Central chief election commissioner
-
సగానికి పైగా ఓట్లొస్తేనే గెలిచినట్టు!
♦ లేదంటే మళ్లీ ఎన్నిక నిర్వహించాలి ♦ సీఈసీ నసీం జైదీ వ్యాఖ్యలు ♦ ‘నేరంగా’ చెల్లింపు వార్తలు... వాటికి రెండేళ్ల జైలు ♦ ‘నేర’ అభ్యర్థుల కేసులను ఏడాదిలోగా పరిష్కరించాలి ♦ కేసులున్న, జైల్లో ఉన్నవారిని పోటీకి అనుమతించొద్దు ♦ రాజ్యసభ తరహాలో ఎమ్మెల్సీ ఎన్నికలుండాలి ♦ లా కమిషన్ వద్ద పెండింగ్‌లో ఎన్నికల సంస్కరణలు సాక్షి, హైదరాబాద్: ‘‘ఏ ఎన్నికల్లో అయినా పోలైన ఓట్లల్లో 50 శాతానికి మించి ఓట్లు సాధిస్తేనే అభ్యర్థి గెలుపొందినట్టు గుర్తించాలి. ఏ అభ్యర్థీ సగానికి మించి ఓట్లు సాధించకపోతే ఆ ఎన్నికను పరిగణనలోకి తీసుకోవద్దు. మళ్లీ ఎన్నిక నిర్వహించాలి’’ అని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) డాక్టర్ సయ్యద్ నసీమ్ అహ్మద్ జైదీ అభిప్రాయపడ్డారు. ‘ఎన్నికలు-రాజకీయ సంస్కరణలు’ అంశంపై శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైన 12వ వార్షిక జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. అభ్యర్థి ఆదాయ వనరులేంటో ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించాలన్న అంశంపై ఫారం ‘24-ఎ’ను సవరించాలని తాము లా కమిషన్‌కు లేఖ రాసినట్టు వివరించారు. నేరపూరిత అభ్యర్థులపై కేసులన్నీ ఏడాదిలోగా కోర్టుల్లో పరిష్కారం కావాలన్నారు. ‘‘సరైన అభ్యర్థులు లేరని భావిస్తే ఓటర్లు ‘నోటా’ను ఉపయోగించుకోవాలి. 2014 సాధారణ ఎన్నికల్లో 60 లక్షల మంది నోటాకు ఓటేశారు. అయితే నోటా పారదర్శకతకు ప్రమాణమా, లేదా అన్న విషయాన్ని నిపుణులు పరిశీలించాలి’’ అని కోరారు. కేసులు విచారణలో ఉన్న, లేదా జైల్లో ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించడం ద్వారా నేరపూరిత, బలప్రయోగ రాజకీయాలను నివారించవచ్చన్నారు. ఇందుకోసం స్పష్టమైన నిబంధనలు, జరిమానాలు ఉండాలన్నారు. బిహార్‌లో ఈసారి హింస లేకుండా ఎన్నికలు జరిగాయన్నారు. చెల్లింపు వార్తలను నివారించాలని, వాటిని నేరంగా పరిగణించి రెండేళ్ల జైలు శిక్ష విధించాలని జైదీ అన్నారు. దేశంలో సగటున రెండున్నర రోజులకో రాజకీయ పార్టీ ఈసీ వద్ద నమోదవుతోందని ఆయన చెప్పారు. పదేళ్లపాటు ఎన్నికల్లో పోటీయే చేయని పార్టీల గుర్తింపును రద్దు చేయాలని అభిప్రాయపడ్డారు. ‘‘సీఈసీ వద్ద 85 కోట్ల మంది ఓటర్ల వివరాలున్నా యి. వీరిలో 10 కోట్ల మంది మొబైల్ నంబ ర్లున్నాయి. ఇతర వెబ్సైట్లతో పోలిస్తే ఎన్నికల సమయం లో ఈసీ వెబ్‌సైట్‌ను 35 శాతం మంది ఎక్కువగా చూశారన్నారు. ఈసీ చేసిన 40 సిఫార్సులు లా కమిషన్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని ఆయన చెప్పారు. 2010 నుంచి లా కమిషన్ సమావేశాలే జరగకపోవడమే ఇందుకు కారణమన్నారు. ‘‘ఎన్నికల్లోకి నల్లధనం రాకుండా చూడాలి. ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా రాజ్యసభ ఎన్నికల మాదిరిగా నిర్వహించాలి. మెజారిటీ రాష్ట్రాలు ఇందుకు సుముఖంగా ఉన్నాయి. ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేస్తాం. దేశవ్యాప్తంగా ఒకే ఓటర్ జాబితా ఉండాలనేది మా అభిప్రా యం’’ అని చెప్పారు. ఎన్నికల్లో ఓటర్లను సరుకుగా పరిగణిస్తున్నార ని మాజీ సీఈసీ హెచ్.ఎస్.బ్రహ్మ ఆవేదన వెలిబుచ్చారు. రాజకీయాలు నేరమయమయ్యాయని, పార్టీల్లో పారదర్శకత లోపించిం దని అన్నారు. దామాషా పద్దతిలో ఎన్నికలు నిర్వహించాలని, లోక్‌సభ సీట్ల ను 1,500 వరకు పెంచాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమంలో లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, కె.జె.రావు, కాంగ్రెస్ నుంచి దాసోజు శ్రవణ్, శైలేశ్ గాంధీ, ప్రముఖ పాత్రికేయులు, పలు రాష్ట్రాల నుంచి మేధావులు, విద్యార్థులు పాల్గొన్నారు. అఫిడవిట్లో వాస్తవాలు దాచినా రెండేళ్ల జైలు ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారమిచ్చినా, వాస్తవాలను దాచినా దాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించి, సదరు అభ్యర్థికి రెండేళ్ల జైలుశిక్ష విధించాలని జైదీ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఈసీ చేసిన సిఫార్సులను లా కమిషన్ కూడా ఇప్పటికే ఆమోదించగా ప్రస్తుతం కేంద్ర న్యాయ శాఖ పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. ఎన్నికల ట్రస్టులు విదేశీ నిధులు పొం దకుండా ప్రస్తుతం ఎలాంటి నిషేధం లేద ని జైదీ గుర్తు చేశారు. -
మున్సి‘పోల్’ ఆపాలని మేం కోరం
* ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో సీఈసీ సంపత్ స్పష్టీకరణ * వాళ్ల ఎన్నికలు వాళ్లవి.. మా ఎన్నికలు మావి * ‘ఫలితాల ప్రభావం’పై అభ్యంతరాలు వస్తే పరిశీలిస్తాం సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూలు విడుదల చేసినందున.. ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను ఆపాలని తాము రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను అడగబోమని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎస్.సంపత్ పేర్కొన్నారు. మున్నిపల్ ఎన్నికల ఫలితాల ప్రభావం సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందని గానీ, ఫలితాలు ఆపాలని గానీ తమకు విజ్ఞప్తులు వచ్చినప్పుడు వాటిని పరిశీలిస్తామని చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో ఫలానా రీతిలో వ్యవహరించాలన్న నిబంధనలేవీ లేవని ఆయన పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సాక్షి: రాష్ట్రంలో తొలిసారిగా ఒకేసారి మున్సిపల్ ఎన్నికలు, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ మొత్తం ప్రక్రియను సక్రమంగా నిర్వహించేందుకు యంత్రాంగం సరిపోతుందా? ఈ కొత్తరకమైన పరిస్థితిని ఎన్నికల సంఘం ఎలా చూస్తోంది? సీఈసీ: మున్సిపల్ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది. వారి యంత్రాంగాన్ని వారు చూసుకుంటారు. వాటికి సార్వత్రిక ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధం లేదు. ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేలా యంత్రాంగం అందుబాటులో ఉంది. రాష్ట్రంలో దాదాపు 35 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల నిర్వహణకు ఒకవేళ యంత్రాంగం చాలదని వినతులు వస్తే షెడ్యూలులో మార్పులు ఉంటాయా? సీఈసీ: పరీక్షలు, యంత్రాంగం అన్నీ బేరీజు వేసుకునే షెడ్యూలు కసరత్తు చేశాం. దాంట్లో ఎలాంటి మార్పులు ఉండబోవు. సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఏప్రిల్ 2వ తేదీన వెలువడనున్నాయి. ఈ ఫలితాల ప్రభావం సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లపై పడుతుందనే వాదన ఉంది. అందువల్ల ఫలితాలను వాయిదావేసే అవకాశం ఉందా? మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మాకు సమాచారం లేదు. వాళ్ల ఎన్నికలను ఆపాలని మేం కోరం. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ. వాళ్ల ఎన్నికలు వాళ్లవి. మా ఎన్నికలు మావి. ఫలితాలవల్ల ఏదైనా ప్రభావం ఉంటుందని ఎవరైనా భావిస్తే.. మమ్మల్ని సంప్రదిస్తే అప్పుడు ఆలోచిస్తాం. రాజకీయ నేతలపై ఆరోపణలు వచ్చినప్పుడు ఎన్నికల సంఘం త్వరగా స్పందించదనే విమర్శలున్నాయి. దీనిపై మీరేమంటారు? విమర్శలు చేసే వారు అనుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తీర్పు ఇవ్వదు. ప్రవర్తనా నియమావళి, ఇతర నిబంధనలను ఉల్లంఘించినప్పుడు కచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. ఎవరో ఏదో చెప్పారని వెంటనే చర్యలు తీసుకోం. రాష్ట్ర విభజన జరుగుతున్న వేళ ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో భావోద్వేగాలు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు అంతరాయాలు ఏర్పడతాయని మీరు భావిస్తున్నారా? ఈ తరుణంలో ఈసీ ఎలాంటి పాత్ర పోషించబోతోంది? ఎన్నికల సమర్థ నిర్వహణకు అన్ని చర్యలు తీసుకుంటాం. సున్నితమైన, సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ కూడా సమర్థంగా నిర్వహిస్తాం. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ఎన్నికల ఘట్టం కదా! దీనికెన్నిరోజులు కసరత్తు చేశారు? ఈ ఘట్టానికి సారథ్యం వహించడంపై ఎలాంటి అనుభూతి పొందుతున్నారు? లోక్‌సభ ఎన్నికలకు ఏడాదిగా కసరత్తు చేస్తున్నాం. ముఖ్యంగా ఓటర్ల నమోదు, ఓటర్ల గుర్తింపు కార్డుల జారీ, వాటి పంపిణీ, ఉద్యోగుల డేటా బేస్ తయారీ, భద్రత అంశాల పర్యవేక్షణ.. ఇలా 12 నెలలుగా కసరత్తు జరుగుతోంది. మా బాధ్యతలను మేం సమర్థంగా, నిష్పాక్షికతతో పారదర్శకంగా పూర్తిచేస్తాం. ఏపీపై గందరగోళం లేదు... ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉంది. అపాయింటెడ్ డే జూన్ 2న ఉంది. ఎన్నికల ఫలితాలు మే 16న రాబోతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి ప్రక్రియ ఉండబోతోంది? ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మా పాత్ర ఏమీ ఉండదు. ఎన్నికైన లోక్‌సభ అభ్యర్థుల జాబితాను రాష్ట్రపతికి సమర్పిస్తాం. శాసనసభ్యుల జాబితాను గవర్నర్‌కు అందజేస్తాం. దాంతో మా పని పూర్తవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగినా.. అపాయింటెడ్ డే నాడు తెలంగాణకు చెందిన 119 మంది శాసనసభ్యులు, 17 మంది లోక్‌సభ సభ్యులు తెలంగాణ రాష్ట్రానికి చెందుతారు. మిగిలిన వాళ్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందుతారు. ఇందులో గందరగోళం ఏమీలేదు. చట్టంలోనే ఇందుకు సంబంధించిన నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.