న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల్లో నోటాకు(నన్ ఆఫ్ ది అబో) ఎక్కువ ఓట్లుపోలైతే ఆ ఎన్నికను రద్దు చేసి.. మళ్లీ ఎలక్షన్స్ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అదే విధంగా నోటా కంటే తక్కువ ఓట్లు పొందిన అభ్యర్ధులు మళ్లీ అదే నియోజకవర్గంలో అయిదేళ్ల వరకు జరిగే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆదేశించాలని పిటిషన్ కోరింది.
నోటాను ‘కల్పిత అభ్యర్థి’గా పేర్కొంటూ సమర్థవంతమైన రిపోర్టింగ్/ ప్రచారాన్ని కల్పించేలా నిబంధనలను రూపొందించాలని కోరింది. వక్త, రచయిత శివ్ ఖేరా దాఖలు చేసిన ఈ ప్రజా ప్రయోజన వాజ్యంపై సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఖేరా తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణ వాదిస్తూ.. సూరత్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించబడం, ఇతర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఎలాంటి ఎన్నికలు లేకుండానే బీజేపీ అభ్యర్థి విజేతగా ప్రకటించిన సందర్భాన్ని ప్రస్తావించారు.
సూరత్‌లో మరో అభ్యర్ధి లేనందున, అందరూ ఒకే అభ్యర్థి విజేతగా ప్రకటించారు. అయితే పోటీలో ఒకే అభ్యర్థి ఉన్నప్పటికీ, ఎన్నికల నిర్వహించాల్సి ఉండేదని తెలిపారు. ఓటరుకి అభ్యర్ధి నచ్చకపోతే నోటాకు ఓటేసేవాడని పేర్కొన్నారు. మంచి అభ్యర్థులను నిలబెట్టేలా రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావడమే నోటా ఉద్దేశ్యమని చెప్పారు. ఒక నియోజకవర్గంలో దాదాపు అన్ని అభ్యర్థులు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్న సందర్భాల్లో ఓటరు నోటాకు ఓటు వేసే అవకాశాలు ఉంటాయని, ఓటరు చేతిలో నోటా శక్తివంతమైన ఆయుధంగా పేర్కొన్నారు.
నోటాను చెల్లుబాటు అయ్యే అభ్యర్థిగా పరిగణించడంలో భారత ఎన్నికల సంఘం విఫలమైందన్నారు. ప్రజాస్వామ్యంలో నాటా అవసరమని నొక్కి చెప్పారు. దీనిపై సీకజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ.. ఇది ఎన్నికల ప్రక్రియకు సంబంధించినదని పేర్కొంటూ.. పిటిషన్‌పై స్పందించాలంటూ ఈసీకి నోటీసులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment