వీడిన ఉత్కంఠ.. చత్తీస్‌గఢ్‌ సీఎం ఖరారు | Congress Announced Bhupesh Baghel Is Chief Minister Of Chhattisgarh | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌ సీఎంగా భూపేశ్‌ బఘేల్‌

Published Sun, Dec 16 2018 3:30 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Congress Announced Bhupesh Baghel Is Chief Minister Of Chhattisgarh - Sakshi

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ సీఎం ఎవరనే దానిపై కొనసాగుతున్న ఉత్కంఠకు కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం తెరదించింది. నేడు రాయ్‌పూర్‌లో జరిగిన సీఎల్పీ సమావేశంలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్‌ భూపేశ్‌ బఘేల్‌ను పక్షనేతగా ఎన్నుకున్నారు. అనంతరం ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా బఘేల్‌ పేరును కాంగ్రెస్‌ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. తాజా ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్‌.. సీఎం ఎంపిక విషయంలో మాత్రం నాలుగు రోజుల పాటు తీవ్ర కసరత్తు చేసింది.

బఘేల్‌తోపాటు సీనియర్‌ నేతలు టీపీ సింగ్‌ దేవ్‌, తమరాథ్‌వాజ్‌ సాహు, చరణ్‌దాస్‌ మహంత్‌లు సీఎం రేస్‌లో ఉండటంతో పార్టీ అధిష్టానం ఎటూ తెల్చుకోలేకపోయింది. దశలు వారీగా పార్టీ సీనియర్‌ నేతలు ఆశావహులతో చర్చలు జరిపారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా శనివారం ఆశావహులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు. తొలి నుంచి అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని సీఎం ఎంపిక ఉంటుందని తెలిపిన కాంగ్రెస్‌ అధిష్టానం.. ఛత్తీస్‌గఢ్‌లో పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన బఘేల్‌ వైపే మెగ్గు చూపింది. కాగా, బఘేల్‌ సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నట్టుగా సమాచారం. ఛత్తీస్‌గఢ్‌ తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌కి 68, బీజేపీకి 15, జేసీసీకి 5, బీఎస్పీకి 2 సీట్లు వచ్చిన సం‍గతి తెలిసిందే.

1961లో ఓ రైతు కుటుంబంలో జన్మించిన బఘేల్‌.. 1986లో యూత్‌ కాంగ్రెస్‌లో చేరడం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1993లో పటాన్‌ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బఘేల్‌ మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అక్కడి నుంచే విజయం సాధించారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2003లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన అదే స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో పలు కీలక బాధ్యతలు చేపట్టారు. 

తొలి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి బఘేల్‌ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఓ మంత్రికి సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడనే ఆరోపణలపై ఆయనకు సీబీఐ కోర్టు 14 రోజుల జైలు శిక్ష విధించింది. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన బఘేల్‌ తన తరఫున వాదించడానికి ఓ లాయర్‌ను కూడా నియమించుకోలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement