‘ప్రింటవుట్’కు ఈసీ అంగీకారం
Published Sat, Oct 5 2013 2:23 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
ఓటరు ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత ప్రింటవుట్ (రసీదు) ఇచ్చే ఓటింగ్ యంత్రాలను (ఈవీఎం) ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) సుప్రీం కోర్టుకు సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. దీనికోసం 20 వేల యంత్రాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చినట్లు వెల్లడించింది. ఓటును సరిచూసుకునే పేపర్ యంత్రాల (వీవీపీఏటీ)ను దశలవారీగా ప్రవేశపెడతామని పేర్కొంది. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పైలట్ ప్రాజెక్టు పద్ధతిలో చేపట్టిన ప్రింటవుట్ విధానం విజయవంతమైందని ఈసీ వివరించింది. ఎన్నికల్లో అక్రమాలను నియంత్రించాలంటే ఈవీఎంలకు ప్రింటర్‌ను జతచేయాలంటూ బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి దాఖలుచేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివం, జస్టిస్ రంజన్ గొగోయ్‌ల నేతృత్వలోని ధర్మాసనం విచారించింది.
కొత్త యంత్రాల సేకరణలో ఈసీకి ఉన్న పరిమితులేమిటో తమకు అర్థమయ్యాయని ధర్మాసనం పేర్కొంది. ‘మీ సమస్యేంటో మాకు అర్థమైంది. దేశవ్యాప్తంగా ఒకేసారి అమలుచేయలేరు కదా. మీరైతే మీ ప్రయత్నం చేయండి’ అని ధర్మాసనం ఈసీనుద్దేశించి పేర్కొంది. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలకు వీటిని ప్రవేశపెట్టగలరా అని అడిగింది. ఈవీఎంలను తయారుచేసే రెండు కంపెనీలైన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెంగళూరు), ఈసీఐఎల్ (హైదరాబాద్)లకు 20 వేల యంత్రాల కోసం రూ.38 కోట్ల విలువైన ఆర్డర్ ఇచ్చామని ఈసీ తరఫు న్యాయవాది అశోక్ దేశాయ్ కోర్టుకు చెప్పారు. లోక్‌సభ ఎన్నికల కోసం 13 లక్షల వీవీపీఏటీ యంత్రాలు అవసరమవుతాయని, దీనికి సుమారు రూ. 1,500 కోట్లు ఖర్చవుతుందని ఈసీ తెలిపింది. కోర్టు తీర్పును రిజర్వులో ఉంచుతూ రెండు వారాలకు వాయిదా వేసింది.
Advertisement
Advertisement