ప్రజాస్వామిక నిరసన.. నోటా! | People's Weapon in Election is NOTA | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 26 2018 4:28 PM | Last Updated on Mon, Nov 26 2018 6:47 PM

People's Weapon in Election is NOTA - Sakshi

(సాక్షి వెబ్ ప్రత్యేకం)
దశాబ్దం కిందట పురుడుపోసుకున్న ఒక ఆలోచన. ఐదేళ్ల కిందట అమలుకు నోచుకున్న ఒక ఆయుధం. ప్రజాస్వామిక పద్ధతిలో నిరసనకు కల్పించబడిన హక్కు. నిరసనకు జనం చేతిలో ఆయుధం. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులెవరూ నచ్చనప్పుడు తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి తెరమీదకొచ్చిన సరికొత్త మీట. అదే నోటా.

నన్ ఆఫ్ ది అబౌ (నోటా). రాజకీయ పార్టీల తరఫున పోటీ చేస్తున్న వారితో పాటు స్వతంత్రులుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులెవరికీ ఓటు వేయడం ఇష్టంలేనప్పుడు, పోటీ చేస్తున్న వారెవరూ నచ్చలేదని తెలియజెప్పే ఒక ప్రజాస్వామిక ఆయుధం. పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్)కు కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు ఇందుకు సంబంధించి కీలకమైన తీర్పు వెల్లడించింది. 27 సెప్టెంబర్ 2013 రోజున సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం 11 అక్టోబర్ 2013 నుంచి నోటాను ప్రవేశపెట్టింది. నోటా అమలు చేస్తున్న వాటిల్లో మనది 14 వ దేశం.

నోటాకూ ఒక గుర్తు
ఓటర్లలో అక్షరాస్యత తక్కువగా ఉండటం, ఓటర్లలో అవగాహన లేకపోవడం వంటి కారణంగా  ఆయా రాజకీయ పార్టీలకు కేటాయించినట్టే నోటాకూ ఒక గుర్తు ఉండాలని ప్రజాసంఘాలు, సామాజిక కార్యకర్తల నుంచి పెద్దఎత్తున డిమాండ్ వచ్చింది. దాంతో నోటాకూ ఒక గుర్తు కేటాయించాలని 2015 లో ఎన్నికల సంఘం తీర్మానించింది. అహ్మదాబాద్కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడి) రూపొందించిన గుర్తును నోటాగా కేటాయిస్తూ ఎన్నికల సంఘం  18 సెప్టెంబర్ 2015 న ఆదేశాలు జారీ చేసింది. . ఈవీఎంలలో అభ్యర్థుల పేర్లు, వాటిపక్కన గుర్తు లు ఉన్నట్టుగా చూపించే చిత్రంపై ఇంటూ మార్క్ తో అడ్డంగా కొట్టివేసినట్టుగా చూపించేదే నోటా గుర్తు.

ఈ ప్రజాస్వామిక నిరసన హక్కు ఓటర్లకు ఆయుధంగా ఉపయోగపడుతుందా? ఓటర్లు ఆశించిన లక్ష్యం నెరవేరుతుందా? అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే ఏదైనా ఒక నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులకన్నా నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ప్రజల ప్రజాస్వామిక నిరసన ఫలిస్తుందా? అంటే అలా జరగదు. నోటాకు అత్యధికంగా ఓట్లు నమోదైనప్పటికీ ఆ తర్వాత క్రమంలో అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థిని గెలిచినట్టుగా ప్రకటిస్తారు. అయితే, నోటా ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అలాంటి సందర్భాలు ఎదురుకాలేదు. అలాంటి పరిస్థితి ఉత్పన్నమైతే మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్న డిమాండ్పైన చర్చకు ఆస్కారం కలుగుతుంది. నోటా ప్రవేశపెట్టినప్పటి నుంచి కొందరు దానికి ఓటు వేయడం గమనించాం. ఇప్పుడు కొందరు నోటాకు ఓటు వేయాలంటూ ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఎన్నికల్లో అదీ ఒక గుర్తే... దానికి ప్రచారం చేయొచ్చా? చేయరాదా ? అన్నింటిలాగే నోటాకూ ప్రచారం చేయొచ్చు. అలా చేస్తున్న వారి సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతోంది కూడా.

తొలిసారి ఇవే రాష్ట్రాల్లో
2013లో చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాంలతో పాటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి నోటా ఉపయోగించారు. (ఢిల్లీ శాసనసభకు ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు జరిగాయి), అప్పట్లో ఈ రాష్ట్రాల్లో 1.85 శాతం ఓట్లు నోటాకు నమోదయ్యాయి. సరిగ్గా ఐదేళ్ల తర్వాత ఆ నాలుగు రాష్ట్రాలకు మళ్లీ ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి.

ఇకపోతే, 2014 సాధారణ ఎన్నికల్లో 1.1 శాతం ఓట్లు నోటాకు నమోదయ్యాయి. ఒక్కో ఎన్నికలో ఒక్కో తీరులో ఓట్లు నోటాకు పోలయ్యాయి. 2014 లో కొన్ని రాష్ట్రాలు హర్యానా, జార్ఘండ్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిస్సా, అరుణాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో నోటాకు (2.02 శాతం) పడిన ఓట్లు పెరిగాయి. 2015 లో ఢిల్లీ, బీహార్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో 0.40 శాతం నోటాకు పోలైతే బీహార్లో మాత్రం 2.49 శాతం నమోదయ్యాయి. 2016లో అసోం, పశ్చిమ బెంగాల్, కేరళ, పాండిచ్చేరి, తమిళనాడు ఎన్నికల్లో మొత్తంగా 1.6 శాతం ఓట్లు నోటాకు మీటపై పడ్డాయి.  

అక్టోబర్ 2013 నుంచి మే 2016 మధ్య కాలంలో దేశంలో జరిగిన ఎన్నికల ఓటింగ్ సరళిని విశ్లేషించినప్పుడు... గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లోనే నోటాకు ఎక్కువ ఓట్లు నమోదుకావడం గమనార్హం. ప్రత్యేకించి ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. లండన్ కింగ్స్ కాలేజీకి చెందిన గరిమా గోయల్ తన పరిశోధనా పత్రంలో ఈ విషయం వెల్లడించినట్టు ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ పేర్కొంది. గిరిజనులు ప్రత్యేకంగా ఎక్కడయితే తమ కమ్యూనిటికి ప్రాతినిథ్యం ఉండటం లేదో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా నోటాకు నమోదవుతున్నట్టు వెల్లడైంది. అలాగే, వామపక్ష తీవ్రవాద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ ఈ పరిస్థితి కనిపిస్తోంది. గడ్చిరోలీ, జార్గ్రామ్, కల్యాణ్ (రూరల్), జగన్నాథ్పూర్, చాత్ర, ఉమర్కోట్, ఛత్తర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా నోటాకు ఓట్లు నమోదయ్యాయి. లోక్సభ నియోజకవర్గాల విషయానికొస్తే 2014 ఎన్నికల్లో బస్తర్, నీల్గిరీస్, నబరంగ్పూర్ నియోజకవర్గాల్లో ఎక్కువగా వచ్చాయి. ఈ ప్రాంతాల్లో  వామపక్ష తీవ్రవాద ప్రభావం అధికంగా ఉన్న విషయం తెలిసిందే. ఇకపోతే, ఎక్కడైతే ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీజేపీల మధ్య ముఖాముఖి పోటీ ఉందో ఆ ప్రాంతాల్లో కూడా నోటాకు వచ్చిన ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు కొన్ని గణాంకాలు సూచిస్తున్నాయి. అందుకు కారణంగా ప్రధాన రాజకీయ ప్రత్యర్థులైన ఈరెండు పార్టీలకు వ్యతిరేకంగా ఇవి నమోదవుతున్నాయన్న వాదన వినిపిస్తున్న వారూ ఉన్నారు.

మొత్తంమీద ఏ నియోజకవర్గంలో చూసిన 1 నుంచి 3 శాతంకు మించి నోటాకు ఓట్లు పడలేదు. నోటా ప్రవేశపెట్టిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ఓట్లు నోటాకొస్తాయని అంచనా వేశారు. పైగా పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత ఎక్కువ ఉంటుంది. పైగా రాజకీయాల్లో నేర చరిత కలిగిన వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో నోటాకు ఎక్కువ ఓట్లు పడుతాయని అంచనాకు రావొచ్చు. కానీ అందరి అంచనాలకు పట్టణ ప్రాంతాలకన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే నోటాకు ఎక్కువ ఓట్లు నమోదవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉండటం గమనార్హం.

నోటా ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు వచ్చిన ఫలితాల సరళిని బట్టి ‘‘పై వారెవరికీ ఓటు వేయదలచుకోలేదని’’ (నోటాకు వేస్తున్న) చెప్పే వారి సంఖ్య అంతగా ఉండటం లేని కారణంగా నోటా పెద్ద చర్చనీయాంశం కాలేదు. ఈ రకమైన ప్రజాస్వామిక నిరసన ఒక సాధనంగా మాత్రమే మిగిలిపోతోంది. అందుకే ‘‘నన్ ఆఫ్ ది అబో’’ (నోటా) తరహాలో యాంత్రికమైన సాధనంగా కాకుండా ‘‘ రైట్ టు రిజెక్ట్ ’’ (తిరస్కరించే హక్కు) ఉండాలని కోరుతున్నవాళ్లూ ఉన్నారు. నోటా స్థానంలో  అభ్యర్థిని పూర్తిగా తిరస్కరించే హక్కు (రైట్ టు రిజెక్ట్) కల్పించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో ఒక ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది.

తెలంగాణలో నోటా తీరు
2014 అసెంబ్లీ ఎన్నికల్లో (ఉమ్మడి రాష్ట్రంలో జరిగాయి) తెలంగాణలోని 119 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 1,51,731 ఓట్లు నోటాకు పడ్డాయి. అంటే ప్రతి నియోజకవర్గంలో సగటున 1275 ఓట్లు నోటాకు నమోదయ్యాయన్నమాట. రెండు వేలు ఆ పైన నోటాకు ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు 11  ఉన్నాయి. అలాగే వెయ్యి నుంచి రెండు వేల మధ్యన నోటాకు పోలైన నియోజకవర్గాలు 67 ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో అత్యధికంగా నోటా ఓట్లు పోలయ్యాయి. ఇకపోతే, పోస్టల్ బ్యాలెట్ల తీరు పరిశీలించినప్పుడు 19 నియోజకవర్గాల్లో నోటాకు ఒక్క ఓటు కూడా పడలేదు. పది అంతకన్నా ఎక్కువ ఓట్లు నోటాకు పోలైన నియోజకవర్గాలు 13 ఉన్నాయి. అత్యధికంగా తాండూరులో పోలైన పోస్టల్ బ్యాలెట్లలో అత్యధికంగా 25 మంది నోటాకు ఓటు వేశారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా, అత్యల్పంగా నోటాకు ఓట్లు నమోదైన పది నియోజకవర్గాలు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement