మెదక్ అర్బన్: ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు నచ్చకపోతే ఓటర్లు నచ్చలేదని తెలియచేసేందుకు 2014 ఎన్నికల్లో భారత ఎన్నికల సంఘం అవకాశాన్ని కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం)లపై అభ్యర్థి గుర్తుతో పాటు నోటా ( నన్ ఆఫ్ ది ఎబోవ్) అనే ఆప్షన్‌ను ఏర్పాటు చేసింది.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఎన్నికల కమిషన్ నోటాను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు ప్రతీ ఓటు విలువైనదే. నోటా రావడానికి ముందు పోటీ చేసిన అభ్యర్థులు నచ్చకుంటే ఓటు హక్కును వినియోగించుకునేవారు కాదు.
జిల్లాలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో మెదక్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 3,32,742 ఓట్లు పోలయ్యాయి. దీంట్లో నోటాకు మెదక్ నియోజకవర్గంలో 1,602 నర్సాపూర్ నియోజకవర్గంలో 1,228 ఓట్లు పోలయ్యాయి. 2,830 మంది ఓటర్లు నోటాను నొక్కి పోటీ చేస్తున్న అభ్యర్థి ఎవరూ తమకు నచ్చలేదని స్పష్టం చేశారు. అధికారులు నోటా గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహించి ఓటర్లు ఖచ్చితంగా పోలింగ్ కేంద్రాలకు రావాలని, అభ్యర్థులు నచ్చని పక్షంలో తిరస్కరించవచ్చని అవగాహన కల్పించారు. 2014 ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గంలో ఎక్కువగా నోటా ఓట్లు పోలయ్యాయి.
నోటాను ఎంత ఎక్కువ మంది వాడితే పోటీలోఉన్న అభ్యర్థులు అంత మంది ఓటర్లకు నచ్చనట్లు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అభ్యర్థులు ఎవరూ నచ్చనట్లయితే తిరస్కరించే అవకాశం ఓటరుకు ఉండాలని పలు స్వచ్ఛంద సంస్థలు, సా మాజిక సేవా విభాగాలు కోరుతూ వస్తున్న తరుణంలో నోటాను అందుబాటులోకి తీసుకురావా లని ఎన్నికల సంఘం 2009లో మొదటిసారిగా సుప్రీం కోర్టుకు తెలియజేసింది. ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించినా పలుసంస్థలు, ప్రజాసంఘాలు మ ద్దతు ప్రకటించాయి. ఈ పరిస్థితుల మధ్య నోటా ను అమలులోకి తీసుకురావాలని సుప్రీం కోర్టు 2013 సెప్టెంబరు 27న తీర్పును వెలువరించింది.
2014 ఎన్నికల్లో.. పోలైన ఓట్లు నోటా ఓట్లు
మెదక్ 1,57,572 1,602
నర్సాపూర్ 1,75,170 1,228
భద్రత దృష్ట్యా వెనక్కి..
వాస్తవానికి అభ్యర్థులు ఎవరూ ఓటర్లకు నచ్చకుంటే తిరస్కరణ ఓటు హక్కును భారత రాజ్యా ంగం ఎప్పుడో కల్పించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 49 (ఓ) కింద ఓటర్లు ఈ హక్కును వినియోగించుకునే వీలుంది. పోలింగ్‌బూత్‌లోని ప్రిసైడింగ్ అధికారి వద్దకు వెళ్లి దీనికి కోసం 17–ఏ ఫారంను తీసుకొని ఫలానా అభ్యర్థిని తిరస్కరిస్తున్నట్లు పేర్కొంటూ సంతకం లేదా వేలిముద్ర వేసి బ్యాలెట్ బాక్స్‌లో వేసే అవకాశం ఉండేది. రహస్య ఓటింగ్‌కు ఇది విరుద్దమని ఓటరు భద్రత దృష్ట్యా ఇది సరైంది కాదన్న వ్యతిరేకత ఉండేది.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీ ఎం)లు అందుబాటులోకి రావడంతో నోటాను ఎన్నికల సంఘం మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో ఎంత మంది నోటాను వినియోగించుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఓటు హక్కుపై ప్రస్తుతం యువతతో పాటు ప్రతి ఒక్కరికి అవగాహన ఉండటం, పోటీ చేస్తున్న రాజకీయ నాయకుల గురించి అంతా తెలిసి ఉండటంతో నోటాను వినియోగించేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment