సగానికి పైగా ఓట్లొస్తేనే గెలిచినట్టు! | CEC Naseem Zaidi Comments | Sakshi
Sakshi News home page

సగానికి పైగా ఓట్లొస్తేనే గెలిచినట్టు!

Published Sun, Mar 13 2016 12:36 AM | Last Updated on Tue, Aug 14 2018 5:15 PM

సగానికి పైగా ఓట్లొస్తేనే గెలిచినట్టు! - Sakshi

సగానికి పైగా ఓట్లొస్తేనే గెలిచినట్టు!

♦ లేదంటే మళ్లీ ఎన్నిక నిర్వహించాలి
♦ సీఈసీ నసీం జైదీ వ్యాఖ్యలు
♦  ‘నేరంగా’ చెల్లింపు వార్తలు... వాటికి రెండేళ్ల జైలు
♦ ‘నేర’ అభ్యర్థుల కేసులను ఏడాదిలోగా పరిష్కరించాలి
♦ కేసులున్న, జైల్లో ఉన్నవారిని పోటీకి అనుమతించొద్దు
♦ రాజ్యసభ తరహాలో ఎమ్మెల్సీ ఎన్నికలుండాలి
♦ లా కమిషన్ వద్ద పెండింగ్‌లో ఎన్నికల సంస్కరణలు
 
 సాక్షి, హైదరాబాద్: ‘‘ఏ ఎన్నికల్లో అయినా పోలైన ఓట్లల్లో 50 శాతానికి మించి ఓట్లు సాధిస్తేనే అభ్యర్థి గెలుపొందినట్టు గుర్తించాలి. ఏ అభ్యర్థీ సగానికి మించి ఓట్లు సాధించకపోతే ఆ ఎన్నికను పరిగణనలోకి తీసుకోవద్దు. మళ్లీ ఎన్నిక నిర్వహించాలి’’ అని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) డాక్టర్ సయ్యద్ నసీమ్ అహ్మద్ జైదీ అభిప్రాయపడ్డారు. ‘ఎన్నికలు-రాజకీయ సంస్కరణలు’ అంశంపై శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైన 12వ వార్షిక జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. అభ్యర్థి ఆదాయ వనరులేంటో ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించాలన్న అంశంపై ఫారం ‘24-ఎ’ను సవరించాలని తాము లా కమిషన్‌కు లేఖ రాసినట్టు వివరించారు. నేరపూరిత అభ్యర్థులపై కేసులన్నీ ఏడాదిలోగా కోర్టుల్లో పరిష్కారం కావాలన్నారు.

‘‘సరైన అభ్యర్థులు లేరని భావిస్తే ఓటర్లు ‘నోటా’ను ఉపయోగించుకోవాలి. 2014 సాధారణ ఎన్నికల్లో 60 లక్షల మంది నోటాకు ఓటేశారు. అయితే నోటా పారదర్శకతకు ప్రమాణమా, లేదా అన్న విషయాన్ని నిపుణులు పరిశీలించాలి’’ అని కోరారు. కేసులు విచారణలో ఉన్న, లేదా జైల్లో ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించడం ద్వారా నేరపూరిత, బలప్రయోగ రాజకీయాలను నివారించవచ్చన్నారు. ఇందుకోసం స్పష్టమైన నిబంధనలు, జరిమానాలు ఉండాలన్నారు. బిహార్‌లో ఈసారి హింస లేకుండా ఎన్నికలు జరిగాయన్నారు.

 చెల్లింపు వార్తలను నివారించాలని, వాటిని నేరంగా పరిగణించి రెండేళ్ల జైలు శిక్ష విధించాలని జైదీ అన్నారు. దేశంలో సగటున రెండున్నర రోజులకో రాజకీయ పార్టీ ఈసీ వద్ద నమోదవుతోందని ఆయన చెప్పారు. పదేళ్లపాటు ఎన్నికల్లో పోటీయే చేయని పార్టీల గుర్తింపును రద్దు చేయాలని అభిప్రాయపడ్డారు. ‘‘సీఈసీ వద్ద 85 కోట్ల మంది ఓటర్ల వివరాలున్నా యి. వీరిలో 10 కోట్ల మంది మొబైల్ నంబ ర్లున్నాయి. ఇతర వెబ్‌సైట్లతో పోలిస్తే ఎన్నికల సమయం లో ఈసీ వెబ్‌సైట్‌ను 35 శాతం మంది ఎక్కువగా చూశారన్నారు. ఈసీ చేసిన 40 సిఫార్సులు లా కమిషన్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని ఆయన చెప్పారు.

2010 నుంచి లా కమిషన్ సమావేశాలే జరగకపోవడమే ఇందుకు కారణమన్నారు. ‘‘ఎన్నికల్లోకి నల్లధనం రాకుండా చూడాలి. ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా రాజ్యసభ ఎన్నికల మాదిరిగా నిర్వహించాలి. మెజారిటీ రాష్ట్రాలు ఇందుకు సుముఖంగా ఉన్నాయి. ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేస్తాం. దేశవ్యాప్తంగా ఒకే ఓటర్ జాబితా ఉండాలనేది మా అభిప్రా యం’’ అని చెప్పారు. ఎన్నికల్లో ఓటర్లను సరుకుగా పరిగణిస్తున్నార ని మాజీ సీఈసీ హెచ్.ఎస్.బ్రహ్మ ఆవేదన వెలిబుచ్చారు. రాజకీయాలు నేరమయమయ్యాయని, పార్టీల్లో పారదర్శకత లోపించిం దని అన్నారు. దామాషా పద్దతిలో ఎన్నికలు నిర్వహించాలని, లోక్‌సభ సీట్ల ను 1,500 వరకు పెంచాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమంలో లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, కె.జె.రావు, కాంగ్రెస్ నుంచి దాసోజు శ్రవణ్, శైలేశ్ గాంధీ, ప్రముఖ పాత్రికేయులు, పలు రాష్ట్రాల నుంచి మేధావులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అఫిడవిట్లో వాస్తవాలు దాచినా రెండేళ్ల జైలు
 ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారమిచ్చినా, వాస్తవాలను దాచినా దాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించి, సదరు అభ్యర్థికి రెండేళ్ల జైలుశిక్ష విధించాలని జైదీ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఈసీ చేసిన సిఫార్సులను లా కమిషన్ కూడా ఇప్పటికే ఆమోదించగా ప్రస్తుతం కేంద్ర న్యాయ శాఖ పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. ఎన్నికల ట్రస్టులు విదేశీ నిధులు పొం దకుండా ప్రస్తుతం ఎలాంటి నిషేధం లేద ని జైదీ గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement