రాయ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడుతున్న బఘేల్ (విక్టరీ సంకేతం చూపుతున్న వ్యక్తి), రాష్ట్ర పరిశీలకుడు మల్లికార్జున ఖర్గే,; రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి పునియా తదితరులు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌లో నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ నేతలందరితో సుదీర్ఘంగా మంతనాలు జరిపిన పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీ.. సీనియర్ నేత భూపేశ్ బఘేల్(57)ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఖరారు చేశారు. అనంతరం ఆదివారం నాడిక్కడ సమావేశమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బఘేల్‌ను శాసన సభాపక్ష(సీఎల్పీ) నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర పరిశీలకుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ..‘నిజంగా ఇది కఠినమైన నిర్ణయమే.
ఎందుకంటే బఘేల్, చరణ్‌దాస్ మహంత్, టి.ఎస్. సింగ్‌దేవ్, తామ్రధ్వజ్ సాహూ కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలకంగా వ్యవహరించారు. పార్టీలో ఈ నలుగురి హోదా సమానమే. వీరందరితో పలు దఫాలుగా చర్చించిన మీదట బఘేల్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాహుల్ ఎంపిక చేశారు. ఇదే విషయాన్ని రాష్ట్ర శాసన సభ్యులకు తెలియజేశాం. వారంతా ఏకగ్రీవంగా బఘేల్‌ను సీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. రాయ్‌పూర్‌లోని సైన్స్ కాలేజ్ మైదానంలో బఘేల్ సోమవారం సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు.
బఘేల్‌తో పాటు ఇంకెవ్వరూ మంత్రులుగా ప్రమాణం చేయడంలేదు’ అని తెలిపారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినందున తమముందు చాలా సవాళ్లు ఉన్నాయని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని నిలబెట్టుకుంటామనీ, బఘేల్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారని ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఖరారైన బఘేల్‌కు కాంగ్రెస్ పార్టీ శుభాకాంక్షలు తెలిపింది. బఘేల్ ఎంపికకు ముందు కాంగ్రెస్ పార్టీలో హైడ్రామా నడిచింది. నలుగురు నేతలు సీఎం పదవి కోసం పోటీపడటంతో పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీ వీరితో పలు దఫాలుగా చర్చలు జరిపారు. చివరికి రాహుల్ ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తారో వారికే మద్దతు ప్రకటిస్తామని ఈ నెల 12న సీఎల్పీ చేత తీర్మానం చేయించారు. మొత్తం 90 స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ 68 సీట్లతో ఘనవిజయం సాధించగా, బీజేపీ 15 స్థానాలకు పరిమితమైంది.
రుణమాఫీపైనే తొలి సంతకం: బఘేల్
ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల రుణమాఫీపైనే తొలి సంతకం పెడతానని కాబోయే ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ తెలిపారు. అలాగే 2013లో మావోయిస్టుల చేతిలో కాంగ్రెస్ నేతల ఊచకోతపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణకు ఆదేశిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని రైతులు, ఆదివాసీలు, యువత, మహిళలు, చిరువ్యాపారుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. దుర్గ్ జిల్లాలోని పతన్ నియోజకవర్గం నుంచి బఘేల్ గెలుపొందారు. 2013, మే 25న ఛత్తీస్‌గఢ్‌లోని జీరమ్ లోయ ప్రాంతంలో కాంగ్రెస్ నేతల కాన్వాయ్‌పై మావోయిస్టులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో సల్వాజుడుం వ్యవస్థాపకుడు, కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ, రాష్ట్ర పీసీసీ చీఫ్ నందకుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేశ్ సహా 25 మంది కీలక నేతలు, కార్యకర్తలు చనిపోయారు.
బీజేపీకి పక్కలో బల్లెం
ఛత్తీస్‌గఢ్ లో దాదాపు 15 ఏళ్ల బీజేపీ పాలనకు చరమగీతం పాడటంలో కీలకంగా వ్యవహరించిన భూపేశ్ బఘేల్ మధ్యప్రదేశ్‌లోని(ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్) దుర్గ్ జిల్లాలో ఓ సాధారణ రైతు కుటుంబంలో 1961, ఆగస్టు 23న జన్మించారు. చందూలాల్ చంద్రశేఖర్ ప్రోద్బలంతో 1980 దశకం ప్రారంభంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అనంతరం ఐదేళ్లకే యూత్ కాంగ్రెస్‌లో చేరారు. 1994–95లో మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. క్రమంగా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు.
కుర్మి సామాజిక వర్గానికి చెందిన భూపేశ్‌కు రాష్ట్రంలో ఉన్న 52 శాతం మంది ఓబీసీల్లో మంచి పలుకుబడి ఉంది. దుర్గ్ జిల్లా పటాన్ నియోజకవర్గం నుంచి బఘేల్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1993లో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి తొలిసారి ఎన్నికైన బఘేల్.. అజిత్ జోగీతో పాటు దిగ్విజయ్ సింగ్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. భూపేశ్ బఘేల్ సంఘ సంస్కర్తగా పేరుపొందారు. పేదలు ఆర్థికంగా చితికిపోకుండా ఉమ్మడి మధ్యప్రదేశ్(2000, నవంబర్ 1న మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ అనే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు)లో సామూహిక వివాహాలు జరిపించారు.
అంతేకాకుండా బీజేపీ నేతలకు పక్కలో బల్లెంలా తయారయ్యారు. ప్రతీ సందర్భంలోనూ బీజేపీని ఇరుకున పెట్టేలా మాట్లాడటంతో పాటు ఓ బీజేపీ నేతకు సంబంధించిన అశ్లీల దృశ్యాల సీడీని విడుదల చేసి వివాదాల్లో చిక్కుకున్నారు. ఈ వ్యవహారంలో బఘేల్ జైలుకు సైతం వెళ్లాల్సి వచ్చింది. ఆతర్వాత బఘేల్‌తో పాటు ఆయన భార్య భూకబ్జాలకు పాల్పడ్డారని రమణ్‌సింగ్ ప్రభుత్వం కేసులు పెట్టి వేధించింది. అంతేకాకుండా సొంత పార్టీలోనూ ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అన్నింటిని ఓపికగా సహించిన భూపేశ్ బఘేల్, నేడు ఛత్తీస్‌గఢ్ మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. బఘేల్‌కు ముందు అజిత్ జోగి(మూడేళ్లు), రమణ్‌సింగ్(15 సంవత్సరాలు) ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment