100% వీవీప్యాట్ స్లిప్‌ల లెక్కింపు కుదరదు
కావాలంటే ఈవీఎంలు పరిశీలించుకోవచ్చు
మళ్లీ బ్యాలెట్‌లు పెట్టాలని చెప్పలేం
ఈవీఎం మెషిన్ల పరిశీలన, అనుమానాల్ని నివృత్తి చేసుకున్న ద్విసభ్య ధర్మాసనం
తీర్పు వెల్లడించే సమయంలో ఈసీకి రెండు సూచనలు
పిటిషన్లంటినీ కొట్టేస్తూ తీర్పిచ్చిన సుప్రీం కోర్టు
కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట
న్యూఢిల్లీ, సాక్షి: ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ఇస్తూ సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈవీఎం, వీవీప్యాట్‌లపై దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును పెండింగ్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం ఉదయం ఆ పిటిషన్లను కొట్టేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది.
ఈవీఎంల పనితీరుపై అనేక అనుమానాలున్నాయని, వీపీప్యాట్ స్లిప్‌లను ఓటర్లకు అందించాలని, ఆ తరవాత వాటిని 100శాతం లెక్కించాలంటూ పలువురు పిటిషన్లు వేశారు. అయితే ఈ విజ్ఞప్తితో పాటుగా బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫామ్స్(ADR) పిటిషన్ వేసింది. ఈ పిటిషన్లను అన్నింటిని కలిపి మూడు రోజులపాటు విచారణ జరిపింది జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా బెంచ్. చివరకు.. పిటిషన్లు కొట్టేస్తూ ఏకాభిప్రాయంతో కూడిన తీర్పు ఇచ్చింది.
‘‘వీవీప్యాట్‌లు వందశాతం సరిపోల్చాలని వచ్చిన పిటిషన్లు సరికాదు.వ్యవస్థలో సమతుల్య దృక్పథం ముఖ్యమే. కానీ, ఆ వ్యవస్థను గుడ్డిగా అనుమానించడం సంశయవాదాన్ని పెంపొందిస్తుంది. అందుకే.. అర్థవంతమైన విమర్శలు అవసరం. అది న్యాయవ్యవస్థ అయినాసరే చట్ట సభలు అయినాసరే. ప్రజాస్వామ్యం అంటేనే అన్నింటా సామరస్యం పాటిస్తూ నమ్మకాన్ని కొనసాగించడం. విశ్వాసం, పరస్సర సహకారం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయొచ్చు. అనుమానాలతో ఈవిఎంలను గుడ్డిగా వ్యతిరేకించొద్దు’’ అని జస్టిస్ దత్తా తీర్పు ద్వారా వెల్లడించారు.
ఈ సందర్భంగా ఈసీకి రెండు కీలక సూచనలు చేసింది సుప్రీంకోర్టు
1. సింబల్ లోడింగ్ యూనిట్ ను సీల్ చేయాలి . అభ్యర్థులు వారి ప్రతినిధులు సంతకాలు దానిపై చేయాలి . ఈ యూనిట్ ను ఫలితాలు వెలువడిన 45 రోజుల వరకు భద్రంగా ఉంచాలి
2. ఫలితాలు వెలువడిన ఏడు రోజుల్లో రెండు మూడో స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తే ఈవీఎంల వెరిఫికేషన్కు అవకాశం ఇవ్వాలి. ఇంజనీర్ల ద్వారా ఐదు శాతం ఈవీఎంలను తనిఖీ చేయాలి. దీనికోసం అయ్యే ఖర్చును అభ్యర్థి భరించాలి. ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని తేలితే ఖర్చు వెనక్కి ఇవ్వాలి. వెరిఫికేషన్ సమయంలో పోటీ చేసిన అభ్యర్థులందరూ చూసే అవకాశం ఇవ్వాలి.
వీవీప్యాట్ మెషిన్లపై ఓటరుకు స్లిప్ సులువుగా కనిపించే అద్దం స్థానంలో ఏడు సెకన్ల పాటు లైట్ వచ్చినప్పుడు మాత్రమే కనిపించేలా మరో రకమైన గ్లాస్‌ను ఏర్పాటుచేస్తూ 2017లో ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఓ అసెంబ్లీ స్థానంలో ఐదు ఈవీఎంలలోని ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో వెరిఫై చేస్తున్నారు. అలా కాకుండా మొత్తం స్లిప్పులను సరిపోల్చాలని పిటిషనర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈసీ మాత్రం అది సులభం కాదని చెబుతోంది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదని కోర్టుకు వివరించింది.
రెండ్రోజుల వాదనలు ఇలా..
ఏడీఆర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ ఐరోపా దేశాల్లోని ఎన్నికల ప్రక్రియను ప్రస్తావించారు. జర్మనీ లాంటి దేశాలు ఈవీఎంల నుంచి తిరిగి పేపర్ బ్యాలెట్ల వద్దకే వచ్చాయి. ఈవీఎంల వల్ల అవకతవకలు జరుగుతాయని మేం చెప్పడం లేదు. ఈవీఎం, వీవీప్యాట్లను మార్చే అవకాశం ఉందని చెబుతున్నాం. అందుకే మళ్లీ మనం కూడా పేపర్ బ్యాలెట్ పద్ధతిని వినియోగించాలి. లేదంటే వీవీప్యాట్ స్లిప్‌లను ఓటర్ల చేతికి ఇవ్వాలి. అదీ కుదరకుంటే ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్ స్లిప్‌లను ఓటర్లే బ్యాలెట్ బ్యాక్సుల్లో వేసేలా రూపొందించాలి అని వాదించారాయన.
అయితే.. రహస్య బ్యాలెట్ ఓటింగ్ పద్ధతి వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రస్తావించిన న్యాయస్థానం పిటిషనర్లపై ఒకింత అసహనం వ్యక్తం చేసింది. విదేశాలతో మన ఓటింగ్ ప్రక్రియను పోల్చి వ్యవస్థను తక్కువ చేయొద్దని పిటిషనర్‌కు సూచించింది. జర్మనీలాంటి దేశాల్లో పశ్చిమ బెంగాల్ కన్నా తక్కువ జనాభా ఉందని, మన దేశంలో వంద కోట్ల మంది ఓటర్లున్నారని, అన్ని వీవీప్యాట్లను లెక్కించాలని మీరు(పిటిషనర్) కోరుతున్నారని, బ్యాలెట్ పేపర్లు వినియోగించినప్పుడు గతంలో ఏం జరిగిందో మాకు తెలుసునని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఇక ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది మణిందర్‌సింగ్ తన వాదనలు వినిపిస్తూ.. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని, అయితే మానవతప్పిదాలను మాత్రం తోసిపుచ్చలేమని పేర్కొన్నారు. వాదనలు పూర్తి కావడంతో తీర్పును ఏప్రిల్ 24వ తేదీ నాటికి సుప్రీం కోర్టు రిజర్వ్ చేసింది. అయితే..
తీర్పు ఇవ్వకుండా ట్విస్ట్
అయితే ఏప్రిల్ 24వ తేదీన సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించలేదు. ఈ అంశంలో ఇంకా తమకు సందేహాలు ఉండటంతో ధర్మాసనం స్పష్టత కోరింది. ఈక్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి కొన్ని ప్రశ్నలు సంధించింది. ఈవీఎంలో మైక్రో కంట్రోలర్ ఎక్కడ ఉంటుంది. కంట్రోలింగ్ యూనిట్‌లోనా లేదా వీవీప్యాట్‌లోనా? అని ప్రశ్నించింది. మైక్రో కంట్రోలర్ అనేది ఒకసారి రూపొందించిన ప్రోగ్రామా, కాదా? అన్నది నిర్ధారించాలని సూచించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ మధ్యాహ్నం ఈసీ అధికారులు న్యాయస్థానం ఎదుట హాజరై వివరణ ఇచ్చారు.
ఎన్నికల సంఘం వివరణను పరిశీలించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈసందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మా సందేహాలను ఈసీ నివృత్తి చేసింది. మీ (పిటిషనర్ల) ఆలోచనా ధోరణిని మేం మార్చలేం. కేవలం అనుమానాలను ఆధారం చేసుకుని ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేం. ఎన్నికల సంఘం ఓ రాజ్యాంగ సంస్థ. దాని పనితీరును మేం నిర్దేశించలేం. ఎన్నికల ప్రక్రియను నియంత్రించలేం’’ అని స్పష్టం చేసింది.
ఈ విచారణ సందర్భంగా ఈవీఎమ్ సోర్స్ కోడ్‌కు సంబంధించిన అంశాలను పిటిషనర్లు లేవనెత్తారు. పారదర్శకత కోసం దాన్ని బయటపెట్టాలని కోరారు. దీన్ని ధర్మాసనం వ్యతిరేకించింది. ‘‘సోర్స్ కోడ్‌ను ఎప్పుడూ బహిర్గతం చేయకూడదు. అలా చేస్తే దాన్ని దుర్వినియోగం చేసే అవకాశముంది’’ అని వ్యాఖ్యానించింది. ఇక ఈ ఉదయం(ఏప్రిల్ 26) అన్ని పిటిషన్లను తిరస్కరిస్తూ తీర్పు వెల్లడించింది.
వీవీప్యాట్ ఎందుకు?
ఓటర్ తాను వేసిన ఓటు పడిందా? లేదా?.. పడితే తాను అనుకున్న అభ్యర్థికే పడిందా? ఇదంతా తెలసుకోవడం కోసమే ఈవీఎంకు అనుసంధానంగా వీవీ ప్యాట్(ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) తీసుకొచ్చింది. ఓటర్ ఈవీఎం బటన్ నొక్కిన తర్వాత.. ఓటేసిన గుర్తు అక్కడి తెరపై ఏడు సెకన్ల పాటు కనిపిస్తుంది. అలా ఓటుని నిర్ధారించుకోవచ్చు. తొలిసారిగా 2013లో జరిగిన నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజక వర్గాల్లో వీవీ ప్యాట్ విధానాన్ని ఎన్నికల కమిషన్ అమలు చేసింది. ఆ తర్వాత దఫ దఫాలుగా పలు రాష్ట్రాల్లో అమలు చేస్తూ వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment