న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఓటర్లకు తిరస్కరించే హక్కును కల్పించిన నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో అందుకు తగిన చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. బ్యాలెట్ పత్రాలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లలో ‘పై వారెవరూ కాదు’(నన్ ఆఫ్ ది అబౌ-నోటా) అనే ప్రత్యామ్నాయాన్ని ఎంచుకునే ఏర్పాటు చేయాలని.. ప్రత్యేక మీటను పొందుపరచాలని ఆదేశించింది.
నవంబర్, డిసెంబర్‌లలో జరిగే ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా ఓటర్లకు అభ్యర్థులను తిరస్కరించే అవకాశాన్ని కల్పించనున్నట్లు ఈసీ తెలిపింది. పోలింగ్ బూత్‌కు వచ్చిన ఓటర్లు తాము ఎవరికీ ఓటు వేయకూడదని భావించిన పక్షంలో ‘నోటా’ బటన్‌ను ఎంచుకోవడం ద్వారా ఆ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ తిరస్కరించే హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరి పేర్ల తర్వాత ఈ బటన్‌ను ఏర్పాటు చేస్తారు. అభ్యర్థుల పేర్లను రాసే భాషలోనే పైవారెవరూ కాదు అనే పదాలను కూడా పొందుపరుస్తారు.