న్యూఢిల్లీ, సాక్షి: ఈవీఎంలలో పోలైన ఓట్లను వీవీప్యాట్(Voter-Verifiable Paper Audit Trail) స్లిప్‌లతో సరిపోల్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది. అయితే తీర్పు ముందర ఈ వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి నాలుగు ప్రశ్నలు సంధించిన ద్విసభ్య ధర్మాసనం.. వాటికి సమాధానాలతో రావాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ పిటిషన్లపై రెండ్రోజులపాటు విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. విచారణలో ఎక్కువ భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం వాదనల వైపే బెంచ్ తన అభిప్రాయాల ద్వారా మొగ్గుచూపించినట్లు అనిపించింది. అయితే ఇవాళ తీర్పు వెల్లడించడానికి కొన్ని గంటల ముందు ఈసీకి ప్రశ్నలు సంధించింది.
- మైక్రోకంట్రోలర్‌ను వీవీప్యాట్‌లో లేదంటే కంట్రోలింగ్ యూనిట్‌లో ఇన్‌స్టాల్ చేశారా?
- మైక్రోకంట్రోలర్ ఒక్కసారి మాత్రమే పని చేస్తుందా?
- సింబల్ లోడింగ్ యూనిట్లు.. ఎన్నికల సంఘం వద్ద ఎన్ని అందుబాటులో ఉన్నాయి?
- మీరు(ఈసీ) చెప్పిందాన్ని బట్టి ఎన్నికల పిటిషన్ దాఖలు చేయడానికి పరిమితి 30 రోజులు. నిల్వ, రికార్డులు మాత్రం 45 రోజులు నిర్వహించబడతాయి. కానీ పరిమితి రోజు 45 రోజులా? మీరు దాన్ని సరిచేయాల్సి ఉంది.
వీటికి మేం క్లారిటీ కావాలని కోరుతున్నాం. వీటికి సమాధానాలతో ఈసీ ఆఫీసర్ మధ్యాహ్నాం మా ముందుకు రావాలి అని కోర్టు బుధవారం ఉదయం ఆదేశాలు జారీ చేసింది.
వీవీప్యాట్ మెషిన్లపై ఓటరుకు స్లిప్ సులువుగా కనిపించే అద్దం స్థానంలో ఏడు సెకన్ల పాటు లైట్ వచ్చినప్పుడు మాత్రమే కనిపించేలా మరో రకమైన గ్లాస్‌ను ఏర్పాటుచేస్తూ 2017లో ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా ఆదేశించాలని ADR(అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫామ్స్) దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది.
విచారణ సందర్భంగా.. ఏడీఆర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ ఐరోపా దేశాల్లోని ఎన్నికల ప్రక్రియను ప్రస్తావించారు. జర్మనీ లాంటి దేశాలు ఈవీఎంల నుంచి తిరిగి పేపర్ బ్యాలెట్ల వద్దకే వచ్చాయి. ఈవీఎంల వల్ల అవకతవకలు జరుగుతాయని మేం చెప్పడం లేదు. ఈవీఎం, వీవీప్యాట్లను మార్చే అవకాశం ఉందని చెబుతున్నాం. అందుకే మళ్లీ మనం కూడా పేపర్ బ్యాలెట్ పద్ధతిని వినియోగించాలి. లేదంటే వీవీప్యాట్ స్లిప్‌లను ఓటర్ల చేతికి ఇవ్వాలి. అదీ కుదరకుంటే ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్ స్లిప్‌లను ఓటర్లే బ్యాలెట్ బ్యాక్సుల్లో వేసేలా రూపొందించాలి అని వాదించారాయన.
అయితే.. రహస్య బ్యాలెట్ ఓటింగ్ పద్ధతి వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రస్తావించిన న్యాయస్థానం పిటిషనర్లపై ఒకింత అసహనం వ్యక్తం చేసింది. విదేశాలతో మన ఓటింగ్ ప్రక్రియను పోల్చి వ్యవస్థను తక్కువ చేయొద్దని పిటిషనర్‌కు సూచించింది. జర్మనీలాంటి దేశాల్లో పశ్చిమ బెంగాల్ కన్నా తక్కువ జనాభా ఉందని, మన దేశంలో వంద కోట్ల మంది ఓటర్లున్నారని, అన్ని వీవీప్యాట్లను లెక్కించాలని మీరు(పిటిషనర్) కోరుతున్నారని, బ్యాలెట్ పేపర్లు వినియోగించినప్పుడు గతంలో ఏం జరిగిందో మాకు తెలుసునని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఇదీ చదవండి: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా జరగాలి
ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది మణిందర్‌సింగ్ తన వాదనలు వినిపిస్తూ.. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని, అయితే మానవతప్పిదాలను మాత్రం తోసిపుచ్చలేమని పేర్కొన్నారు.
ఇక విచారణ సందర్భంగా ఓటింగ్, ఈవీఎంలను భద్రపర్చడం, కౌటింగ్ ప్రక్రియ గురించి ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆరా తీసింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసినవారికి కఠిన శిక్ష లేకపోవడంపై ధర్మాసనం పెదవి విరిచింది. మరోవైపు.. రెండ్రోజుల విచారణ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం తరఫున ఓ అధికారి ద్వారా ఈవీఎంల పని తీరును ధర్మాసనం క్షుణ్ణంగా పరిశీలించడం గమనార్హం.
వీవీప్యాట్ ఎందుకు?
ఓటర్ తాను వేసిన ఓటు పడిందా? లేదా?.. పడితే తాను అనుకున్న అభ్యర్థికే పడిందా? ఇదంతా తెలసుకోవడం కోసమే ఈవీఎంకు అనుసంధానంగా వీవీ ప్యాట్(ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) తీసుకొచ్చింది. ఓటర్ ఈవీఎం బటన్ నొక్కిన తర్వాత.. ఓటేసిన గుర్తు అక్కడి తెరపై ఏడు సెకన్ల పాటు కనిపిస్తుంది. అలా ఓటుని నిర్ధారించుకోవచ్చు. తొలిసారిగా 2013లో జరిగిన నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజక వర్గాల్లో వీవీ ప్యాట్ విధానాన్ని ఎన్నికల కమిషన్ అమలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment