులు ఎంతమంది ఉన్నప్పటికీ మోదీ-షా జోడీ ముందుండి నడిపించింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగుతున్న రమణ సింగ్, శివరాజ్ సింగ్, వసుంధర రాజే సొంత గొంతుక విన్పిస్తున్నారు. బీజేపీలో అగ్రస్థాయి వ్యూహకర్తల బృందంలో అమిత్ షా, మోదీకి సమానంగా పరిగణించబడుతున్న వీరు మోదీ-షా ద్వయంపై ఆధారపడకుండానే ముందుకు పోతున్నారు. మోదీ ప్రధాని పీఠమెక్కిన నాటి నుంచి ఇప్పటివరకు 22 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగ్గా 19 రాష్ట్రాల్లో కమలం పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. 2014లో జరిగిన జార్కండ్, హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పాలక పగ్గాలు దక్కించుకుంది. హరియణాలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడంలో కాషాయ పార్టీ సఫలమైంది. ఇదే ఏడాది చివరి జరిగిన ఎన్నికల్లో జమ్మూకశ్మీర్లోనూ పాగా వేసింది. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ)తో కలిసి అధికారాన్ని పంచుకుంది. బీజేపీకి 2015 కలిసిరాలేదు. అదే ఏడాది ఢిల్లీ, బిహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోరులో కమలం పార్టీకి చుక్కెదురైంది. అసోంలో గెలుపుతో 2016లో ఈశాన్య రాష్ట్రాల్లోకి అడుగుపెట్టిన కమలనాథులు, అదే సంవత్సరం జరిగిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ ఎన్నికల్లో భంగపడ్డారు. 2017లో ఉత్తరప్రదేశ్‌లో భారీ విజయంతో పాటు ఉత్తరాఖండ్, హిమచల్‌ప్రదేశ్‌నూ తన ఖాతాలో వేసుకుంది. మేఘాలయా, నాగాలాండ్, మణిపూర్, త్రిపురలోనూ విజయఢంకా మోగించి ఈశాన్యంలో తిరుగులేని శక్తిగా మారింది. గట్టి పోటీ ఎదురైనప్పటికీ గుజరాత్లో అధికారాన్ని నిలబెట్టుకుంది. మోదీ-షా సొంత రాష్ట్రం కావడంతో ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బొటాబొటి మెజారిటీతో గట్టెక్కింది. అయితే ఈ ఏడాదిలో కర్ణాటక ఎన్నికల్లో కాషాయ పార్టీకి అనూహ్యంగా షాక్ తగిలింది. కాంగ్రెస్, జేడీ(ఎస్) కలిసి బీజేపీకి ఝలక్ ఇచ్చాయి. తాజాగా జరుగుతున్న ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో మోదీ-షా ముద్ర అంతగా కనిపించడం లేదు. ఈ మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్న రమణ్ సింగ్, శివరాజ్ సింగ్, వసుంధర రాజె బలమైన నాయకులు. తమకు తామే సొంతంగా వ్యూహాలను అమలు చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీంతో మోదీ-షా జోడికి పెద్దగా పని లేకుండా పోయింది. ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటికే ఎన్నికలు ముగిశాయి. ఒకవేళ బీజేపీ ఇక్కడ మళ్లీ గెలిస్తే ఆ ఘనత అంతా రమణ్ సింగ్‌కే దక్కుతుంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఫలితం వచ్చే అవకాశముందని సర్వేలు చెబుతున్నాయి. అయినప్పటికీ రాజే వెనక్కు తగ్గడం లేదు. మోదీ-షా ముద్ర లేకుండానే తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఆమెను తప్పించే సాహసం చేయలేకపోతోంది బీజేపీ అధిష్టానం. ఈశాన్య రాష్ట్రం మిజొరంలోనూ మోదీ-షా ముచ్చట లేదు. ఇక్కడ హంగ్ వచ్చే అవకాశముందని సర్వేలు అంచనా వేశాయి. తెలంగాణలో బలమైన నాయకులు లేకపోవడంతో మోదీ-షా మ్యాజిక్ పైనే స్థానిక నేతలు ఆశలు పెట్టుకున్నారు. దీనికనుగుణంగానే మోదీ-షా ప్రచార పర్వాన్ని భారీస్థాయిలో నిర్వహించనున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోదీ-షా హవా నడిచింది. అభ్యర్థుల ఖరారు, ప్రచారం, ముఖ్యమంత్రి అభ్యర్థుల ఎంపిక విషయాల్లో వీరే ఆధిపత్యం చెలాయించారు. బలమైన ప్రాంతీయ నేతలు లేకపోవడంతో అన్ని విజయాలన్నీ వీరి ఖాతాలోకి వెళ్లిపోయాయి. ముఖ్యమంత్రి అభ్యర్థుల విషయంలోనూ అనూహ్య నిర్ణయాలు తీసుకుని తమ ప్రత్యేకత చాటుకున్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండటం ఈ ఎన్నికల్లోని విశేషం. ఇక్కడ బీజేపీకి సానుకూల ఫలితాలు వస్తే మోదీ-షా ‘ముద్ర’ మాయం కావడం ఖాయమన్నది విశ్లేషకుల అభిప్రాయం. -
‘నోటా’కు స్పందన అంతంతే!
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం ఈవీఎం పరికరాల్లో తొలిసారి ప్రవేశపెట్టిన ‘నోటా’కు అంతంత స్పందనే వచ్చింది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ‘నోటా’(పై వారు ఎవరూ కాదు) మీటను ఎంచుకున్న వారిలో ఛత్తీస్‌గఢ్ ఓటర్లు అగ్రస్థానంలో నిలిచిచారు. రాష్ట్రంలో 4.6 శాతం మంది దీన్ని నొక్కారు. రెండో స్థానంలో రాజస్థాన్(1.5 శాతం), మధ్యప్రదేశ్(1.4 శాతం) ఓటర్లు నిలిచారు. 1.19 కోట్ల మంది ఓటర్లున్న ఢిల్లీలో అత్యల్పంగా కేవలం 0.63(49 వేల ఓట్లు) శాతం మంది ఓటర్లే దీన్ని ఎంచుకున్నారు. తూర్పు ఢిల్లీలోని గోకుల్పూర్ స్థానంలో గరిష్టంగా 1,338 మంది ఓటర్లు మాత్రమే దీనికి ఓటేశారు. 8 నియోజకవర్గాల్లో ఈ మీటకు 4,700 పైగా ఓట్లు పడ్డాయి. సీఎం షీలా దీక్షిత్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ పోటీపడిన న్యూఢిల్లీ స్థానంలో 460 మంది ‘నోటా’ను ఉపయోగించుకున్నారు. బీజేపీ సీఎం అభ్యర్థి హర్షవర్ధన్ బరిలో ఉన్న కృష్ణనగర్‌లో దీనికి 577 ఓట్లు పడ్డాయి. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు ఎవరూ నచ్చకుంటే వారిని తిరస్కరించే హక్కు ఓటరుకు ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు సెప్టెంబర్‌లో సంచలన తీర్పు ఇవ్వడం తెలిసిందే. దీంతో ఈసీ తొలిసారిగా ప్రస్తుతం జరిగిన ఐదు రాష్ట్రాల్లో ఈవీఎంలలో ‘నోటా’ మీటను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంగతీ విదితమే. కాగా, నోటా కోరల్లేని మీట అని, అందుకే దానికి స్పందన లభించలేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. నోటాకు మెజారిటీ ఓట్లు వస్తే రీపోలింగ్ జరిపే అవకాశాన్ని ఇచ్చి ఉంటే దానికి విలువ ఉండేదని ఢిల్లీ వర్సిటీ రాజనీతిశాస్త్ర అధ్యాపకుడు ప్రదీప్‌కుమార్ దత్తా అన్నారు. ఢిల్లీ ఓటర్లు నోటా బదులు ఆప్‌ను ఎంచుకున్నారన్నారు.