
మున్సి‘పోల్’ ఆపాలని మేం కోరం
* ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో సీఈసీ సంపత్ స్పష్టీకరణ
* వాళ్ల ఎన్నికలు వాళ్లవి.. మా ఎన్నికలు మావి
* ‘ఫలితాల ప్రభావం’పై అభ్యంతరాలు వస్తే పరిశీలిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూలు విడుదల చేసినందున.. ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను ఆపాలని తాము రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను అడగబోమని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎస్.సంపత్ పేర్కొన్నారు. మున్నిపల్ ఎన్నికల ఫలితాల ప్రభావం సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందని గానీ, ఫలితాలు ఆపాలని గానీ తమకు విజ్ఞప్తులు వచ్చినప్పుడు వాటిని పరిశీలిస్తామని చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో ఫలానా రీతిలో వ్యవహరించాలన్న నిబంధనలేవీ లేవని ఆయన పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
సాక్షి: రాష్ట్రంలో తొలిసారిగా ఒకేసారి మున్సిపల్ ఎన్నికలు, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ మొత్తం ప్రక్రియను సక్రమంగా నిర్వహించేందుకు యంత్రాంగం సరిపోతుందా? ఈ కొత్తరకమైన పరిస్థితిని ఎన్నికల సంఘం ఎలా చూస్తోంది?
సీఈసీ: మున్సిపల్ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది. వారి యంత్రాంగాన్ని వారు చూసుకుంటారు. వాటికి సార్వత్రిక ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధం లేదు. ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేలా యంత్రాంగం అందుబాటులో ఉంది.
రాష్ట్రంలో దాదాపు 35 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల నిర్వహణకు ఒకవేళ యంత్రాంగం చాలదని వినతులు వస్తే షెడ్యూలులో మార్పులు ఉంటాయా?
సీఈసీ: పరీక్షలు, యంత్రాంగం అన్నీ బేరీజు వేసుకునే షెడ్యూలు కసరత్తు చేశాం. దాంట్లో ఎలాంటి మార్పులు ఉండబోవు.
సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఏప్రిల్ 2వ తేదీన వెలువడనున్నాయి. ఈ ఫలితాల ప్రభావం సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లపై పడుతుందనే వాదన ఉంది. అందువల్ల ఫలితాలను వాయిదావేసే అవకాశం ఉందా?
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మాకు సమాచారం లేదు. వాళ్ల ఎన్నికలను ఆపాలని మేం కోరం. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ. వాళ్ల ఎన్నికలు వాళ్లవి. మా ఎన్నికలు మావి. ఫలితాలవల్ల ఏదైనా ప్రభావం ఉంటుందని ఎవరైనా భావిస్తే.. మమ్మల్ని సంప్రదిస్తే అప్పుడు ఆలోచిస్తాం.
రాజకీయ నేతలపై ఆరోపణలు వచ్చినప్పుడు ఎన్నికల సంఘం త్వరగా స్పందించదనే విమర్శలున్నాయి. దీనిపై మీరేమంటారు?
విమర్శలు చేసే వారు అనుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తీర్పు ఇవ్వదు. ప్రవర్తనా నియమావళి, ఇతర నిబంధనలను ఉల్లంఘించినప్పుడు కచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. ఎవరో ఏదో చెప్పారని వెంటనే చర్యలు తీసుకోం.
రాష్ట్ర విభజన జరుగుతున్న వేళ ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో భావోద్వేగాలు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు అంతరాయాలు ఏర్పడతాయని మీరు భావిస్తున్నారా? ఈ తరుణంలో ఈసీ ఎలాంటి పాత్ర పోషించబోతోంది?
ఎన్నికల సమర్థ నిర్వహణకు అన్ని చర్యలు తీసుకుంటాం. సున్నితమైన, సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ కూడా సమర్థంగా నిర్వహిస్తాం.
ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ఎన్నికల ఘట్టం కదా! దీనికెన్నిరోజులు కసరత్తు చేశారు? ఈ ఘట్టానికి సారథ్యం వహించడంపై ఎలాంటి అనుభూతి పొందుతున్నారు?
లోక్‌సభ ఎన్నికలకు ఏడాదిగా కసరత్తు చేస్తున్నాం. ముఖ్యంగా ఓటర్ల నమోదు, ఓటర్ల గుర్తింపు కార్డుల జారీ, వాటి పంపిణీ, ఉద్యోగుల డేటా బేస్ తయారీ, భద్రత అంశాల పర్యవేక్షణ.. ఇలా 12 నెలలుగా కసరత్తు జరుగుతోంది. మా బాధ్యతలను మేం సమర్థంగా, నిష్పాక్షికతతో పారదర్శకంగా పూర్తిచేస్తాం.
ఏపీపై గందరగోళం లేదు...
ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉంది. అపాయింటెడ్ డే జూన్ 2న ఉంది. ఎన్నికల ఫలితాలు మే 16న రాబోతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి ప్రక్రియ ఉండబోతోంది?
ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మా పాత్ర ఏమీ ఉండదు. ఎన్నికైన లోక్‌సభ అభ్యర్థుల జాబితాను రాష్ట్రపతికి సమర్పిస్తాం. శాసనసభ్యుల జాబితాను గవర్నర్‌కు అందజేస్తాం. దాంతో మా పని పూర్తవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగినా.. అపాయింటెడ్ డే నాడు తెలంగాణకు చెందిన 119 మంది శాసనసభ్యులు, 17 మంది లోక్‌సభ సభ్యులు తెలంగాణ రాష్ట్రానికి చెందుతారు. మిగిలిన వాళ్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందుతారు. ఇందులో గందరగోళం ఏమీలేదు. చట్టంలోనే ఇందుకు సంబంధించిన నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.