ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాయ్‌పూర్‌లో విజయ సంకేతాన్ని చూపుతున్న రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి పీఎల్ పూనియా తదితరులు
రాయ్‌పూర్: 15 ఏళ్ల తర్వాత ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ వశమైంది. మంగళవారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ 67 సీట్లు గెలుచుకొని సంపూర్ణ మెజారిటీ సాధించింది. బీజేపీ 15 స్థానాలకు పరిమితమైంది. గత అసెంబ్లీలో బీజేపీకి 49 సీట్లు, కాంగ్రెస్‌కు 39 స్థానాలున్నాయి. ఈ ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని అంచనాలు రేపిన అజిత్ జోగి–మాయావతిల కూటమి 8 సీట్లకే పరిమితమై నామమాత్రంగా మిగిలిపోయింది. ఇప్పటికే 3సార్లు బీజేపీకి అధికారం అప్పగించిన ఛత్తీస్‌గఢ్ ప్రజలు ఈసారి మార్పు కోరుకుని హస్తానికి పట్టంగట్టారు.
మొత్తం 90 సభ్యులున్న అసెంబ్లీలో అధికారం దక్కాలంటే కావల్సిన సభ్యుల సంఖ్య 46. కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ తప్పదన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని తలకిందులు చేస్తూ కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి హస్తం దూకుడు కొనసాగించింది. దీంతో పోటీ ఏకపక్షంగా మారింది. ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ యూనిట్ చీఫ్ భూపేశ్ బాగెల్, మరో సీనియర్ నాయకుడు టీఎస్ సింగ్‌దేవ్‌లు సీఎం రేసులో ముందంజలో ఉన్నారు. సంప్రదాయ ఓటుబ్యాంకు అయిన ఎస్సీ, ఎస్టీల ఓట్లను కాపాడుకున్న కాంగ్రెస్..ఈసారి ఓబీసీలకు కూడా చేరువకావడంతో ఊహించనంత మెజారిటీ సాధించుకోగలిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలతో మసకబారిన రమణ్‌సింగ్ ప్రభుత్వంపై విసుగుచెందిన ప్రజలు కాంగ్రెస్‌కు ఓ అవకాశం ఇచ్చారని భావిస్తున్నారు. 2000లో మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఛత్తీస్‌గఢ్‌కు కాంగ్రెస్‌కు చెందిన అజిత్ జోగి మూడేళ్ల పాటు సీఎంగా పనిచేశారు. 2003లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన రమణ్‌సింగ్ 2008, 2013లోనూ అధికారాన్ని నిలబెట్టుకున్నారు. తాజా ఫలితాల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రమణ్‌సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అవినీతిమయమైన బీజేపీకి ఛత్తీస్‌గఢ్ ప్రజలు గట్టి జవాబు చెప్పారని ఫలితాలు వెలువడిన తరువాత బాగెల్ అన్నారు. బీజేపీ ఓటమిపై అజిత్ జోగి సంతోషం వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వానికి సహకరిస్తూ అసెంబ్లీలో మూడో శక్తిగా కొనసాగుతామని చెప్పారు.
హిందూ మధ్య ప్రాంతంలోని 28 సీట్లలో బీజేపీకి 7, కాంగ్రెస్‌కు 21 సీట్లు దక్కాయి. 2013 ఎన్నికల్లో బీజేపీకి ఇదే ప్రాంతంలో 18, కాంగ్రెస్‌కు 9, ఇండిపెండెంట్‌కు ఒక సీటు లభించాయి. వాయవ్య ఎస్సీల ప్రాంతంలోని 17 సీట్లలో బీజేపీకి 4, కాంగ్రెస్‌కు 8, జీజీపీకి ఒకటి, బీఎస్పీ–జేసీసీజే కూటమికి 4 సీట్లు దక్కాయి. 2013 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి 9, కాంగ్రెస్‌కు 8 సీట్లు లభించాయి. దక్షిణ ఆదివాసీ ప్రాంతంలోని 16 సీట్లలో బీజేపీ 1 , కాంగ్రెస్ 15 సీట్లు గెలుచుకున్నాయి. గత ఎన్నికల్లో ఈ ప్రాంతంలో బీజేపీ 5, కాంగ్రెస్ 9 సీట్లు దక్కించుకున్నాయి.
ఛత్తీస్ అసెంబ్లీకి 13 మంది మహిళలు
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి 13 మంది మహిళలు ఎన్నికయ్యారు. ఇందులో 9 మంది కాంగ్రెస్, ఒకరు బీజేపీకి చెందిన వారున్నారు. 2008లో మహిళా సభ్యుల సంఖ్య 10 కాగా, 2008లో ఈ సంఖ్య 11కు పెరిగింది. 2013లో కాంగ్రెస్ టికెట్‌పై గెలుపొందిన అజిత్ జోగి భార్య రేణు జోగి ఈసారి జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ తరఫున పోటీచేసి విజయం సాధించారు.
హిందీ బెల్ట్‌లో కాంగ్రెస్ ఒంటరిగా పోరాడింది. ఈ ప్రాంతంలో కోల్పోయిన తన బలాన్ని తిరిగి పొందే ఉద్దేశంతోనే పకడ్బందీ వ్యూహాలు అనుసరించింది. ఆ విషయంలో విజయం సాధించింది.
– స్మితా గుప్తా, రాజకీయ విశ్లేషకురాలు
ఎన్డీయే రాజకీయ ఫ్రంట్. అలాగే యూపీఏ కూడా మరో ఫ్రంట్. ఎన్డీయేలో ఉన్న సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎదుర్కోవాలంటే యూపీఏ కూడా భాగస్వామ్య పార్టీలను సమైక్య పరిచి పోటీకి దిగాలి.
– వినోద్ శర్మ, హిందూస్తాన్ టైమ్స్ పొలిటికల్ ఎడిటర్
బీజేపీ జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రాల్లోని సామాన్యులపై ప్రభావం చూపించింది. నోట్ల రద్దు వంటి నిర్ణయాలు రాష్ట్రాలపై దుష్ప్రభావం చూపాయి. అవి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలనూ ప్రభావితం చేశాయి.
–కపిల్ సిబాల్, కాంగ్రెస్ సీనియర్ నేత
బీజేపీ ఈ ఎన్నికల్లో గొప్ప ఫలితాలు సాధించలేదు. ఈ విషయం పార్టీలో చర్చించి తప్పుల్ని సవరించుకోవాలి. మోదీ జనాదరణ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు. అది పెరుగుతూనే ఉంది. మరి మేము అనుకున్న ఫలితాలు రాకపోవడానికి కారణాలు ఏమిటో విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది
– కె.జె. అల్ఫాన్స్, కేంద్ర టూరిజం మంత్రి
రాహుల్ గాంధీని ఒక జోకర్‌లా తీసిపారేయడం ఇక మానుకోవాలి. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ తన శక్తివంచన లేకుండా కృషి చేశారు. చిత్తశుద్ధితో పనిచేశారు. ఒక సరికొత్త రాజకీయ నేతగా అవతరించిన రాహుల్‌తో బీజేపీ నేతలు తలపడగలగాలి
– శేఖర్ గుప్తా, సీనియర్ జర్నలిస్టు
దేశమంతా బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇందుకు మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. మోదీ ప్రభుత్వ విధానాల మీద ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ ప్రభావం వచ్చే లోక్‌సభ ఎన్నికల మీద కచ్చితంగా ఉంటుంది.
– అఖిలేష్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు
రాజస్తాన్‌లో సీఎం పీఠంపై కూర్చునే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రధాన కర్తవ్యం బీజేపీ ఓటు శాతాన్ని ఎంతమేరకు తగ్గించగలుగుతారనేదే. బీజేపీ 38శాతం ఓట్లను నిలబెట్టుకోగలిగింది. కాంగ్రెస్ కొంత మేర ఓటు శాతాన్ని పెంచుకోగలిగినా వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి బీజేపీ ఓట్లను తగిన మొత్తంలో రాబట్టుకోవాలి. అప్పుడే కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది
–రాజీవ్ గుప్తా, రాజకీయ విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment