ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా
Published Sat, Oct 5 2013 2:06 AM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సమర భేరీ మోగింది. ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్‌గఢ్‌లలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. 2014 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఈ ఎన్నికలను అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 11, 19న రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. మిగతా నాలుగు రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 25, రాజస్థాన్‌లో డిసెంబర్ 1, ఢిల్లీ, మిజోరాంలో డిసెంబర్ 4న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్(సీఈసీ) వీఎస్ సంపత్ తెలిపారు. డిసెంబర్ 8న ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు చేపడతామని చెప్పారు.
సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పునకు అనుగుణంగా నచ్చని అభ్యర్థులను తిరస్కరించే హక్కును మొట్టమొదటిసారిగా ఈ ఎన్నికల్లో ఓటరుకు కల్పించనున్నారు. ఈవీఎం మిషన్లలో ‘పైవారు ఎవరూ కాదు’ అన్న మీటను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఐదు రాష్ట్రాల్లో 630కిపైగా నియోజకవర్గాల్లో సుమారు 11 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారని వీఎస్ సంపత్ వివరించారు. ఇందుకు 1.30 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. వివిధ కేసుల్లో దోషులుగా తేలి అనర్హతకు గురైన ఎంపీల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారా అని విలేకరులు ప్రశ్నించగా.. లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ఆయా స్థానాలను నోటిఫై చేసిన తర్వాతే తాము ఖాళీలను ప్రకటిస్తామని చెప్పారు.
విజయంపై కాంగ్రెస్, బీజేపీ ధీమా
ఐదు రాష్ట్రాల్లో తామే విజయం సాధిస్తామని అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు ధీమా వ్యక్తంచేశాయి. తమ విధానాలు, పథకాలే విజయాన్ని కట్టబెడతాయని కాంగ్రెస్ పేర్కొనగా.. ఎన్నికల్లో మోడీ ప్రభంజనం ఖాయమని బీజేపీ ఉద్ఘాటించింది. ‘‘సెమీ ఫైనల్, క్వార్టర్ ఫైనల్ ఏమీ ఉండవు. మాకు ఏ ఎన్నికలైనా ఫైనలే. మా పథకాలు, విధానాలతో ప్రజల్లోకి వెళ్తాం. వారే తీర్పు చెబుతారు’’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మీమ్ అఫ్జల్ పేర్కొన్నారు. నరేంద్ర మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినందున ఈ ఎన్నికలను 2014 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పుగా చూస్తారా అని ప్రశ్నించగా.. ‘‘మేం ఏ ఒక్కరినో దృష్టిలో ఉంచుకొని ఎన్నికలకు వెళ్లం..’’ అని ఆయన బదులిచ్చారు. ఐదు రాష్ట్రాల్లో తామే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌కు చెందిన మరో నేత రషీద్ అల్వీ అన్నారు.
నరేంద్రమోడీ అంశం ఈ ఎన్నికల్లో తమకు తప్పకుండా కలిసి వస్తుందని బీజేపీ ప్రతినిధి సుధాంశు త్రివేది చెప్పారు. ‘‘ఈ దేశంలో మోడీయే అత్యంత ప్రజాదరణ కలిగిన నేత అని అనేక సర్వేల్లో తేలింది. అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రాల అంశాల ఆధారంగా జరుగుతాయి. అయినా జాతీయ పరిణామాలు కూడా తమ వంతు పాత్ర వహిస్తాయి’’ అని త్రివేదీ వివరించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో తమ ప్రభుత్వ సుపరిపాలన మళ్లీ పార్టీకి అధికారాన్ని అందిస్తుందని, ఇక రాజస్థాన్, ఢిల్లీలో కాంగ్రెస్ వ్యతిరేకత లాభిస్తుందని వివరించారు. నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, మిజోరాంలో గట్టి పోటీ ఇస్తామని చెప్పారు. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఢిల్లీ, రాజస్థాన్, మిజోరాంలలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ అధికారంలో ఉంది.
మంచి వాతావరణంలో ఎన్నికలు జరగాలి: మోడీ
ఐదు రాష్ట్రాలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ స్వాగతించారు. ‘‘మన ప్రజాస్వామ్యానికి ఎన్నికలు అంటే పండుగ లాంటివి. ఈ ఎన్నికలు స్ఫూర్తిదాయకమైన వాతావరణంలో జరగాలని కోరుకుంటున్నా’’ అని ట్విట్టర్‌లో ఆయన వ్యాఖ్యానించారు.
Advertisement