సుప్రీం కోర్టు (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: గత కొన్ని సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా నోటా అంశం వెలుగులోకి వస్తుంది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో మనకు ఎవరూ నచ్చకపోతే నోటాకు ఓటు వేయవచ్చు. చాలా సార్లు బరిలో నిలిచిన వారికంటే నోటాకే అధికంగా ఓట్లు వచ్చిన సందర్భాలున్నాయి. ఇటువంటి పరిస్థితి వస్తే.. మరోసారి ఎన్నికలు జరిపి కొత్తవారిని ఎన్నుకోవాలని.. అప్పుడే నోటాకు విలువ ఉంటుందనే వాదనలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది. నోటా విషయంలో అభిప్రాయం ఏంటో తెలపాల్సిందిగా సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
ఎన్నికల బరిలో నిల్చున్న అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే.. ఆ ఎన్నికను రద్దు చేయాల్సిందిగా కోరుతూ.. బీజేపీ నేత అశ్విని కుమార్ ఉపాధ్యాయ గతంలో సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ రమసుబ్రమణియన్‌తో కూడిన బెంచ్ సోమవారం ఈ పిల్‌ని విచారిందింది. ఈ నేపథ్యంలో నోటాపై అభిప్రాయాలను తెలియాజేయాల్సిందిగా బెంచ్.. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని కోరింది.
విచారణ సందర్బంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రస్తుతం ఓటర్లకు కేవలం అభ్యర్థులను తిరస్కరించే అవకాశం మాత్రమే ఉందని.. కానీ దీన్ని కూడా ఓటుగా గుర్తించాలని కోరారు. ప్రసుత్తం నోటాకు 99 శాతం ఓట్లు వచ్చి.. అభ్యర్థికి ఒక్కశాతం ఓట్లు వచ్చినా అతడిని విజేతగా ప్రకటిస్తున్నారని.. దీన్ని మార్చాలని విజ్ఞప్తి చేశారు. నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే.. మరోసారి ఎన్నికలు జరిపి కొత్త వారిని ఎన్నుకోవాలని.. అప్పుడే నోటాకు ప్రయోజనం ఉంటుందని వెల్లడించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు దీనిపై అభిప్రాయం తెలపాల్సిందిగా కేంద్రాన్ని కోరింది.
నోటా నేపథ్యం...
ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్ని కల్పిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్లకు అవకాశం కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అభ్యర్థుల గుర్తుతోపాటు నోటా (నన్ ఆఫ్ ది ఎబవ్) ను ఏర్పాటు చేశారు. ఎవరికైనా ఓటు వేయాలంటే సదరు అభ్యర్థికో, పార్టీకో ఓ గుర్తు వుంటుంది. ఆ గుర్తుకు ఓటర్లు ఓటు వేస్తూ ఉంటారు. అయితే, ఈ దఫా మాత్రం ఇప్పుడు పోటీలో వున్నవాళ్ళెవరికీ నేను ఓటు వేయడం లేదు అనే ఆప్షన్‌ను ఈవీఎంలలో పొందుపరిచారు. ఆ బటన్ నొక్కితే సదరు ఓటరు ఓటు ఎవరికీ పడదు. కానీ ఓటు హక్కును నోటా వినియోగించుకున్నట్టే.
ఇలాంటి అవకాశం ఇప్పటికే చాలా దేశాల్లో ఓటర్లకు అందుబాటులో ఉండగా, అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లో మాత్రం కాస్త ఆలస్యంగా ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. ‘నోటా’ను అందుబాటులోకి తేవాలనుకుంటున్నట్లు ఎన్నికల కమిషన్ 2009లో తొలిసారిగా సుప్రీంకోర్టుకు చెప్పింది. ప్రభుత్వం దీనికి వ్యతిరేకించినా, పౌర హక్కుల సంస్థ పీయూసీఎల్ దీనికి మద్దతుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఎట్టకేలకు ఎన్నికల్లో ‘నోటా’ను అమలులోకి తేవాలంటూ సుప్రీంకోర్టు 2013 సెప్టెంబర్ 27న రూలింగ్ ఇచ్చింది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment