VS Sampath
-
తిరుపతి ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
తిరుపతి: తిరుపతి అసెంబ్లీ స్థానానికి శుక్రవారం జరిగే ఉప ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందులో భాగంగానే ఎన్నికల సిబ్బందికి ఈవీఎం బాక్సులను అందజేశారు. మొత్తం 265 కేంద్రాలున్న తిరుపతి అసెంబ్లీకి భారీ బందో బస్తును ఏర్పాటు చేశారు.1800 మంది పోలీసులను అక్కడికి తరలించారు. ఇదిలా ఉండగా ప్రతీ పోలింగ్ కేంద్రంలోను వెబ్ కెమెరాలను అమర్చారు. ఈ ఎన్నికల ఫలితాలను ఈనెల 16 న ప్రకటించనున్నారు. తిరుపతి ఎమ్మెల్యే మన్నేరు వెంకటరమణ గతేఏడాది అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. -
కొత్త సీఈసీగా హరిశంకర్ బ్రహ్మ
ఈ నెల 25న ఈఆర్‌ఎంఎస్ ప్రారంభం న్యూఢిల్లీ: దేశ 19వ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా హరిశంకర్ బ్రహ్మ(64) శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం తన ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ప్రపంచం దృష్టి అంతా ప్రస్తుతం ఢిల్లీపై ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు సీఈసీగా ఉన్న వీఎస్ సంపత్ గురువారం పదవీవిరమణ చేశారు. అత్యుత్తమ సేవలందించడం ఎన్నికల సంఘం దీర్ఘకాలిక లక్ష్యమని బ్రహ్మ వివరించారు. ఎన్నికల నిర్వహణను మెరుగుపర్చేందుకు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవాలన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జనవరి 25న ఎన్నికల సంఘం ‘ఎలక్ట్రానిక్ రోల్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఈఆర్‌ఎంఎస్)’ను దేశవ్యాప్తంగా ప్రారంభిస్తోందని వెల్లడించారు. ఇటీవలి సుప్రీంకోర్టు నిర్దేశాల మేరకు ప్రవాస భారతీయులకు ఈ- ఓటింగ్ ద్వారా ఓటుహక్కు కల్పించేందుకు ఈసీ రంగం సిద్ధం చేస్తోందన్నారు. 1975 ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి బ్రహ్మ అసోంకు చెందినవారు. ఈ ఏప్రిల్ 19తో ఆయనకు 65 ఏళ్లు నిండనుండటంతో అప్పటివరకు మాత్రమే ఆయన సీఈసీగా ఉంటారు. ముందే నిషేధించాలి: వీఎస్ సంపత్ హత్య తదితర తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని ఎన్నికల సంఘం సిఫారసు చేసిందని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్ వెల్లడించారు. అలాగే, చెల్లింపు వార్తలను(పెయిడ్ న్యూస్) ఎన్నికల నేరంగా పరిగణించాలని కూడా ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్లు సంపత్ గురువారం తెలిపారు. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల ఖర్చుపైనా పరిమితి విధించాలని సిఫారసు చేశామన్నారు. శిక్ష పడిన తరువాత నిషేధించడం కాకుండా.. కోర్టుల్లో ఐదేళ్లు, లేదా అంతకన్నా ఎక్కువ శిక్ష పడే అవకాశమున్న కేసులున్న వ్యక్తులందరినీ ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించడం ద్వారా రాజకీయాల్లో నేరచరితుల ప్రవేశాన్ని అడ్డుకోవచ్చన్నారు. ఎన్నికల సంస్కరణలకు సంబంధించి చాన్నాళ్లుగా ఈసీ ఈ డిమాండ్ చేస్తోందని.. ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సంబంధిత సవరణ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఆరేళ్లపాటు సంపత్ ఎన్నికల కమిషనర్‌గా సమర్థ్ధవంతంగా విధులు నిర్వర్తించారు. సంపత్ చేసిన మరికొన్ని వ్యాఖ్యలు.. ఎన్నికల కోడ్‌ను చట్టంగా మార్చే ప్రతిపాదనకు ఈసీ వ్యతిరేకం నా హయాంలో ఓటరు కేంద్రంగా ఈసీ మారడం సంతృప్తినిచ్చింది రాజకీయ పార్టీలకు వచ్చే నిధుల విషయంలో పారదర్శకత లేదు. సంబంధిత చట్టం చాలా బల హీనంగా, అసంపూర్తిగా ఉంది. భారత్‌లో రాజకీయ పార్టీల నియంత్రణకు సమగ్ర చట్టం లేదు లోక్‌సభ ఎన్నికల సమయంలో వారణాసిలో నరేంద్రమోదీ పాల్గొంటున్న ర్యాలీకి అనుమతి నిరాకరించడం తప్పని భావించడం లేదు. -
సీఈసీగా బాధ్యతలు చేపట్టనున్న హెచ్ ఎస్ బ్రహ్మ
న్యూఢిల్లీ: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా హెచ్.ఎస్. బ్రహ్మ శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఈ పదవిలో ఏప్రిల్ 18వ తేదీ వరకు కొనసాగనున్నారు. అసోం రాష్ట్రానికి చెందిన బ్రహ్మ 1975 ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఇప్పటి వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న విఎస్ సంపత్ గురువారం పదవి విమరణ చేశారు. దాంతో ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా హెచ్ ఎస్ బ్రహ్మను కేంద్రప్రభుత్వం ఎంపిక చేసింది. సంపత్ కూడా 1975 ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారే. ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవిని చేపట్టిన రెండో వ్యక్తి హెచ్ ఎస్ బ్రహ్మ. గతంలో అదే ప్రాంతానికి చెందిన జెఎం లింగ్డో పదవిని చేపట్టిన విషయం విదితమే. -
సీఈసీగా బాధ్యతలు చేపట్టనున్న బ్రహ్మ
-
రేపు వి.ఎస్ సంపత్ పదవీ విరమణ
న్యూడిల్లీ: కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ వి.ఎస్. సంపత్ పదవీ విరమణ చేయనున్నారు. రేపటితో ఆయన పదవీకాలం పూర్త అవుతుంది. 2012 లో ప్రధాన ఎన్నికల కమీషనర్ గా ఆయన భాద్యతలు స్వీకరించారు. 1973 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్ అధికారి అయిన సంపత్ చురుకైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఎలక్షన్ కమిషనర్ గా పనిచేసిన అనుభవమున్న ఆయన... అంతకుముందు కేంద్ర విద్యుత్తుశాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు. 2009లో ఈసీగా ఎన్నికైన సంపత్ సీనియర్ ఎన్నికల కమిషనర్‌గా పనిచేశారు. సంపత్ ఆధ్వర్యంలోనే కీలకమైన 2014 సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆఖరిగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ను వీఎస్ సంపత్ విడుదల చేశారు. -
ఫిబ్రవరి 13 న తిరుపతి ఉప ఎన్నికలు
తిరుపతి : తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి వి.ఎస్. సంపత్ షెడ్యూల్ విడుదల చేశారు. ఎన్నికలు ఫిబ్రవరి 13 న తేదిన నిర్వహించి, ఫలితాలు 16 వతేదిన ప్రకటిస్తారు. నోటిఫికేషన్- జనవరి 19 నామినేషన్లకు చివరి తేదీ- జనవరి 27 నామినేషన్ల ఉపసంహరణ- జనవరి 30 ఎన్నికలు- ఫిబ్రవరి 13 కౌంటింగ్- ఫిబ్రవరి 16 తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే మన్నేరు వెంకటరమణ గతేఏడాది అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి -
ఫిబ్రవరి 7న ఢిల్లీ ఎన్నికలు.. 10న ఫలితాలు!
-
ఫిబ్రవరి 7న ఢిల్లీ ఎన్నికలు.. 10న ఫలితాలు!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికలు ఫిబ్రవరి 7వ తేదీన నిర్వహించి, 10వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. ఈ విషయాన్ని ఎన్నికల ప్రధానాధికారి వి.ఎస్. సంపత్ ప్రకటించారు. ముఖ్యమైన తేదీలు ఇలా ఉన్నాయి.. నోటిఫికేషన్ తేదీ - 14 జనవరి నామినేషన్ల దాఖలుకు తుది గడువు - 21 జనవరి నామినేషన్ల పరిశీలన - 22 జనవరి నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు - 24 జనవరి ఎన్నికలు - 7 ఫిబ్రవరి కౌంటింగ్ - 10 ఫిబ్రవరి ఎన్నికల ప్రక్రియ ముగించాల్సిన తేదీ -12 ఫిబ్రవరి ''మొత్తం ఉన్న 70 నియోజవర్గాలలో 12 రిజర్వు అయి ఉంటాయి. అన్ని ఈవీఎంలలోను నోటా తప్పనిసరిగా ఉండాలి. సుప్రీం ఉత్తర్వుల ప్రకారం అఫిడవిట్లో అన్ని కాలమ్‌లను అభ్యర్థులు పూర్తిచేయాలి. దేన్నయినా ఖాళీగా వదిలేస్తే.. రిటర్నింగ్ అధికారులు ఓ నోటీసు ద్వారా చెబుతారు. అప్పుడూ స్పందించకపోతే నామినేషన్ తిరస్కరిస్తారు. అన్ని రకాల పరిశీలకులను మోహరించి, ఎన్నికల వ్యయం, ఇతర ఘటనలపై నిఘా ఉంచాలి. ఢిల్లీ మెట్రోపాలిటన్ ప్రాంతంలో డబ్బు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అక్కడ మరింత నిఘా ఏర్పాటుచేయాలి. ఫ్లయింగ్ స్క్వాడ్లు, వీడియో సర్వయలెన్స్, ఆదాయపన్ను ఉన్నతాధికారుల మోహరింపు తప్పనిసరి. గుర్తించిన ప్రాంతాల్లో మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేయాలి. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులంతా అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుతున్నాం. వారి ప్రవర్తనను అత్యంత నిశితంగా పరిశీలిస్తాం. ఏదైనా అవకతవకలు కనిపిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం. వాతావరణ పరిస్థితులు, విద్యా సంవత్సరం, పండుగలు, శాంతిభద్రతలు.. అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని షెడ్యూలు నిర్ణయించాం'' అని సంపత్ తెలిపారు. -
జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్‌లలో మోగిన ఎన్నికల నగారా
-
జార్ఖండ్, కాశ్మీర్ ఎన్నికల షెడ్యూలు విడుదల
-
జార్ఖండ్, జమ్ము కాశ్మీర్ ఎన్నికల షెడ్యూలు విడుదల
జార్ఖండ్, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎస్. సంపత్ షెడ్యూలు విడుదల చేశారు. జార్ఖండ్ రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకు, జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని 87 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలు నవంబర్ 25వ తేదీ నుంచి మొదలవుతాయి. ఓట్ల లెక్కింపు, ఫలితాల విడుదల డిసెంబర్ 23న ఉంటాయి. వీటితో పాటు ఢిల్లీ అసెంబ్లీలోని మెహరోలి, తుగ్లకాబాద్, కృష్ణానగర్ అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతాయి. ఇవి జమ్ము కాశ్మీర్ తొలిదశతో పాటు జరుగుతాయి. రెండు రాష్ట్రాల్లోను నోటాకు కూడా అవకాశం ఉంటుంది. జమ్ము కాశ్మీర్లో మొత్తం 10,050 పోలింగ్ కేంద్రాలుంటాయి. జార్ఖండ్ లో మొత్తం 24,648 పోలింగ్ కేంద్రాలుంటాయి. ముఖ్యమైన తేదీలివీ... రెండు రాష్ట్రాలకు తొలిదశ ఎన్నికలు - నవంబర్ 25 రెండు రాష్ట్రాలకు రెండోదశ ఎన్నికలు - డిసెంబర్ 2 రెండు రాష్ట్రాలకు మూడోదశ ఎన్నికలు - డిసెంబర్ 9 రెండు రాష్ట్రాలకు నాలుగోదశ ఎన్నికలు - డిసెంబర్ 14 రెండు రాష్ట్రాలకు ఐదోదశ ఎన్నికలు - డిసెంబర్ 20 రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు - డిసెంబర్ 23 -
నేరచరితులను డిబార్ చేయండి
కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన ఈసీ న్యూఢిల్లీ: ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా తీవ్రమైన నేరాలు చేసిన అభ్యర్థుల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ప్రతిపాదనలు సిద్ధంచేసింది. తీవ్రమైన నేరాల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని ఎన్నికల్లో పోటీ నుంచి నిషేధించే విధంగా రూపొందించిన ప్రతిపాదనలను ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అలాగే తప్పుడు అఫిడవిట్లు ఇచ్చిన వారిపై కూడా అనర్హత వేటు వేయడానికి నిబంధనలు సిద్ధం చేసింది. తీవ్రమైన నేరాల్లో దోషులుగా తేలిన వారిని తక్షణం అనర్హులను చేయాలనే సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈసీ ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నేరాభియోగాలు ఎదుర్కొంటూ కనీసం ఐదేళ్లు జైలు శిక్ష పడే కేసుల్లోని వ్యక్తులపై అనర్హత వేటు వేసే దిశగా చేసిన ప్రతిపాదనలను కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖకు పంపినట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వీఎస్ సంపత్ పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. సదరు అభియోగాలను ఎన్నికల తేదీకి కనీసం ఆరు నెలల ముందు మెజిస్ట్రేట్ నమోదు చేసి ఉండాలనే నిబంధన కూడా జతచేశామన్నారు. దీని వల్ల రాజకీయ దురుద్దేశంతో ఈ నిబంధనలను దుర్వినియోగం చేసేవారికి అడ్డుకట్ట వేయవచ్చన్నారు. తమ ప్రతిపాదనలను న్యాయమంత్రిత్వ శాఖ.. ఎన్నికల సంస్కరణలకు సిఫార్సులు చేసే లా కమిషన్‌కు పంపుతుందని సంపత్ తెలిపారు. -
అనర్హతకు పార్టీ గుర్తింపుతో సంబంధం లేదు: ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఒక పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు పడుతుందని, దీనికి పార్టీ గుర్తింపుతో సంబంధం ఉండదని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం.. ఒక పార్టీ గుర్తుపై పోటీచేసి గెలిచాక మరో పార్టీలో చేరితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుందని, వ్యక్తి వీడిపోతున్న రాజకీయ పార్టీకి గుర్తింపు ఉందా? లేదా అనే అంశాలతో సంబంధం ఉండదని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) వీఎస్ సంపత్ తేల్చి చెప్పారు. వైఎస్సార్సీపీ నుంచి నంద్యాల ఎంపీగా గెలుపొందిన ఎస్పీవై రెడ్డి ఆదివారం టీడీపీలో చేరిన నేపథ్యంలో అనర్హత అంశాలపై తనను ఫోన్లో సంప్రదించిన మీడియా ప్రతినిధులకు ఆయన ఈమేరకు వివరణ ఇచ్చారు. -
పార్టీ మారితే అనర్హత వేటు: సంపత్
న్యూఢిల్లీ: రాజకీయపార్టీ గుర్తింపుతో సంబంధం లేకుండా అనర్హత వేటు వర్తిస్తుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సంపత్ స్పష్టం చేశారు. ఒక రాజకీయ పార్టీ గుర్తుతో గెలిచి పార్టీ మారితే అనర్హత వేటు వర్తిస్తుందన్నారు. రాజకీయ పార్టీకి గుర్తింపు ఉందా, లేదా అనే అంశంతో సంబంధంలేకుండా అనర్హత వేటు పడుతుందని ఆయన అన్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఒక గుర్తుపై గెలిచి మరొక పార్టీలోకి వెళ్తే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వర్తిస్తుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సంపత్ తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి టీడీపీలో చేరిన నేపథ్యంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సంపత్ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. -
రాజ్యాంగ సంస్థలను విశ్వసించండి: సీఈసీ
న్యూఢిల్లీ: రాజ్యాంగ వ్యవస్థల పట్ల విశ్వా సం కలిగిఉండాలని రాజకీయ పార్టీలకు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వీఎస్ సంపత్ సూచించారు. ‘శేషన్ వస్తారు.. వెళ్తారు. సంపత్ వస్తారు.. వెళ్తారు.. కానీ ఎన్నికల సంఘం అనే రాజ్యాం గ సంస్థ నిరంతరాయంగా కొనసాగుతుంది’ అని అన్నారు. తమ పట్ల ఎన్నికల సంఘం వివక్ష చూపుతోందన్న బీజేపీ విమర్శలపై గురువారం సంపత్ పైవిధంగా స్పందిం చారు. గాంధీనగర్‌లో తమ పార్టీ ఎన్నికల చిహ్నాన్ని మోడీ ప్రదర్శించడం.. ఎవరికి ఓటేశామన్నదాన్ని రహస్యంగా ఉంచాలన్న నిబంధనను అమేథీలో రాహుల్‌గాంధీ ఉల్లంఘించడం.. ఈ రెండు వేరువేరు అంశాలనీ, వాటి ఆధారంగా ఎన్నికల సంఘం వివక్ష చూపిందనడం సరికాదని సంపత్ వ్యాఖ్యానించారు. దీనిపై రాహుల్‌కు క్లీన్చిట్ ఇవ్వడంపై బీజేపీ ఈసీపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. -
రాహుల్ గాంధీపై కేసు పెట్టలేదు: సీఈసీ
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషనర్ల మధ్య ఎటువంటి విభేదాలు లేవని ప్రధాన కమిషనర్ వీఎస్ సంపత్ తెలిపారు. వారణాసి లేదా ఏ ఇతర నిర్ణయాల్లో తమ మధ్య అభిప్రాయభేదాలు తలెత్తలేదని వెల్లడించారు. కమిషన్ ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. వారణాసి సహా తాము తీసుకున్న అన్ని నిర్ణయాల్లో ఎన్నికల కమిషనర్ హెచ్ ఎస్ బ్రహ్మ కూడా ఉన్నారని తెలిపారు. ఎన్నికల సంఘం పక్షపాత వైఖరితో వ్యవహరిస్తుందన్న బీజేపీ ఆరోపణలను సంపత్ తోసిపుచ్చారు. అమేథీలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేసు పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. -
ఓట్లు పోటెత్తిస్తాం: వి.ఎస్.సంపత్
ఓటింగ్ శాతం పెంపునకు చర్యలు: వి.ఎస్.సంపత్ సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు నిష్పాక్షికంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించడానికి, ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని గణనీయంగా పెంచడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) వీఎస్ సంపత్ చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులు, ఆదాయపు పన్ను అధికారులతో ఎన్నికల ఏర్పాట్లను శనివారం సమీక్షించిన అనంతరం జూబ్లీహాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్లు హెచ్.ఎస్.బ్రహ్మ, ఎస్.ఎన్.ఎ. జైది, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ఎన్నికల సంఘం సీనియర్ అధికారులతో కలిసి ఆయన మాట్లాడారు. ఆయన వెల్లడించిన విషయాల్లో ముఖ్యమైనవి ఇవీ.. మోడల్ బ్యాలెట్ పేపర్లను ప్రచారంలో వినిగించుకుంటామని వివిధ పార్టీలు కోరాయి. ఆయా పార్టీల గుర్తులతో మాత్రమే మోడల్ బ్యాలెట్లో ముద్రించి ప్రచారం చేసుకుంటే ఎన్నికల సంఘానికి అభ్యంతరం లేదు. కానీ ఇతర పార్టీల గుర్తులతో కూడిన మోడల్ బ్యాలెట్ వాడటానికి అంగీకరించం. ర్యాలీలు, సభలు నిర్వహించుకోవడానికి రాజకీయ పార్టీలకు సింగిల్ విండో సిస్టం ద్వారా అనుమతులు మంజూరు చేయనున్నాం. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తాం. అనుమతులు కోరిన 24 గంటల్లో నిర్ణయం వెల్లడించడానికి తగిన ఏర్పాట్లు చేయమని అధికారులను ఆదేశించనున్నాం. ఎన్నికలు నిష్పాక్షికంగా, శాంతియుతంగా నిర్వహించడానికి గట్టి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించాం. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 70,171 పోలింగ్ కేంద్రాల్లో 25,390 కేంద్రాలు(36 శాతం) సమస్యాత్మకమైనవిగా గుర్తించాం. ఆయా కేంద్రాల్లో భద్రతకు ప్రత్యేక చర్యలు చేపడతాం. ఓటర్లను భయభ్రాంతులను చేయడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించాలని అధికారులను ఆదేశించాం. ఓటర్లకు తగిన భద్రత కల్పించి నిర్భయంగా ఓటేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. పోలింగ్ రోజున ఓటర్లకు అవసరమైన భద్రత కల్పించడానికి మొబైల్ పార్టీలను ఏర్పాటు చేస్తాం. అక్రమ నగదు ప్రవాహంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. 101 శాసనసభ నియోజకవర్గాలను ఖర్చు అధికంగా ఉండే అవకాశం ఉన్నవి(ఎక్స్పెండిచర్ సెన్సిటివ్)గా గుర్తించాం. ఎన్నికల్లో ఖర్చు నియంత్రణకు, నగదు ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి వీలుగా విజిలెన్స్‌ను కట్టుదిట్టం చేయమని అధికారులను ఆదేశించాం. నగదు, బహుమతులు, ఇతర పద్ధతుల్లో ఓటర్లను ప్రలోభపెట్టడానికి అవకాశం లేకుండా తగిన చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేశాం. కట్టుదిట్టమైన విజిలెన్స్వల్ల రాష్ట్రంలో ఇప్పటివరకు రూ. 105 కోట్ల నగదు సీజ్ చేశాం. 1,142 కేసులూ నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా సీజ్ చేసిన నగదులో 46 శాతం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండటం గమనార్హం. 3.92 లక్షల లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు. 29,280 కేసులు నమోదయ్యాయి. నగదు, మద్యం ప్రవాహాన్ని అడ్డుకోవడానికి వీలుగా జిల్లా స్థాయిలో ఫిర్యాదుల సెల్ ఏర్పాటు చేయమని అధికారులను ఆదేశించాం. పోలింగ్‌కు ఒకరోజు ముందే ఓటర్ల స్లిప్పుల పంపిణీ పూర్తి చేస్తాం. మూడింట రెండు వంతుల పోలింగ్ స్టేషన్లలో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయనున్నాం. ఆయా స్టేషన్ల నుంచి వెబ్‌క్యాస్టింగ్ చేస్తాం. అక్రమాల నియంత్రణకు వెబ్‌క్యాస్టింగ్ దోహదం చేస్తుంది. పోలింగ్ శాతాన్ని పెంచే లక్ష్యంగా ఎన్నికల సంఘం పనిచేస్తోంది. పోలింగ్ సమయాన్ని గంట పెంచాం. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ఓటర్లను చైతన్యపరచడానికి ఇప్పటికే పలు చర్యలు చేపట్టాం. నైతిక విలువలకు కట్టుబడి ఓట్లు (ఎథికల్ ఓటింగ్)ను ప్రోత్సహించడానికి పలు కార్యక్రమాలు చేపట్టాం. ఈ విషయంలో మీడియా కూడా సహకారం అందించాలి. ఈ ఎన్నికల్లో ఎథికల్ ఓటింగ్ ఆకాంక్ష వాస్తవ రూపందాలుస్తుందని ఆశిస్తున్నాం. పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందికి, ఓటర్లకు కనీస వసతులు కల్పించాలని కలెక్టర్లను ఆదేశించాం. తాగునీరు, విద్యుత్, క్యూలైన్లలో నిలబడినప్పుడు నీడ కల్పించడం.. తదితర ఏర్పాట్లు చేయాలని సూచించాం. పోలింగ్ సమయంలో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగడానికి తగిన చర్యలు తీసుకోమని ట్రాన్సకో సీఎండీని ఆదేశించమని సీఎస్‌కు సూచించాం. సరిగా పనిచేయని(ఫాల్టీ) ఈవీఎంలు ఉన్నట్లు గుర్తిస్తే.. వీలయినంత త్వరగా మార్చి పోలింగ్‌కు ఆటంకం కలగకుండా చర్యలు చేపడతాం. ఏ పార్టీకి ఓటేసినా కాంగ్రెస్‌కే పడిన ఈవీఎం వ్యవహారం ఇటీవల పుణేలో వెలుగులోకి వచ్చిన విషయం వాస్తవమే. ఈవీఎంలకు పార్టీల గురించి తెలియదు. వాటికి నంబర్లు మాత్రమే తెలుసు. ఒక పార్టీకే ఓట్లు వెళ్లడానికి అవకాశం ఉండదు. మొత్తం ఈవీఎంల్లో 0.1 శాతం సరిగా పనిచేయనివి ఉంటాయి. కొన్ని మీడియా సంస్థలు కొన్ని పార్టీలు, అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని రాజకీయ పార్టీలు ఫిర్యాదుచేశాయి. నిష్పాక్షికంగా వ్యవహరించని పత్రికలు, చానళ్ల విషయంలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ)లు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాం. ప్రెస్ కౌన్సిల్, ఎన్బీఏ నిబంధనలు మీడియా సంస్థలకు వర్తిస్తాయి. పాత అసెంబ్లీ రద్దయి, కొత్త అసెంబ్లీ ఏర్పాటయ్యే వరకు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలే కొనసాగుతారు. కొత్త అసెంబ్లీ ఏర్పాటయిన తర్వాతే గెలిచినవారు ఎమ్మెల్యేలు అవుతారు. (మే 16కు ఫలితాలు వస్తాయి. జూన్ 2 వరకు కొత్త అసెంబ్లీలు ఏర్పాటు కావు. ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఉమ్మడి రాష్ట్రానికి చెందిన వారిగానే పరిగణిస్తారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.)రాష్ట్రంలో 6.48 కోట్ల మంది ఓటర్లున్నారు. అందులో 3.26 కోట్ల మంది పురుషులు, 3.22 కోట్ల మంది స్త్రీలు. 18-19 సంవత్సరాల యువత 33 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారు. రాష్ట్రంలో ఓటర్లందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేశాం. -
కులమతాల పేరుతో ప్రచారం చేస్తే కఠిన చర్యలు: వీఎస్ సంపత్
సాక్షి, తిరుమల: కులమతాల పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్ హెచ్చరిం చారు. ఓటరుగా పేరు నమోదు చేసుకునేందుకు ఆదివారమే ఆఖరి అవకాశమని, ప్రత్యేక పరిస్థితుల్లో ఇచ్చిన ఈ వెసులుబాటును అందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఇందుకు దేశవ్యాప్తంగా 9.3 లక్షల పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఓటర్ల జాబితాలో పేరు లేనివారు తమ నివాస ధ్రువీకరణ పత్రాలు, ఫొటో సమర్పించి ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని, వారంలోగా వాటిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. శనివారం కుమారుడితో కలసి సంపత్ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు. దేశమంతా విద్యార్థులకు పరీక్షలు, వాతావరణం, పండుగలు, భద్రతా పరిస్థితులు, సెలవులు ఇలా అన్నింటినీ పరిగణనలోకి తీసుకునే ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేశామన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారమే రాజకీయపార్టీలు, అభ్యర్థులు నడుచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మతం, కులం పేరుతో ఎన్నికల ప్రచారం చేసినా, నగదు పంపిణీ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కులాల పేరుతో రాజకీయ పార్టీలు ఏర్పాటైనా ఎన్నికల్లో మాత్రం ఆయా కులాల పేరుతో ఓట్లు అడగకూడదన్నారు. ఒకవేళ అలా ప్రచారం చేశారని తగిన సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ప్రస్తుతం కులాలు, మతాల పేరుతో ఏర్పాటైన పార్టీలకు ఎన్నికల కమిషన్ ఎలాంటి గుర్తింపు, అనుమతులు ఇవ్వట్లేదన్నారు. పార్టీలతో సంబంధం లేని వ్యక్తులు నగదు తీసుకెళ్తే అందుకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు రశీదులు వెంటే ఉంచుకోవాలని సూచించారు. స్వామి ఆశీస్సులందుకున్న సంపత్: సాధారణ భక్తుల్లాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ సంపత్ కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా రూ.300 టికెట్ల సుఫథం క్యూ నుంచి ఆలయానికి వచ్చారు. ధ్వజస్తంభానికి మొక్కుకొని, స్వామిని దర్శించుకున్నారు. తర్వాత వకుళమాతను దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేయగా, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ లడ్డూ ప్రసాదాలు సంపత్‌కు అందజేశారు. అనంతరం పుష్కరిణి జలాన్ని ప్రోక్షణం చేసుకున్నారు. భూ వరాహస్వామిని దర్శించుకున్నారు. తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కూడా సంపత్ దర్శించుకున్నారు. -
రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికల నిర్వహణ: సీఈసీ
* హైదరాబాద్ వచ్చిన సంపత్.. నేడు తిరుమలకు సాక్షి, హైదరాబాద్: స్థానిక ఎన్నికలు ఉన్నప్పటికీ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ తేదీల్లో ఎలాంటి మార్పులుండవని జాతీయ ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్ స్పష్టం చేశారు. రెండురోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన శుక్రవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ఉండడంవల్ల సార్వత్రిక ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని చెప్పారు. శనివారం ఉదయం ఇక్కడి నుంచి తిరుపతి బయలుదేరనున్నట్లు ఆయన చెప్పారు. విమానాశ్రయంలో సంపత్‌కు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ స్వాగతం పలికారు. లేక్‌వ్యూ అతిథి గృహంలో బస చేసిన సంపత్‌కు రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు చేసిన ఏర్పాట్లను భన్వర్‌లాల్ వివరించారు. ఆయన శనివారం ఉదయం బయలుదేరి తిరుమల వెళ్లనున్నారు. అక్కడి నుంచి ఢిల్లీ నేరుగా వెళ్తారు. -
మున్సి‘పోల్’ ఆపాలని మేం కోరం
* ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో సీఈసీ సంపత్ స్పష్టీకరణ * వాళ్ల ఎన్నికలు వాళ్లవి.. మా ఎన్నికలు మావి * ‘ఫలితాల ప్రభావం’పై అభ్యంతరాలు వస్తే పరిశీలిస్తాం సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూలు విడుదల చేసినందున.. ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను ఆపాలని తాము రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను అడగబోమని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎస్.సంపత్ పేర్కొన్నారు. మున్నిపల్ ఎన్నికల ఫలితాల ప్రభావం సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందని గానీ, ఫలితాలు ఆపాలని గానీ తమకు విజ్ఞప్తులు వచ్చినప్పుడు వాటిని పరిశీలిస్తామని చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో ఫలానా రీతిలో వ్యవహరించాలన్న నిబంధనలేవీ లేవని ఆయన పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సాక్షి: రాష్ట్రంలో తొలిసారిగా ఒకేసారి మున్సిపల్ ఎన్నికలు, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ మొత్తం ప్రక్రియను సక్రమంగా నిర్వహించేందుకు యంత్రాంగం సరిపోతుందా? ఈ కొత్తరకమైన పరిస్థితిని ఎన్నికల సంఘం ఎలా చూస్తోంది? సీఈసీ: మున్సిపల్ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది. వారి యంత్రాంగాన్ని వారు చూసుకుంటారు. వాటికి సార్వత్రిక ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధం లేదు. ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేలా యంత్రాంగం అందుబాటులో ఉంది. రాష్ట్రంలో దాదాపు 35 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల నిర్వహణకు ఒకవేళ యంత్రాంగం చాలదని వినతులు వస్తే షెడ్యూలులో మార్పులు ఉంటాయా? సీఈసీ: పరీక్షలు, యంత్రాంగం అన్నీ బేరీజు వేసుకునే షెడ్యూలు కసరత్తు చేశాం. దాంట్లో ఎలాంటి మార్పులు ఉండబోవు. సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఏప్రిల్ 2వ తేదీన వెలువడనున్నాయి. ఈ ఫలితాల ప్రభావం సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లపై పడుతుందనే వాదన ఉంది. అందువల్ల ఫలితాలను వాయిదావేసే అవకాశం ఉందా? మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మాకు సమాచారం లేదు. వాళ్ల ఎన్నికలను ఆపాలని మేం కోరం. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ. వాళ్ల ఎన్నికలు వాళ్లవి. మా ఎన్నికలు మావి. ఫలితాలవల్ల ఏదైనా ప్రభావం ఉంటుందని ఎవరైనా భావిస్తే.. మమ్మల్ని సంప్రదిస్తే అప్పుడు ఆలోచిస్తాం. రాజకీయ నేతలపై ఆరోపణలు వచ్చినప్పుడు ఎన్నికల సంఘం త్వరగా స్పందించదనే విమర్శలున్నాయి. దీనిపై మీరేమంటారు? విమర్శలు చేసే వారు అనుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తీర్పు ఇవ్వదు. ప్రవర్తనా నియమావళి, ఇతర నిబంధనలను ఉల్లంఘించినప్పుడు కచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. ఎవరో ఏదో చెప్పారని వెంటనే చర్యలు తీసుకోం. రాష్ట్ర విభజన జరుగుతున్న వేళ ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో భావోద్వేగాలు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు అంతరాయాలు ఏర్పడతాయని మీరు భావిస్తున్నారా? ఈ తరుణంలో ఈసీ ఎలాంటి పాత్ర పోషించబోతోంది? ఎన్నికల సమర్థ నిర్వహణకు అన్ని చర్యలు తీసుకుంటాం. సున్నితమైన, సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ కూడా సమర్థంగా నిర్వహిస్తాం. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ఎన్నికల ఘట్టం కదా! దీనికెన్నిరోజులు కసరత్తు చేశారు? ఈ ఘట్టానికి సారథ్యం వహించడంపై ఎలాంటి అనుభూతి పొందుతున్నారు? లోక్‌సభ ఎన్నికలకు ఏడాదిగా కసరత్తు చేస్తున్నాం. ముఖ్యంగా ఓటర్ల నమోదు, ఓటర్ల గుర్తింపు కార్డుల జారీ, వాటి పంపిణీ, ఉద్యోగుల డేటా బేస్ తయారీ, భద్రత అంశాల పర్యవేక్షణ.. ఇలా 12 నెలలుగా కసరత్తు జరుగుతోంది. మా బాధ్యతలను మేం సమర్థంగా, నిష్పాక్షికతతో పారదర్శకంగా పూర్తిచేస్తాం. ఏపీపై గందరగోళం లేదు... ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉంది. అపాయింటెడ్ డే జూన్ 2న ఉంది. ఎన్నికల ఫలితాలు మే 16న రాబోతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి ప్రక్రియ ఉండబోతోంది? ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మా పాత్ర ఏమీ ఉండదు. ఎన్నికైన లోక్‌సభ అభ్యర్థుల జాబితాను రాష్ట్రపతికి సమర్పిస్తాం. శాసనసభ్యుల జాబితాను గవర్నర్‌కు అందజేస్తాం. దాంతో మా పని పూర్తవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగినా.. అపాయింటెడ్ డే నాడు తెలంగాణకు చెందిన 119 మంది శాసనసభ్యులు, 17 మంది లోక్‌సభ సభ్యులు తెలంగాణ రాష్ట్రానికి చెందుతారు. మిగిలిన వాళ్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందుతారు. ఇందులో గందరగోళం ఏమీలేదు. చట్టంలోనే ఇందుకు సంబంధించిన నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. -
సార్వత్రిక సైరన్ మోగెన్
నోటిఫికేషన్ విడుదల : ఏప్రిల్ 12న నామినేషన్ల దాఖలుకు గడువు: ఏప్రిల్ 19 నామినేషన్ల పరిశీలన : ఏప్రిల్ 21న నామినేషన్ల ఉపసంహరణ గడువు: ఏప్రిల్ 23 వరకు ఎన్నికలు: మే 7న ఫలితాలు: మే 16న ప్రకటిస్తారు. సాక్షి, గుంటూరు: 16వ సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) విఎస్ సంపత్ బుధవారం ఢిల్లీలో షెడ్యూల్ ప్రకటించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. సీమాంధ్రకు సంబంధించి రెండో విడతలో మే 7న ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ రోజు జిల్లాలోని 17 అసెంబ్లీ, మూడు పార్లమెంటు నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. సాధారణ ఎన్నికల కోసం జనవరి 31న ప్రచురించిన ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో 35,39,011 మంది ఓటర్లున్నారు. మార్చి 9 వరకు కొత్త ఓటు నమోదుకు అవకాశం వుంది. దీంతో మరో పదివేల మంది ఓటర్లు పెరిగే అవకాశాలు వున్నాయి. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడి కోడ్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహ రచనలో నిమగ్నమై ఉండగా, సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ వెలువడటంతో తమ వ్యూహాలకు మరింత పదును పెట్టే పనిలో ఉన్నాయి. జిల్లా యంత్రాంగం ఈ ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ అంతా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు అప్పగించగా, సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పూర్తి బాధ్యతల్ని జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్న అధికారగణం కలెక్టరేట్లో ఓ టోల్ ఫ్రీ నంబరు, ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ప్రారంభించింది. 98499 04013 నంబరును ఏర్పాటు చేశారు. ఈ దఫా ఎన్నికల కమిషన్ తొలిసారిగా ఓటర్లకు స్లిప్పులను పంపిణీ చేయనుంది. ఈ సార్వత్రిక ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులపై జిల్లా కలెక్టర్ఎస్. సురేశ్‌కుమార్ కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. పల్లె ఓట్లే కీలకం: = జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు పల్లె ఓట్లే కీలకం కానున్నాయి. = జిల్లాలోని 12 మునిసిపాలిటీలు, గుంటూరు నగర కార్పొరేషన్ ఓటర్లు మొత్తం కలిపి 11,30,435 ఉంటే, పల్లెల్లో ఓట్లు ఇంతకు రెండింతలు ఉన్నాయి. అంటే దాదాపు 24 లక్షల వరకు పల్లెల్లో ఓటర్లున్నారు. = పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు సుమారు 50 వేల మందికి పైగా అధికంగా ఉన్నారు. = జిల్లా వ్యాప్తంగా 17 నియోజకవర్గాల్లో 3,739 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి అదనంగా మరికొన్ని ఆగ్జిలరీ బూత్‌లు ఏర్పాటు చేయనున్నారు. = 1,598 మంది అధికారులు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. జిల్లాలో మొదలైన రాజకీయ సందడి = మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌తో ఉలిక్కిపడిన రాజకీయ పార్టీలు ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఆశావహ అభ్యర్థుల్లో ఒక్కసారిగా వేడిని పెంచింది. = మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సార్వత్రిక ఎన్నికల తరువాత ప్రకటించాలనే రాజకీయ పార్టీల డిమాండ్ ఇప్పుడు ఊపందుకుంది. -
ఎన్నికల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన
-
ఎన్నికల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన
రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నా, విభజనకు సంబంధించిన ప్రకటనలు వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ప్రధాన ఎన్నికల కమిషనర్ సంపత్ 'సాక్షి'తో అన్నారు. మే 16న ఫలితాలు వచ్చినా పాత అసెంబ్లీ కాలం సమయం పూర్తయిన తర్వాత కొత్త అసెంబ్లీ నోటిఫై అవుతుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎన్నికల కమిషన్ చేతిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు పూర్తయిన వెంటనే తాము రాష్ట్రంలోని నియోజకవర్గాల పునర్విభజనపై దృష్టి పెడతామని సంపత్ తెలిపారు. నేరచరితులను, నల్లధనాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేక పరిశీలకులను నియమించామని, ఎన్నికల కమిషన్ సిబ్బంది సహాయంతో ఇంటింటికీ తిరిగి ఓటర్లకు స్వయంగా ఓటర్ స్లిప్ ఇస్తుందని ఆయన వివరించారు. కొత్త ఓటర్ల నమోదుకు మార్చి 9వరకు గడువుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సంపత్ తెలిపారు. -
ఎన్నికల్లో ధన ప్రభావం ఆందోళనకరం: సంపత్
ఎన్నికల్లో డబ్బు ప్రభావంపై ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వి.ఎస్. సంపత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్, మే నెలల్లో జరగబోయే లోక్‌సభ ఎన్నికలలో డబ్బు ప్రభావాన్ని తగ్గించడానికి, రూపు మాపేందుకు వీలైనన్ని చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంగా ధన ప్రవాహాన్ని అరికట్టేందుకు పోలీసులు, ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు.ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటుచేసి, వీడియో ద్వారా కూడా నిఘా ఉంటుందని సంపత్ తెలిపారు. అభ్యర్థులు డబ్బును ఉపయోగించి, ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు. -
నేడే ఎన్నికల సెరైన్
-
నేడే ఎన్నికల సైరన్
* సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్న ఈసీ * దేశవ్యాప్తంగా 6 లేదా 7 విడతల్లో పోలింగ్! * ఆంధ్రప్రదేశ్‌లో చివరి రెండు దశల్లో ఎన్నికలు? సాక్షి, న్యూఢిల్లీ: దేశ ప్రజలు, రాజకీయ పార్టీలు ఉత్కంఠతో కొంత కాలంగా ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. మరికొన్ని గంటల్లో దేశంలో సాధారణ ఎన్నికల నగారా మోగనుంది. 15వ లోక్‌సభ గడువు మే 31వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో 16వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వి.ఎస్.సంపత్ బుధవారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలకు కూడా షెడ్యూలు ప్రకటించనున్నారు. సీఈసీతో పాటు ఎన్నికల కమిషనర్లు హెచ్.ఎస్.బ్రహ్మ, ఎస్.ఎన్.ఎ.జైదీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. షెడ్యూలు ప్రకటనతో బుధవారం నుంచే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానుంది. సాధారణంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటన కేంద్ర ప్రధాన ఎన్నికల కార్యాలయంలోనే జరుగుతుంది. కానీ ఈసారి వేదికను కేంద్ర ఎన్నికల సంఘం విజ్ఞాన్‌భవన్‌కు మార్చింది. ఎంపిక చేసిన పాత్రికేయులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపింది. ఆహ్వానాలు అందని వారిలో పీఐబీ కార్డులు ఉన్నవారికి ప్రవేశం కల్పించనుంది. ఆరు లేదా ఏడు విడతల్లో ఎన్నికలు..! * ఏప్రిల్ రెండో వారంలో మొదలుపెట్టి మే 15వ తేదీకల్లా మొత్తం ఎన్నికల పర్వాన్ని పూర్తిచేసేందుకు ఈసీ ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిసింది. సాధారణ ఎన్నికలను మొత్తం ఆరు లేదా ఏడు విడతల్లో నిర్వహించనున్నట్లు సమాచారం. * 2004లో నాలుగు విడతలుగా, 2009లో ఐదు విడతలుగా పోలింగ్ నిర్వహించారు. ఈసారి అంతకంటే ఎక్కువగా ఆరు లేదా ఏడు విడతల్లో నిర్వహించే అవకాశం ఉందని ఉన్నతస్థాయి వర్గాలు చెప్తున్నాయి. * ఈ ఎన్నికల్లో దాదాపు 81.4 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గత సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటివరకూ కొత్తగా 9.71 కోట్ల మంది ఓటర్ల జాబితాలో చేరారు. * ఈ అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ.. బుధవారం మొదలుకుని 75 రోజుల పాటు కొనసాగనుంది. ఏప్రిల్ రెండో వారాంతం నుంచి మే 15వ తేదీకి అటూఇటుగా పోలింగ్ ముగియనుంది. * భద్రతా బలగాలను సాధ్యమైనంత ఎక్కువగా వినియోగించుకునేందుకే ఎక్కువ విడతలుగా ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించినట్లు ఈసీ వర్గాలు తెలిపాయి. * నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల్లో మొదటి మూడు విడతల్లో పోలింగ్ ప్రక్రియను ముగించనున్నారు. * విద్యార్థులకు వేసవి సెలవులు, ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మిగిలిన మూడు విడతల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఎన్నికలపై ఉత్కంఠ సాధారణ ఎన్నికల షెడ్యూలు విడుదలవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సరిగ్గా సాధారణ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల వేళ మున్సిపల్ ఎన్నికలకు కూడా షెడ్యూలు విడుదల కావటంతో.. రాష్ట్రంలో ఈసారి లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు చివరి విడతల్లో జరుగుతాయన్న ప్రచారం తెరపైకి వచ్చింది. నిజానికి 2004, 2009లో రాష్ట్రంలో తొలి రెండు విడతల్లోనే పోలింగ్ పూర్తయింది. అవి ఏప్రిల్ మూడు, నాలుగు వారాల్లో జరిగాయి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పర్వం ఏప్రిల్ 7వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగా ఈసారి కూడా తొలి రెండు విడతల్లో నిర్వహిస్తారా? లేక చివరి విడతల్లో నిర్వహిస్తారా? అన్న విషయం బుధవారం స్పష్టంకానుంది. -
జూన్ 1 నాటికి 16వ లోక్‌సభ
అమెరికా సదస్సులో సీఈసీ సంపత్ వెల్లడి ఇప్పటికే కసరత్తులో తలమునకలైన ఎన్నికల సంఘం మార్చి మధ్యలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం వాషింగ్టన్: లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నామని ఎన్నికల ప్రధానాధికారి వీఎస్ సంపత్ తెలిపారు. వచ్చే జూన్ 1 నాటికి కొత్త లోక్‌సభ కొలువు తీరుతుందన్నారు. న్యాయం, నిష్పక్షపాతం, చట్టాల కఠిన అమలు.. 2014 లోక్‌సభ ఎన్నికల నిర్వహణలో ఈ మూడింటినీ కీలకంగా భావిస్తామన్నారు. ఇక్కడి బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్లో యూఎస్- ఇండియా బిజినెస్ కౌన్సిల్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సదస్సులో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. 543 స్థానాలకు గానూ 8 లక్షల పోలింగ్ బూత్‌లలో 5, 6, లేక 7 దశల్లో సాధారణ ఎన్నికలు జరగొచ్చని, సుమారు 78 కోట్ల మంది ఓటింగ్‌లో పాల్గొనే అవకాశముందని సంపత్ తెలిపారు. ఎన్నికల్లో 11.8 లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను ఉపయోగిస్తామని వివరించారు. ఎన్నికల ప్రక్రియ వచ్చే సంవత్సరం మార్చి మూడో వారంలో ప్రారంభం కావొచ్చన్నారు. మొదటి దశ పోలింగ్ తేదీకి ఆరు వారాల ముందు ఎన్నికల నిర్వహణ ప్రకటనను, మూడు వారాల ముందు నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామన్నారు. ప్రకటన విడుదల అయిన తేదీ నుంచే నియమావళి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. పోలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించేముందు అన్ని రాజకీయ పార్టీలను, వాతావరణ శాఖను, ఎన్నికల అధికారులను సంప్రదిస్తామన్నారు. పరీక్షల తేదీలు, పండుగలను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. యువ ఓటర్ల వల్లనే..! తాజాగా జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరగడానికి యువ ఓటర్ల సంఖ్య భారీగా పెరగడమే కారణమని సంపత్ పేర్కొన్నారు. యువతను ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యలను చేయడం కోసం ఎన్నికల సంఘం తీవ్రంగా కృషి చేసిందన్నారు. ‘యువతను ఓటర్లుగా నమోదు చేసే కార్యక్రమం బాగా నిర్లక్ష్యానికి గురైందన్న విషయాన్ని మూడేళ్ల క్రితం గుర్తించాము. జనాభా లెక్కలనూ పరిశీలించాం. యువతలో కేవలం 20 శాతం మాత్రమే ఓటర్లుగా నమోదై ఉన్నట్లు గుర్తించాం. దాంతో విసృ్తతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాం. ఈసీ కృషి ఫలితంగా 80 శాతం యువజనం ఓటర్లుగా నమోదయ్యారు’ అని ఆయన వివరించారు. అమెరికా తరహాలో ముందస్తు ఓటింగ్ విధానంలో ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల చట్టాలు అంగీకరించవన్నారు. చాలా దేశాల్లో ఆ విధానం విజయవంతమైనప్పటికీ, భారత్ పరిస్థితులకు అది అనువు కాదన్నారు. -
సర్వేల నిషేధం మీద శ్రీరంగనీతులు
‘ఇప్పుడు ఎన్నికలు జరిగితే....’ అన్న షర తు మీద ఫలితాల సర్వేలు వెలువడతాయి. వీటి మీద రాజకీయ పార్టీలకీ, వాటి నేతలకీ ఉన్న అభిప్రాయాలు ఎప్పుడూ ఒకే విధంగా కనిపించవు. ఒపీనియన్ పోల్స్ పేరుతో పిలిచే వీటి మీద రాజకీయుల ఒపీనియన్స్ ‘ఛేంజ్’అవుతూనే ఉన్నాయి. ఇరవయ్యేళ్లుగా అసెంబ్లీలు, లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా క్రమం తప్పకుండా సర్వేలు సాక్షాత్కరి స్తూనే ఉన్నాయి. ఈ సర్వేలను నిషేధించాలని తాజాగా కాంగ్రెస్ నినాదం అందుకుంది. ఈ నెల మొదటివారంలో ఈ ప్రయత్నాలు మొదల య్యాయి. ఈ సూచన అటార్నీ జనరల్ గులాం ఇ వాహనవతి చేసినదేనని వార్తలు వచ్చాయి. యూపీయే ప్రధాన భాగస్వామి కాంగ్రెస్ ఈ ప్రకటన చేయగానే, కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఆ అంశాన్ని ఎన్నికల సంఘాని(ఈసీ)కి ఆలస్యం లేకుండా నివేదిం చింది. ఆగమేఘాల మీద ఈసీ అన్ని పార్టీల అభిప్రాయాలను కోరింది. సీపీఐ మినహా అన్ని జాతీయ రాజకీయ పక్షాలు మనోగ తాన్ని వెల్లడించాయి. తొమ్మిది ప్రాంతీయ పార్టీలు కూడా చెప్పాయి. వింతేమిటంటే, ఎక్కువ పార్టీలు నిషేధానికి అనుకూలమే. కాంగ్రెస్‌తో పాటు డీఎంకే, ఎస్పీ, బీఎస్పీలు నిషేధించమంటున్నాయి. బీజేపీ మిత్రపక్షం అకాలీదళ్ కూడా ఇదే మంచిదని చెబుతోంది. కానీ బీజేపీ మాత్రం సర్వేల నిషేధం అంటే భావప్రకటనా స్వేచ్ఛ మీద వేటువేయడమే నని ఇప్పుడు ఎలుగెత్తి చాటుతోంది. రాజ్య సభలో బీజేపీ నాయకుడు అరుణ్‌జైట్లీ ‘పరాజి తులు నిషేధం కోరతారు’ అని సూత్రీకరించారు. ఇదంతా అక్కసుతో చేస్తున్నదేనని అను కోవడానికి ఏమాత్రం సందేహించనక్కరలేని సమయంలో కాంగ్రెస్ ఈ ప్రతిపాదన తెచ్చిం ది. ఆ పార్టీకి ఏ దిశ నుంచీ ఆశాకిరణం కని పించడంలేదు. ఉత్తరప్రదేశ్‌లో రెండు దశా బ్దాల నుంచీ, బీహార్‌లో 1990 నుంచి ఆ పార్టీ అధికారంలో లేదు. గుజరాత్లో మూడు దశా బ్దాల నుంచి ఆ పార్టీ ఆధిక్యం సాధించలేకపో తోంది. తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెం గాల్, పంజాబ్‌లలో మళ్లీ బతికి బట్టకట్టే అవ కాశం దరిదాపుల్లో లేదు. ఇప్పుడు మధ్య ప్రదేశ్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలలో ఓడిపోతే వరసగా మూడోసారి బీజేపీకి అధి కారం అప్పగించినట్టే. ఎంపీతో పాటే జరుగు తున్న ఇంకో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక లలో రాజస్థాన్, ఛత్తీస్గడ్ బీజేపీ కాతాలోకి పోయేవేనని సర్వేలు చెప్పాయి. ఢిల్లీ బీజేపీకి దక్కడం అనుమానం. అలాఅని ఢిల్లీని కాం గ్రెస్ కాతాలో సర్వేలు వేయలేదు. ఇంకా 2014 లోక్‌సభ ఎన్నికలలో యూపీయే వెనుక బడి, ఎన్డీఏ ముందంజలో ఉండవచ్చునని సర్వేలు ఘోషించాయి. ప్రధాని అభ్యర్థిత్వం లో రాహుల్ కంటె మోడీ ముందంజలో ఉన్న ట్టు చెప్పి సర్వేలు పుండు మీద కారం రాశాయి. ఈ ఉక్రోషంతోనే కాంగ్రెస్ సర్వేల మీద ధ్వజమెత్తుతున్నదని బీజేపీ విశ్లేషిచింది. పరా జితులే నిషేధాన్ని కోరతారన్న జైట్లీ మాట స్వీయానుభవంతో చెప్పిందేనని కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబాల్ మాటతో అర్థమవుతుంది. ఏప్రిల్ 4, 2004న అప్పటి న్యాయశాఖ మంత్రి జైట్లీ, బీజేపీ సర్వేల నిషే ధాన్ని కోరిన సంగతిని మరిచిపోతే ఎలా అని సిబాల్ చురక వేశారు. ఎన్నికల సంఘం మాజీ కమిషనర్లు టీఎస్ కృష్ణమూర్తి, ఎన్. గోపాలస్వామి కూడా ఆ సంగతి వెల్లడిం చారు. అంటే కాంగ్రెస్, బీజేపీ రెండూ ఈ అం శంలో పిల్లిమొగ్గలు వేస్తున్నాయి. మన దేశంలో 1957 ఎన్నికలకు ముందు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఒపీని యన్ సంస్థ మొదటిసారి సర్వే నిర్వహిం చింది. ఎరిక్ డాకోస్టా దీని అధిపతి. నిజానికి 1824 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికలలో జాన్ క్విన్సీ ఆడమ్స్ మీద ఆండ్రూ జాక్సన్‌కు ఆధిక్యం సాధిస్తాడని హారీస్‌బర్గ్ పెన్సిల్వేనియా అనే సర్వే సంస్థ వెల్లడించింది. తొలిరోజులలో సర్వేలంటే అభ్యంతరాలు లేని కాంగ్రెస్‌పార్టీకి ఇప్పుడు ఏవగింపు ఎందుకని బీజేపీ నాయ కుడు రాజీవ్ ప్రతాప్ రూడీ ప్రశ్నిస్తున్నారు. దీని మీద కాంగ్రెస్ ప్రముఖుడు దిగ్విజయ్ సింగ్ తనదైన శైలిలో వాదిస్తున్నారు. ఎంపీలో మూడు కోట్ల మంది ఓటర్లు ఉంటే, 2800 మందిని మాత్రమే సంప్రతించి, అదే మొత్తం ఓటర్ల మనోగతమని చెబితే ఎలా అంటున్నా రాయన. గతంలో తాను ఒక సర్వే సంస్థతో సంప్రతించానని, సొమ్ము ఇస్తే కాంగ్రెస్ అను కూల సర్వేలు రూపొందిస్తామని చెప్పారని, వీటి విశ్వసనీయత ప్రశ్నార్థకమేనని కూడా దిగ్గీరాజా చెప్పారు. ఈ వ్యాఖ్యను ‘సి.ఓటర్’ సంపాదకుడు యశ్వంత్ దేశ్‌ముఖ్ ఎద్దేవా చేస్తున్నారు. భారత ప్రభుత్వ ప్రణాళికలూ, విధానాలూ ఎన్ఎస్ఎస్ఓ అనే సొంత సంస్థ చేసిన సర్వేల ఆధారంగా రూపొందించేవి కాదా? అని ప్రశ్నించారాయన. ప్రస్తుతం సర్వే ల మీద పాక్షిక నిషేధం ఉన్నట్టే. ప్రకటన వెలు వడినాక సర్వేలు నిషిద్ధం. ఏమైనా నిషేధం మీద కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. ఈ స్థాయి నిషేధాలకు ఈసీకి విస్తృతాదికారాలు లేవం టూ ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్ చేతులు దులుపుకున్నారు. కాంగ్రెస్ ఏం చేస్తుందో చూడాలి! -డా॥గోపరాజు నారాయణరావు -
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సమర భేరీ మోగింది. ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్‌గఢ్‌లలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. 2014 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఈ ఎన్నికలను అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 11, 19న రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. మిగతా నాలుగు రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 25, రాజస్థాన్‌లో డిసెంబర్ 1, ఢిల్లీ, మిజోరాంలో డిసెంబర్ 4న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్(సీఈసీ) వీఎస్ సంపత్ తెలిపారు. డిసెంబర్ 8న ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు చేపడతామని చెప్పారు. సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పునకు అనుగుణంగా నచ్చని అభ్యర్థులను తిరస్కరించే హక్కును మొట్టమొదటిసారిగా ఈ ఎన్నికల్లో ఓటరుకు కల్పించనున్నారు. ఈవీఎం మిషన్లలో ‘పైవారు ఎవరూ కాదు’ అన్న మీటను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఐదు రాష్ట్రాల్లో 630కిపైగా నియోజకవర్గాల్లో సుమారు 11 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారని వీఎస్ సంపత్ వివరించారు. ఇందుకు 1.30 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. వివిధ కేసుల్లో దోషులుగా తేలి అనర్హతకు గురైన ఎంపీల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారా అని విలేకరులు ప్రశ్నించగా.. లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ఆయా స్థానాలను నోటిఫై చేసిన తర్వాతే తాము ఖాళీలను ప్రకటిస్తామని చెప్పారు. విజయంపై కాంగ్రెస్, బీజేపీ ధీమా ఐదు రాష్ట్రాల్లో తామే విజయం సాధిస్తామని అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు ధీమా వ్యక్తంచేశాయి. తమ విధానాలు, పథకాలే విజయాన్ని కట్టబెడతాయని కాంగ్రెస్ పేర్కొనగా.. ఎన్నికల్లో మోడీ ప్రభంజనం ఖాయమని బీజేపీ ఉద్ఘాటించింది. ‘‘సెమీ ఫైనల్, క్వార్టర్ ఫైనల్ ఏమీ ఉండవు. మాకు ఏ ఎన్నికలైనా ఫైనలే. మా పథకాలు, విధానాలతో ప్రజల్లోకి వెళ్తాం. వారే తీర్పు చెబుతారు’’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మీమ్ అఫ్జల్ పేర్కొన్నారు. నరేంద్ర మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినందున ఈ ఎన్నికలను 2014 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పుగా చూస్తారా అని ప్రశ్నించగా.. ‘‘మేం ఏ ఒక్కరినో దృష్టిలో ఉంచుకొని ఎన్నికలకు వెళ్లం..’’ అని ఆయన బదులిచ్చారు. ఐదు రాష్ట్రాల్లో తామే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌కు చెందిన మరో నేత రషీద్ అల్వీ అన్నారు. నరేంద్రమోడీ అంశం ఈ ఎన్నికల్లో తమకు తప్పకుండా కలిసి వస్తుందని బీజేపీ ప్రతినిధి సుధాంశు త్రివేది చెప్పారు. ‘‘ఈ దేశంలో మోడీయే అత్యంత ప్రజాదరణ కలిగిన నేత అని అనేక సర్వేల్లో తేలింది. అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రాల అంశాల ఆధారంగా జరుగుతాయి. అయినా జాతీయ పరిణామాలు కూడా తమ వంతు పాత్ర వహిస్తాయి’’ అని త్రివేదీ వివరించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో తమ ప్రభుత్వ సుపరిపాలన మళ్లీ పార్టీకి అధికారాన్ని అందిస్తుందని, ఇక రాజస్థాన్, ఢిల్లీలో కాంగ్రెస్ వ్యతిరేకత లాభిస్తుందని వివరించారు. నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, మిజోరాంలో గట్టి పోటీ ఇస్తామని చెప్పారు. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఢిల్లీ, రాజస్థాన్, మిజోరాంలలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ అధికారంలో ఉంది. మంచి వాతావరణంలో ఎన్నికలు జరగాలి: మోడీ ఐదు రాష్ట్రాలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ స్వాగతించారు. ‘‘మన ప్రజాస్వామ్యానికి ఎన్నికలు అంటే పండుగ లాంటివి. ఈ ఎన్నికలు స్ఫూర్తిదాయకమైన వాతావరణంలో జరగాలని కోరుకుంటున్నా’’ అని ట్విట్టర్లో ఆయన వ్యాఖ్యానించారు.