న్యూఢిల్లీ: లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తన్న వేళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియలో పవిత్రత ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది. దేశంలో ఎన్నికలు సజావుగా, నిస్పక్షపాతంగా జరిగేలా అనుసరించే చర్యలను వివరించాలని ఈసీ కోరింది. ‘ఇది ఎన్నికల ప్రక్రియ. పవిత్రంగా ఉండాలి. ఓటర్లు ఆశించినది జరగడం లేదని ఎవరూ భయాందోళన చెందకుండా చూసుకోవాలి’ అని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం పేర్కొంది.
ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం) ఓట్లతో వీవీప్యాట్ సిస్టమ్ ద్వారా రూపొందించిన పేపర్ స్లిప్‌లను క్రాస్ వెరిఫికేషన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లను కోర్టు విచారణ జరిపింది. ఈసీ తరపున సీనియర్ న్యాయవాది మణిందర్‌సింగ్, పిటిషనర్లలో ఒకరి తరపున అడ్వకేట్ నిజాంపాషా మాట్లాడుతూ.. ఓటరు ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్ స్లిప్ తీసుకోవడానికి అనుమతించాలని కోరారు. అయితే అలాంటి ప్రక్రియ ఓటరు గోప్యతను ప్రభావితం చేయదా అని జస్టిస్ ఖన్నా ప్రశ్నించారు. ఇది ఓటర్ గోప్యతను, ఓటరు హక్కులను భంగం కలిగించదని పాషా బదులిచ్చారు.
అనంతరం మరో పిటిషనర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ.. VVPAT మెషీన్‌లోని లైట్ ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండాలని కోరారు. ప్రస్తుతం ఈ లైట్ అది ఏడు సెకన్ల పాటు ఆన్‌లో ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో ఒకవేళ పేపర్ స్లిప్ అందించడం వీలు కాకపోతే కనీసం ఎల్లవేళలా లైట్ వెలుగుతూనే ఉండేలా చూడాలని కోరారు. దీనివల్ల ఓటర్ స్లిప్ కటింగ్, బాక్స్‌లో పడిపోవడం చూడగలుగుతాడని చెప్పారు. ఇది వారి గోప్యతకు అడ్డు రాదని చెప్పారు.
ఈ సందర్భంగా ఇటీవల కేరళలో జరిగిన మాక్ పోల్ గురించి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాసర్‌గోడ్‌లో జరిగిన మాక్ ఓటింగ్‌లో బీజేపీకి అదనంగా ఓట్లు వచ్చాయని కోర్టుకు తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ ఈ వ్యవహారాన్ని పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అనంతరం ఆ నివేదిక పూర్తి అవాస్తవమని ఈసీ వెల్లడించింది. పారదర్శక ఓటింగ్ నిర్వహణ కోసం ఎలాంటి విధానాలను పాటిస్తున్నారని ఈసీని ప్రశ్నించింది. దీంతో ఎన్నికల సంఘం తమ ప్రక్రియను న్యాయస్థానానికి వివరించింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
చదవండి: రాహుల్ గాంధీకి ధైర్యం లేదు: రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment