ఉద్యోగుల ఓటెటు ? | The Election Commission Has Taken Special Steps To Increase The Polling Percentage In The Elections. | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల ఓటెటు ?

Published Tue, Nov 27 2018 9:32 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

The Election Commission Has Taken Special Steps To Increase The Polling Percentage In The Elections. - Sakshi

ఉద్యోగులు

అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోలింగ్‌ శాతాన్ని పెంచే క్రమంలో ఎలక్షన్‌ కమిషన్‌ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల కమిçషన్‌ అధికారులు పోస్టల్‌ బ్యాలెట్‌పై విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఉద్యోగుల ఓట్లు గెలుపును ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీంతో రాజకీయ పార్టీలు వారిని అనుకూలంగా మలుచుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ తమ మేనిఫెస్టోల్లో వారికి అనుకూల తాయిలాలు ప్రకటించేదుకు సిద్ధమవుతున్నాయి. 


పాపన్నపేట(మెదక్‌): జిల్లాలో 6,600 మంది ఉద్యోగులున్నారు. ఇందులో టీచర్లు, ఎన్జీఓలు, పంచాయతీరాజ్‌ ఉద్యోగులు, రెవెన్యూ ఉద్యోగులు, పోలీసులు ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం వాళ్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ‘కంట్రిబ్యూటరీ పింఛన్‌ స్కీం’ (సీపీఎస్‌) రద్దు చేయాలంటూ కొంత కాలంగా ఉద్యోగులు తీవ్ర పోరాటం చేస్తున్నారు. అయితే దీనికి అనుకూలంగా తమ వంతు ప్రయత్నం చేస్తామని ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. అలాగే పీఆర్సీ, మధ్యంతర  భృతిపై  కూడా ఉద్యోగులు ఆశతో ఉన్నారు.

ఉపాధ్యాయులైతే ఉమ్మడి సర్వీసు రూల్స్‌ రావడం లేదని ఆందోళనకు సిద్ధమవుతున్నారు.అలాగే ఉద్యోగ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచాలని  కొంత కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయాలపై సంఘనాయకులు ప్రధాన పార్టీలను కలసి తమ డిమాండ్లకు అనుకూలంగా మేనిఫెస్టోలు ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఇంత వరకు అధికారికంగా ఏ పార్టీ మేనిఫెస్టో  ప్రకటించక పోయినప్పటికీ , చూచాయగా ఉద్యోగుల డిమాండ్లను తీరుస్తామనే సంకేతాలిస్తున్నారు.

ఈ విషయమై రిటైర్మెంట్‌ వయస్సును పెంచే అంశాన్ని పరిశీలస్తున్నామని, మంచి పీఆర్సీ, మధ్యంతర భృతి ఇస్తామని, సీసీఎస్‌పై సానుకూల నిర్ణయం గురించి ఆలోచిస్తామని  టీఆర్‌ఎస్‌ తరఫున సీఎం కేసీఆర్‌ బహిరంగ సభల్లో, యూనియన్‌ నాయకులు కలసిన సందర్భాల్లో ప్రకటిస్తున్నారు. అలాగే కాంగ్రెస్, బీజేపీ అధినేతలు సైతం సీసీఎస్‌ రద్దు చేస్తామని రిటైర్మెంట్‌ వయస్సు కూడా పెంచుతామని ప్రకటనలు చేస్తున్నారు. ఇందులో ఉద్యోగులు ఏ పార్టీని నమ్ముతారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం చేస్తే ప్రకటిస్తే అటు వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉందనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.


పోస్టల్‌ బ్యాలెట్‌పై ఆశలు 
కొంత కాలంగా పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉంటున్నందున, చాలా మంది ఓటు హక్కును వినియోగించుకోవడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా పోలీస్‌ డిపార్ట్‌మెంటు ఉద్యోగులు ఓటు వినియోగించుకునే అవకాశం దొరకడం లేదని సమాచారం.అయితే ఈ సారి మాత్రం ఎలక్షన్‌ కమిషన్‌ పోలింగ్‌ శాతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. నెల రోజుల నుంచి ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తుంది. కలెక్టర్‌ ధర్మారెడ్డి ప్రత్యేక చొరవతో గ్రామాల్లో, కాలేజీల్లో పర్యటిస్తూ ఓటు వినియోగ ఆవశ్యకతను తెలియజేశారు.

అలాగే రెవెన్యు సిబ్బంది, విద్యాశాఖ సిబ్బంది, కళాకారులు ఓటు వినియోగం పై చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు, ఎన్నికల ఉత్తర్వులతో పాటు, పోస్టల్‌ బ్యాలెట్‌ పొందేందుకు ఫారం 12లను కూడా పంపిణీ చేశారు. ఈనెల 30 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేరీ కావడంతో మొదట అందజేసిన ఫారం 12లను నింపి తిరిగి సమర్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఈ సారి పోస్టల్‌ బ్యాలెట్‌ అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే ఓ శక్తిగా మారే అవకాశం ఉంది. అందుకే రాజకీయ పార్టీలు ఉద్యోగుల డిమాండ్లకు స్పందిస్తున్నారని ఉద్యోగులు అంటున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement