సాక్షి, న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌లో చోటు చేసుకున్న సంక్షోభం తారస్థాయికి చేరింది. సీఎం భూపేష్ బగేల్, ఆరోగ్య మంత్రి టీఎస్ సింగ్ దేవ్‌ల మధ్య విభేదాలు ఢిల్లీకి చేరాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఇద్దరు నేతలు మంగళవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. అధిష్టానం ఆదేశాలతోనే తాను ఢిల్లీకి వచ్చినట్లు మంత్రి సింగ్ దేవ్ తెలిపారు. దీంతో ఛత్తీస్‌గఢ్‌లో ముఖ్యమంత్రి పదవి మార్పు జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. ఇక, 2018 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు భూపేష్ బగేల్‌తోపాటు టీఎస్ సింగ్ దేవ్ కూడా సీఎం రేస్‌లో పోటీపడ్డారు.
అయితే అధిష్టానం మాత్రం భూపేష్ బగేల్‌కు సీఎం అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు రెండున్నరేళ్ల తర్వాత టీఎస్ సింగ్ దేవ్ ముఖ్యమంత్రి అవుతారని అధిష్టానం హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా గత జూన్ నెలతో సీఎం భూపేష్ బగేల్ ముఖ్యమంత్రి పదవి చేపట్టి రెండున్నరేళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ సీఎంగా టీఎస్ సింగ్ నియమితులవుతారా? అనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ విషయంపైనే నేడు ఢిల్లీలో రాహుల్ గాంధీతో చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment