‘నోటా’కు స్పందన అంతంతే!
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం ఈవీఎం పరికరాల్లో తొలిసారి ప్రవేశపెట్టిన ‘నోటా’కు అంతంత స్పందనే వచ్చింది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ‘నోటా’(పై వారు ఎవరూ కాదు) మీటను ఎంచుకున్న వారిలో ఛత్తీస్‌గఢ్ ఓటర్లు అగ్రస్థానంలో నిలిచిచారు. రాష్ట్రంలో 4.6 శాతం మంది దీన్ని నొక్కారు. రెండో స్థానంలో రాజస్థాన్(1.5 శాతం), మధ్యప్రదేశ్(1.4 శాతం) ఓటర్లు నిలిచారు. 1.19 కోట్ల మంది ఓటర్లున్న ఢిల్లీలో అత్యల్పంగా కేవలం 0.63(49 వేల ఓట్లు) శాతం మంది ఓటర్లే దీన్ని ఎంచుకున్నారు. తూర్పు ఢిల్లీలోని గోకుల్‌పూర్ స్థానంలో గరిష్టంగా 1,338 మంది ఓటర్లు మాత్రమే దీనికి ఓటేశారు. 8 నియోజకవర్గాల్లో ఈ మీటకు 4,700 పైగా ఓట్లు పడ్డాయి. సీఎం షీలా దీక్షిత్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ పోటీపడిన న్యూఢిల్లీ స్థానంలో 460 మంది ‘నోటా’ను ఉపయోగించుకున్నారు. బీజేపీ సీఎం అభ్యర్థి హర్షవర్ధన్ బరిలో ఉన్న కృష్ణనగర్‌లో దీనికి 577 ఓట్లు పడ్డాయి.
ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు ఎవరూ నచ్చకుంటే వారిని తిరస్కరించే హక్కు ఓటరుకు ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు సెప్టెంబర్‌లో సంచలన తీర్పు ఇవ్వడం తెలిసిందే. దీంతో ఈసీ తొలిసారిగా ప్రస్తుతం జరిగిన ఐదు రాష్ట్రాల్లో ఈవీఎంలలో ‘నోటా’ మీటను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంగతీ విదితమే. కాగా, నోటా కోరల్లేని మీట అని, అందుకే దానికి స్పందన లభించలేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. నోటాకు మెజారిటీ ఓట్లు వస్తే రీపోలింగ్ జరిపే అవకాశాన్ని ఇచ్చి ఉంటే దానికి విలువ ఉండేదని ఢిల్లీ వర్సిటీ రాజనీతిశాస్త్ర అధ్యాపకుడు ప్రదీప్‌కుమార్ దత్తా అన్నారు. ఢిల్లీ ఓటర్లు నోటా బదులు ఆప్‌ను ఎంచుకున్నారన్నారు.